హర్మోనియం మెట్ల మీద ఆయన చేతి వేళ్లు కదిలితే చాలు సప్తస్వరాలు తుళ్లిపడేవి!

కృష్ణన్‌ కోవిల్‌ వెంకటాచల మహదేవన్‌. ఈ పూర్తిపేరు చెబితే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు. మామ మహదేవన్‌ అంటే మాత్రం చటుక్కుమని గుర్తుపట్టేస్తారు.

హర్మోనియం మెట్ల మీద ఆయన చేతి వేళ్లు కదిలితే చాలు సప్తస్వరాలు తుళ్లిపడేవి!
1
Follow us
Balu

| Edited By: Anil kumar poka

Updated on: Mar 14, 2022 | 2:40 PM

కృష్ణన్‌ కోవిల్‌ వెంకటాచల మహదేవన్‌. ఈ పూర్తిపేరు చెబితే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు. మామ మహదేవన్‌ అంటే మాత్రం చటుక్కుమని గుర్తుపట్టేస్తారు. మామ నిజంగానే సంగీతాకాశంలో చల్లని వెన్నెలలు కురిపించే చందమామలాంటివారు. ఆయనతో ఎంత అనుబంధం లేకపోతే మామ అని ఆప్యాయంగా పిల్చుకుంటాం చెప్పండి! అలాగని ఆయనేం తెలుగువారు కాదు. పుట్టింది మార్చి 14, 1917న కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న నాగర్‌కోయిల్‌లో. అచ్చమైన తమిళుడు. దగ్గరయ్యింది మాత్రం మనకే! తమిళ, మలయాళ సినిమాలకు పనిచేసినప్పటికీ తెలుగువారి మదిలో మాత్రం శాశ్వతంగా ఉండిపోయారు. తెలుగువారి మది పులకించే ఎన్నో పాటలకు ప్రాణం పోశారు. ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ సమకాలీకుడైన మహదేవ్‌ ఆనందన్‌ అనే తమిళ సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టారు. 1958లో ప్రతిభ సంస్థ నిర్మించిన దొంగలున్నారు జాగ్రత్త సినిమాతో తెలుగువారికి పరిచయమయ్యారు. అదే ఏడాది వచ్చిన ముందడుగు సినిమా మహదేవన్‌ను మరింత దగ్గర చేసింది. పాటకు బాణి కట్టడం అంత తేలిక పనేం కాదు.. ముందు సిట్యుయేషన్‌ను అర్థం చేసుకోవాలి. దర్శక నిర్మాతలకు ఏం కావాలో ఎలా కావాలో అన్నదానిపై అవగాహన ఉండాలి. కవి భావనను అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మహదేవన్‌కు కొట్టిన పిండి.. ఆయన బాణి కడితే ఎలాంటి పాటైనా ఆణిముత్యమయ్యేది అందుకే! ఆయన ఏనాడు బాణిలిచ్చి కవిని పాట రాయమనలేదు. ముందు కవినే పాట రాయమనేవారు. అప్పుడే ట్యూన్‌ చేద్దామనేవారు. అలా చేసినప్పుడే సరస్వతిదేవికి గౌరవం ఇచ్చినవాళ్లమవుతాం అని చెప్పేవారు. బాణి కట్టిన తర్వాత అది పాడుతున్న గాయనీగాయకులు కంఫర్ట్‌గా ఉన్నారా లేదా అనేది కూడా మామ చూసుకునేవారు. అలా అయితేనే పాట పది కాలాల పాటు నిలబడుతుందన్నది ఆయన నమ్మకం.

హర్మోనియం మెట్ల మీద మామ చేతి వేళ్లు కదిలితే చాలు సప్త స్వరాలు తుళ్లిపడేవట! రాగాలు సిగ్గుల మొగ్గలయ్యేవట! ఆయన తల్చుకోవాలే కాని సాహిత్యం ఎలా ఉన్నా పాట మాత్రం సంగీత సౌరభావాలను విరజిమ్ముతుంది. ఆంధ్రపత్రిక సంపాదకీయానికి కూడా మహదేవన్‌ అద్భుతమైన బాణీలు కట్టగలడని అప్పట్లో అనేవారు. కవి ఎంతో ఇష్టంగా, ఎంతో కష్టంగా, ఎంతో ఆవేశంగా , ఎలా రాసినా, ఏం రాసినా దాన్ని బాణీలోకి తీసుకొచ్చి మరింత అర్థవంతంగా తీర్చిదిద్దడం ఓ బాధ్యతగా భావించేవారు మామ. ఇందుకు చాలా ఉదాహరణలు చెప్పొచ్చు. దాగుడు మూతలు సినిమాలో దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం, మనిషి అనేవాడున్నాడా అని దేవుకొచ్చెను అనుమానం అని ఆత్రేయ రాశారు. ఇది కవిత్వమేనా? బాణికి సరిపోతుందా అన్న సందేహం దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకు వచ్చింది.. ఆ అనుమానాన్ని పటాపంచాలు చేస్తూ అద్భుతమైన ట్యూన్‌ను ఇచ్చారు మహదేవన్‌. అలాగే తేనెమనసులులోని నీ ఎదుట నేను, వారెదుట నీవు అన్న పాట కూడా! ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆయన అల్లాటప్పగా ట్యూన్‌ కట్టరు.. కథ.. కథనం.. సన్నివేశ ప్రాధాన్యం.. ఇవన్నీ తెలుసుకున్నాకే స్వకల్పన చేసేవారు.. ఆయన సృష్టించిన పాటలు ఇప్పటికీ నిలిచి వుండటానికి కారణం ఇదే! మనసు పెట్టి చేసే పాట ఏదైనా శాశ్వతంగా నిలిచిపోతుందనడానికి మామ పాటలే మంచి ఉదాహరణ!

