
జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ‘వార్ 2’ సినిమా టీజర్ మంగళవారం విడుదలైంది. దీనికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా పూర్తి స్థాయి హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. కాగా వార్ 2 టీజర్ తర్వాత ఎన్టీఆర్ ఒక్కసారిగా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు. ఈ సినిమాలో హృతిక్ కి ఎన్టీఆర్ గట్టి పోటీ ఇచ్చినట్లు టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. అంతే కాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడని సమాచారం. ఈ క్రమంలోనే వార్ 2 సినిమాకు ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఇప్పుడు అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ ఆసక్తికర విషయంగా మారింది. వార్ 2 సినిమాకు ఎన్టీఆర్ ఏకంగా 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. బాలీవుడ్ లో ఒక సౌత్ హీరోకు ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందడం మామూలు విషయం కాదంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. మరోవైపు ఇప్పుడు ఎన్టీఆర్ కు ఇండియాతో పాటు విదేశాల్లోనూ క్రేజ్ ఉందని, అలాంటప్పుడు 60 కోట్లు ఇవ్వడంలో ఏ మాత్రం తప్పులేదంటున్నారు తారక్ ఫ్యాన్స్.
వార్ 2 సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ, మొత్తం చిత్రీకరణ రోజులు 150 మాత్రమే. ఈ సినిమా చిత్రీకరణ కోసం చిత్ర బృందం ఆరు దేశాలు చుట్టేసింది. మన దేశంతో పాటు స్పెయిన్, ఇటలీ, అబుదాబి, జపాన్, రష్యాలో వార్ 2 సినిమాను చిత్రీకరించారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ బడ్జెట్‌ను ఖర్చు పెట్టారు.ఈ సినిమాలోని యాక్షన్, డ్యాన్స్ సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించారు. టీజర్ లో యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇప్పటికే చూపించారు. అలాగే ఈ చిత్రంలో హాలీవుడ్ స్థాయి ఛేజింగ్ సన్నివేశాలు ఉంటాయని అర్థమవుతోంది. ఈ సినిమాలో హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య డ్యాన్స్ లు, అదిరిపోయే ఫైట్స్ ఉంటాయని సమాచారం.
‘వార్’ సినిమా ఆరు సంవత్సరాల క్రితం వచ్చింది. ఆ సినిమాలో టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ నటించారు. ప్రస్తుతం హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ విలన్ లాంటి పాత్ర పోషిస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల అవుతుంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. సినిమాలోని ఒకే ఒక నృత్య సన్నివేశం చిత్రీకరించాల్సి ఉంది. హృతిక్ గాయం కారణంగా షూటింగ్ ఆగిపోయింది. జూన్ చివరి నాటికి తిరిగి ప్రారంభమవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.