Siddharth: శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమా ‘మహా సముద్రం’. సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇన్‌టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సిద్దార్థ్ మాట్లాడుతూ..
అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఆర్‌ఎక్స్ 100 సినిమాను నేను చూశాను. ఎంత పర్‌ఫెక్షన్‌తో తీశాడో అందరికీ తెలిసిందే. అలాంటి సినిమా తీసి, రామ్ గోపాల్ వర్మ శిష్యుడనిపించుకున్నాడు అన్నారు. అజయ్ మహాసముద్రం కథ చెబితుంటే.. రెండో సినిమా దర్శకుడిలా అనిపించలేదు. వెంటనే ఓకే చెప్పాను అన్నారు. అలా శర్వా, నేను ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాక షూటింగ్ ప్రారంభిద్దామంటే కరోనా వ్యాప్తి మొదలైంది. కోవిడ్ కారణంగా సినిమా షూటింగ్ చేయడం కష్టమైంది. అలా షూటింగ్‌ను చాలా సార్లు వాయిదా వేయాల్సి వచ్చింది అన్నారు. మహా సముద్రం కథ నాకు చాలా నచ్చింది. ఇది ట్రెండ్ సెట్టర్ సినిమా అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు అన్నారు సిద్దు.
ట్రైలర్ చూసి అందరూ ఫోన్ చేసి మెచ్చుకున్నారు. రెండు పీరియడ్స్‌లో జరిగే కథ ఇది. ఇది కచ్చితంగా శర్వా చెప్పినట్టు షూర్ షాట్ బ్లాక్ బస్టర్. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు సిద్దు అంటే చాక్లెట్ బాయ్, లవర్ బాయ్ అనే ఇమేజ్ ఇచ్చారు. కానీ ఈ సినిమాతో కొత్త రకమైన ఇమేజ్ వస్తుంది అన్నారు. 2003లో బాయ్స్ వచ్చినప్పటి నుంచి ఎక్కువగా మారలేదు. అప్పుడు ఎలా ఉన్నానో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. మధ్యలో వచ్చింది బ్రేక్‌లాంటిది కాదు. కానీ నాలో నేను వెతుక్కునే క్రమంలో బ్రేక్ వచ్చింది. అందరూ కాశీ, హిమాలయాలకు వెళ్తుంటారు. అలా నేను కూడా కాస్త గ్యాప్ ఇచ్చాను. నాకు నేను మెచ్యూరిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నన్ను స్టార్‌ను చేసింది తెలుగు వాళ్లే. అయితే ప్రతీ భాషల్లో నాకు ఓ ఐకానిక్ చిత్రం ఉంది.తమిళంలో బాయ్స్, హిందీలో రంగ్ దే బసంతి ఇలా ఉన్నాయి. అయితే నేను ప్రతీ చోటా తెలుగు నటుడిని అని చెప్పుకునేవాడిని. దాంతో అక్కడి వారు హర్ట్ అయ్యేవారు. కానీ నేను తెలుగు స్టార్‌ని, ఇండియన్ నటుడిని. అందుకే మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నాను. ఇకపై తెలుగు ప్రేక్షకులను వదిలిపెట్టి వెళ్లను అన్నారు సిద్దార్థ్.
మరిన్ని ఇక్కడ చదవండి :