యాగ్రీ మెన్ రాజశేఖర్(Rajasekhar) ప్రస్తుతం ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్నారు. బలమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ హిట్స్ అంద్యుకుంటున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన గరుడ వేగా సినిమా రాజశేఖర్ కు ఓ సాలిడ్ కంబ్యాక్ గా నిలిచింది. గరుడ వేగా విజయంతో ఆవెంటనే కల్కి అనే మరో విభిన్నమైన కథను ప్రేక్షుల ముందుకు తీసుకువచ్చారు రాజశేఖర్ ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు శేఖర్ అంటూ మరోసారి సందడి చేయడానికి రెడీ అయ్యారు ఈ సీనియర్ హీరో. ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకురాలిగా ఈ సినిమాను ముందుండి నడిపించారు. బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శేఖర్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా హీరో రాజశేఖర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
రాజశేఖర్ మాట్లాడుతూ.. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నేను కోవిడ్ వల్ల సిక్ అయ్యి చాలా సీరియస్ గా ఉండి మళ్ళీ మీ అందరి ప్రేమ వల్ల బతికి బయటపడ్డాను. అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ ప్రార్ధించి చేసి నన్ను బతికించింది ఈ సినిమా కోసమే. దర్శకుడు పవన్ చెప్పినట్లు సినిమా అంటే మాకు ప్రాణం.ఈ సినిమాను మేమంతా ప్రాణం పెట్టి తీశాము. ముందు ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలను కున్నాము కానీ కొన్ని పరిస్థితుల వలన కుదరలేదు. ఇన్ని రోజులకి కుదిరింది.ఈ సినిమాను మే 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. మేము ప్రేక్షకులకు చెప్పేది ఒకటే.. థియేటర్ వచ్చి సినిమా చూసిన వారు బాగుంది అంటేనే మా సినిమా చూడండి అని చెపుతున్నాము. ఎందుకంటే మాకు ఈ సినిమాపై అంత నమ్మకం ఉంది. మేము పడిన కష్టం ఎలా ఉందో అనేది మీరంతా సినిమా చూస్తే తెలుస్తుంది అన్నారు.