Jabardasth: నా తర్వాత వచ్చిన సుడిగాలి సుధీర్ స్టార్ రేంజ్‌కు ఎదిగాడు.. కానీ.. చలాకీ చంటి కామెంట్స్ వైరల్
చలాకీ చంటి- సుడిగాలి సుధీర్.. ఇద్దరూ జబర్దస్త్ స్టార్ కమెడియన్లే. ఈ షో కారణంగానే బాగా పాపులర్ అయ్యారు. అయితే చలాకీ చంటికి ముక్కుసూటితనం ఎక్కువ. ఏ విషయంలోనైనా అసలు తగ్గడు. స్ట్రెయిట్ గా మాట్లాడేస్తాడు. అందుకేనేమో స్టార్ రేంజ్ కు ఎదగాల్సిన చంటి బాగా వెనకబడిపోయాడు.

జబర్దస్త్ తో పాపులర్ అయిన వారిలో చలాకీ చంటి ఒకరు. తన కామెడీ టైమింగ్, పంచులతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడీ కమెడియన్. అయితే జబర్దస్త్ కు రాకముందే నాని కబడ్డీ వంటి పలు సినిమాల్లో కమెడియన్ గా, సహాయక నటుడిగా చేశాడు చంటి. అలాగే రేడియో మిర్చిలో ఆర్జేగా నూ చేశాడు. అక్కడ నిర్వహించిన చంటి బంటి కార్యక్రమంతో బాగా ఫేమస్ అయ్యాడు. ఈ ప్రోగ్రామ్ కారణంగానే అతనికి చంటి పేరు స్థిరపడిపోయింది. ఆ తర్వాత జబర్దస్త్ లోకి అడుగు పెట్టి బాగా మరింత ఫేమస్ అయ్యాడు. తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఓవైపు జబర్దస్త్ లాంటి టీవీ షోస్ చేస్తూనే సినిమాల్లోనూ నటించాడు చలాకీ చంటి. అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కంటెస్టెంట్ గానూ పార్టిసిపేట్ చేశాడు. మధ్యలో అనారోగ్య సమస్యలతో ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ మళ్లీ ఇప్పుడు బుల్లితెరపై బిజీగా మారిపోయాడు. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూకు హాజరైన చంటి తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అలాగే సుడిగాలి సుధీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
‘సినిమా ఇండస్ట్రీలో నేను ఎప్పుడూ అవకాశాల కోసం ఎవరిని అడగలేదు. చాలా సందర్భాల్లో నిరాశలు ఎదురయ్యాయి. కానీ ప్రతి ఒక్కరికీ ఒక సమయం వస్తుందని గట్టిగా నమ్మాను. ఆ నమ్మకంతో ముందుకు సాగాను. నా నటనను ఇతరులతో పోల్చి చూడడం నాకు చాలా బాధ కలిగించింది. ఆత్మగౌరవం విషయంలో నేను ఎప్పుడూ రాజీ పడలేదు. నా విలువలను నేను కాపాడుకున్నాను. నా లాంటి ఆర్టిస్ట్ కు ఇది చాలా ముఖ్యం. నా తర్వాత వచ్చిన సుడిగాలి సుధీర్ లాంటి వాళ్లు స్టార్ రేంజ్ కు ఎదగడం చూసి చాలా సంతోషంగా ఉంది. నేను నా కెరీర్‌లో చేసిన తప్పులు వాళ్లు చేయకూడదని సుధీర్‌కు వ్యక్తిగతంగా సలహా ఇచ్చాను. మంచి అవకాశాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా వినియోగించుకోవాలి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మరింత ఎత్తుకు వెళ్లొచ్చని సుధీర్ కు చెప్పాను. భవిష్యత్తులో సుధీర్ ఇంకా ఎన్నో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ఆకాంక్షించారు చలాకీ చంటి. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




