Jayaprada : నా కెరీర్ పోయినా పర్లేదు ఆ సినిమా చేస్తానని చెప్పా.. నా జీవితాన్నే మార్చేసింది.. ఇప్పటికీ సంచలనమే..
ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ జయప్రద. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. సహాయ నటిగానూ మెప్పించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ తన సుధీర్ఘ సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

తెలుగు సినిమా చరిత్రలో మాయాబజార్, శంకరాభరణం వంటి కొన్ని ఆల్ టైం క్లాసిక్స్ జాబితాలో సాగర సంగమం నిలుస్తుందని నటి జయప్రద వెల్లడించారు. కొంతమంది సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు శంకరాభరణం కన్నా సాగర సంగమం కే. విశ్వనాథ్ గారి అద్భుత సృష్టి అని భావిస్తారని ఆమె పేర్కొన్నారు. అలాంటి ఒక గొప్ప కావ్యంలో తాను మాధవి పాత్రను పోషించడం తన అదృష్టంగా జయప్రద చెప్పుకొచ్చారు. మాధవి పాత్రలో ఎన్నో రకాల షేడ్స్ ఉన్నాయని, ప్రతి కళాకారుడి వెనుక అలాంటి ఒక మాధవి ఉంటే బాగుంటుందని అనిపించేలా ఆ పాత్రను దర్శకుడు తీర్చిదిద్దారని ఆమె ప్రశంసించారు. సాగర సంగమం తన కెరీర్‌లో ఒక అద్భుతమైన మణిహారమని, అది ఒక కావ్యం అని జయప్రద స్పష్టం చేశారు. తన జీవితంలో ఎన్నో మంచి చిత్రాల్లో మొదటి స్థానంలో సాగర సంగమం ఉంటుందని, మాధవి పాత్ర తనకు రావడం ఎన్నో జన్మల పుణ్యమని ఆమె అన్నారు. ఒక ఆర్టిస్ట్‌గా అది తనకొక ఛాలెంజ్ అని, దర్శకుడు కే. విశ్వనాథ్ తనతో పాటు నిలబడ్డారని చెప్పారు. ఆయన తమకు బ్రహ్మతో సమానమని, ఆయన లేకుంటే ఈ రోజున తాను గానీ, కమల్ హాసన్ గానీ, చంద్రమోహన్ గానీ ఈ స్థాయిలో ఉండేవారు కాదని జయప్రద పేర్కొన్నారు. పాత్రలను సృష్టించడం ఒక వంతైతే, వాటిని పలికించడం ఇంకొక ఛాలెంజ్ అని ఆమె వివరించారు.
కమల్ హాసన్ వంటి అప్పటి స్టార్ హీరో, ఒక ఓల్డ్ మ్యాన్ పాత్రలో, జుట్టంతా తెల్లగా, జోలె వేసుకొని, రిక్షా తోసుకుంటూ కనిపించడానికి దర్శకుడికి ఎంతో ధైర్యం ఉండాలని జయప్రద అన్నారు. చెప్పులో కన్నం పడి, సిగరెట్ కాలిన సన్నివేశాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా, కమర్షియల్ చిత్రాలు చేస్తున్న సమయంలో ఓల్డ్ రోల్ ఎలా చేస్తారండి? మీ కెరీర్ ఎఫెక్ట్ అయిపోతుంది అని చాలా మంది తనను అన్నారని జయప్రద తెలిపారు. అయినా సరే, నా కెరీర్ పోనీ, నేను ఈ సినిమా చేస్తాను అని తాను ధైర్యంగా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. శోభన్‌బాబు చెల్లెలి కాపురంలో నల్లటి వేషం, చిరంజీవి బట్లర్‌గా నటించిన సందర్భాలను ఆమె తెలిపారు.
ఆ రోజుల్లో ఒక హీరోకి ముగ్గురు హీరోయిన్లు, బ్యాంకాక్, స్విట్జర్లాండ్, అవుట్‌డోర్‌లు, డ్యాన్స్‌లు, డ్రెస్సులు కావాలనే రోజుల్లో, ఏమీ అక్కర్లేకుండా ఒక కుర్తా, పైజామా, జోలెతో కమల్ హాసన్, ఒక మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్‌తో సాధారణ దుస్తుల్లో మాధవి పాత్రను చూపించిన విశ్వనాథ్ విజన్ అద్భుతమని జయప్రద కొనియాడారు. డ్రీమ్ సాంగ్‌ల కోసం స్విట్జర్లాండ్ వెళ్లాలని తాను అనుకోలేదని, సినిమా కథకు అవసరం లేని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆమె వివరించారు.
ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..
