Rajinikanth: బస్ కండక్టర్ స్థాయి నుంచి భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా ఎదిగారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth). తనకు మాత్రమే సాధ్యమయ్యే స్టైలిష్ యాక్టింగ్‌లో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక సినిమా రంగంలో ఆయన అందించిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం దాదాసాహెబ్ పాల్కే అవార్డు, పద్మభూషణ్ పద్మవిభూషణ్ లాంటి పురస్కారాలతో సత్కరించింది. సిల్వర్ స్ర్కీన్‌పై ఎంతో స్టైలిష్‌గా కనిపించే ఈ సూపర్ స్టార్ నిజజీవితంలో మాత్రం ఎంతో సింపుల్‌గా ఉంటారు. అందుకే ఆయనకు లెక్కలేనంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా చెన్నైలో నిర్వహించిన హ్యాపీ సక్సెస్‌ఫుల్ లైఫ్ థ్రూ క్రియ యోగా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు రజనీకాంత్. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
10 శాతం కూడా నాకు దక్కలేదు!
‘నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. అయితే నాకు బాబా, రాఘవేంద్ర సినిమాలు మాత్రమే ఆత్మసంతృప్తినిచ్చాయి. ఇవి విడుదలైన తర్వాత ఆ ఇద్దరు సద్గురువుల గురించి అందరికీ తెలిపింది. ఈ రెండు సినిమాలు ప్రజలపై చాలా ప్రభావం చూపాయి. వీటిని చూసిన తర్వాత నా అభిమానుల్లో కొందరైతే సన్యాసం తీసుకున్నారని తెలిసింది. అయితే నేను మాత్రం ఇంకా నటుడిగానే కొనసాగుతున్నాను. హిమాలయాలు సాధారణ మంచు పర్వతాలు కాదు. అక్కడ ఎన్నో అద్భుతమైన మూలికలు దొరుకుతాయి. వాటిని తీసుకుంటే వారినికి సరిపడా శక్తి లభిస్తుంది. మనిషి జీవితంలో ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే మనం అనారోగ్యం బారిన పడితే మనకు కావాల్సిన వాళ్లు తట్టుకోలేరు. నేను జీవితంలో ఎన్నో విజయాలు చూశాను. సమాజంలో మంచి పేరు, ప్రతిష్ఠలు, డబ్బు సంపాదించాను. అయితే సిద్ధులకు ఉండే సంతోషం, ప్రశాంతతలో పది శాతం కూడా నాకు దక్కలేదు. ఎందుకంటే అవి శాశ్వతంగా ఉండేవి కావు’ అని చెప్పుకొచ్చారు తలైవా. కాగా ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..