Director Nag Ashwin: శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‏గా నాగ్ అశ్విన్.. తొలి జీతం ఎంతంటే..

పాన్ ఇండియా లెవల్లో వినిపించిన నాగ్ అశ్విన్ పేరు ఇప్పుడు కల్కి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ఇప్పటివరకు కేవలం మూడు సినిమాలను మాత్రమే తెరకెక్కించి తనదైన దర్శకత్వంతో విమర్శకులను సైతం ఆశ్చర్యానికి గురిచేశాడు. ఎవడే సుబ్రహ్మాణ్యం మూవీతో మొదలైన ప్రయాణం.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు.

Director Nag Ashwin: శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‏గా నాగ్ అశ్విన్.. తొలి జీతం ఎంతంటే..
Nag Ashwin
Follow us

|

Updated on: Jun 26, 2024 | 12:31 PM

యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. భారతీయ పురాణాలను ఆధారంగా చేసుకుని మూడు ప్రపంచాలను సృష్టించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాను చూసేందుకు జనాలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ రివీల్ చేస్తున్నారు మేకర్స్. కలియుగాంతంలో అవతరించే కల్కి అవతారం గురించి ఈ సినిమాలో చెప్పనున్ననట్లు తెలుస్తోంది. కాశీ, కాంప్లెక్స్ శంబలా అనే మూడు ప్రపంచాల మధ్య జరిగే కథే ఈ కల్కి సినిమా అంటూ ముందు నుంచి చెబుతున్నారు. మొన్నటి వరకు పాన్ ఇండియా లెవల్లో వినిపించిన నాగ్ అశ్విన్ పేరు ఇప్పుడు కల్కి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ఇప్పటివరకు కేవలం మూడు సినిమాలను మాత్రమే తెరకెక్కించి తనదైన దర్శకత్వంతో విమర్శకులను సైతం ఆశ్చర్యానికి గురిచేశాడు. ఎవడే సుబ్రహ్మాణ్యం మూవీతో మొదలైన ప్రయాణం.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు కల్కి సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం సృష్టించేందుకు రెడీ అయ్యాడు. నాగ్ అశ్విన్.. ఇప్పుడు ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.

రూ.600 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమాను తెరకెక్కిస్తున్న నాగ్ అశ్విన్ మాత్రం చాలా సింప్లిసిటిగా కనిపిస్తుంటాడు. మితభాషి.. కానీ అసాధారణ ప్రతిభ దాగున్న డైరెక్టర్. చిన్నప్పటి నుంచే కథనాలు, వ్యాసాలు రాయడం అలవాటు. స్కూల్ ఆవరణలో బండరాళ్లు పగలగొడుతూ చెట్లు నరికేస్తుంటే ఫోటోలు తీసి ఇక్కడేం జరుగుతుంది ? ప్రకృతిని నాశనం చేస్తున్నదెవరు ? అనే కథనం రాసి స్కూల్ ప్రిన్సిపల్ చేత చివాట్లు తిన్నారు. నాగ్ అశ్విన్ తల్లిదండ్రులు జయరామ్ రెడ్డి, జయంతి ఇద్దరూ వైద్యులే. హీరో రానా దగ్గుబాటి, నాగ్ అశ్విన్ ఇద్దరూ క్లాస్ మేట్స్. కాలేజీ రోజుల్లో ఇంజనీరింగ్, మెడిసిన్ కాకుండా మణిపాల్ మల్టీమీడియా కోర్సులో చేరారు. వీడియో ఎడిటింగ్ పై పట్టు సాధించారు. సినీ పరిశ్రమలోకి వెళ్లేందుకు తనను తాను నిరూపించుకునేందుకు అండగా ఉన్నారు నాగ్ అశ్విన్ తల్లిదండ్రులు.

చిన్నప్పటి నుంచే కథలు రాయడం.. వాటికి దృశ్యరూపం ఇవ్వాలనే తనయుడి తపనను గుర్తించిన తల్లి జయంతి.. ఆయనను డైరెక్టర్ శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయాలని పంపించారు. అప్పటికీ గోదావరి సినిమా తెరకెక్కిస్తున్న శేఖర్ కమ్ముల ఆ తర్వాత ప్రాజెక్టుకు కలిసి పనిచేద్దామని అన్నారు. ఆ సమయంలో సమయం వృధా చేయకుండా మంచు మనోజ్ హీరోగా నటించిన నేను మీకు తెలుసా సినిమాకు ఏడాగి పనిచేశారు. అప్పుడు నాగ్ అశ్విన్ తొలి సంపాదన రూ.4 వేలు. ఇక ఆతర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు నాగ్ అశ్విన్ వర్క్ చేశారు. నాగీ చేసిన లీడర్ ట్రైలర్ కట్ నచ్చడంతో దానినే విడుదల చేశారు శేఖర కమ్ముల. సినిమాను ఎంత స్నేహపూర్వక వాతావరణంలో తీయొచ్చు అనే విషయాన్ని శేఖర్ కమ్ముల వద్ద నేర్చుకున్నట్లు గతంలో చెప్పుకొచ్చారు నాగ్ అశ్విన్. రూ.4 వేలు తొలి సంపాదనంగా అందుకున్న ఆయన ఇప్పుడు ఏకంగా రూ.600 కోట్లతో సినిమాను రూపొందిస్తున్నారు. కల్కి చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణే, దిశా పటానీ, శోభన, కమల్ హాసన్, మాళవిక నాయర్ కీలకపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.