ఇతరులతో సంబంధం లేకుండా తమ పని తాము చేసుకుపోయే కళాకారులు కొందరుంటారు. వీళ్లూ కొన్ని అద్భుతాలు సృష్టిస్తారు. ఇతరుల మనసును అర్థం చేసుకుని దానికి తగ్గట్టు పనిచేయడం అందరికీ రాదు. మ్యూజిక్‌ డైరెక్టర్‌కి – మూడు విషయాలు ఇంపార్టెంట్‌. రచయిత భావం అర్థం చేసుకోవాలి. దర్శకుడి అవసరం తెలుసుకోవాలి. నిర్మాత టేస్ట్‌నీ దృష్టిలో పెట్టుకోవాలి. … ఈ మూడూ మహదేవన్‌లో కనిపిస్తాయి.. సినిమా విజయవంతమా కాదా అన్నది పక్కన పెడితే.. ఆయన స్వరపరచిన పాట మాత్రం ఆటోమాటిక్‌గా హిట్టవుతుంది.. అదే మామ స్పెషాలిటి!

మహదేవన్‌ ఎప్పుడు మడికట్టుకు కూర్చోలేదు.. ఎవరు ఏ పాట ఇచ్చినా.. దాన్ని రక్తి కట్టించడానికే అహరహం కృషి చేశారు.. అందుకే మహదేవన్‌ అంటే డైరెక్టర్లకు అంత అభిమానం! రచయితలకు గౌరవం.. అడవి రాముడు వంటి పక్కా కమర్షియల్‌ సినిమాకు సంగీతాన్ని అందించిన ఆయనే…సిరిసిరిమువ్వ..శంకరాభరణం వంటి క్లాసికల్‌ సినిమాలకూ సంగీతాన్ని అందించారు.. ఆ పాటలను జనరంజకం చేశారు.. అడవిరాముడులోని ఆరేసుకోబోయి పాటైతే ఆ రోజుల్లో కోటి రూపాయల పాటగా పేరుపొందింది! ఇక సిరిసిరిమువ్వలోని పాటైతే సుశీలమ్మకు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది.. శంకరాభరణం సరేసరి!

మహదేవన్‌ మనసున్న మనిషి. తనతో పని చేసే ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకునే నిండుమనిషి. పుహళేందిని ఆయన తన తోటి సంగీత దర్శకుడిగానే చూశారు తప్ప సహాయకుడిగా ఏనాడూ చూడలేదు. పుహళేందిని తన సహాయకుడిగా చూసినందుకే శంకరాభరణం నిర్మాతతో మరో సినిమాకు పని చేయలేదు. ఎంతో మంది రాజీ కుదర్చాలని ప్రయత్నించినా మహదేవన్‌ అంగీకరించలేదు. ఓసారి ఓ కొత్త కంపెనీ హైదరాబాద్‌లో రికార్డింగ్‌ చేపట్టి మామను ఫ్లయిట్‌లో, పుహళేందిని రైలులో రమ్మన్నారు. మామ నేను అక్కడికి రానని తేల్చి చెప్పేశారు. ఆయనను అంతబాగా చూసుకునేవారు. పుహళేంది అసలు పేరు వేలప్పన్‌ నాయర్‌. తిరువనంతపురానికి చెందిన ఈ నాటక సంగీత దర్శకుడిని శివం అనే ఓ సంగీత క‌ళాకారుడు మహదేవన్‌కు పరిచయం చేశారు. వెంటనే తన జట్టులో తీసుకున్నారు మామ. అలా మొద‌లైన బంధం … రెండు వంద‌ల యాభై సినిమాల‌కు విస్త‌రించింది.

పుహ‌ళేందే త‌న‌ను రికార్డింగు థియేట‌ర్ కు తీసుకురావాలి. పుహ‌ళేందే త‌న‌ను ఇంటి ద‌గ్గ‌ర దింపాలి. పుహళేందిని మహదేవన్‌ అప్పూ అని పిలిచేవారు. పాడపాడుతున్న గాయనీగాయకులు సంగతులకు ఇబ్బంది పడుతుంటే వెంటనే దాన్ని మార్చేసి ఇలా పాడేయండి హాయిగా అని వారికి ధైర్యం చెప్పేవారు. సినిమా అన్నది కళారూపమే కాదు, వ్యాపారం కూడా! ఏ నిర్మాతైనా పెట్టుబడి ఎందుకు పెడతారు? నాలుగు డబ్బులు ఎక్కువ సంపాదించుకోవడం కోసమే కదా! అందుకే ఇటు రచయితనీ, అటు దర్శకుణ్ణీ మెప్పిస్తూ కూడా ప్రొడ్యూసర్‌కి నచ్చే విధంగా మ్యూజిక్‌ చేసేవారు మామ. మహదేవన్‌ తోటే మ్యూజిక్‌ చేయించుకోవాలని కోరుకునే ప్రొడ్యూసర్లు ఎప్పుడూ ఉండేవారు. జగపతి రాజేంద్రప్రసాద్‌, రామానాయుడు, మోహన్‌బాబు, యువచిత్ర మురారి వీరంతా మహదేవన్‌కే ప్రాధాన్యమిచ్చారు. మురారి అయితే మహదేవన్‌ కోసం దర్శకులను కూడా వదిలేసుకున్నారు.. త్రిశూలం సినిమాకు చక్రవర్తిని పెడతామని రాఘవేంద్రరావు అంటే మామను వదులుకోవడానికి మురారి ఇష్టపడలేదు. అలాగే గోరింటాకు ముందు సేతు మాధవన్‌ అనే డైరెక్టర్‌ను పెట్టుకున్నప్పుడు ఆయన ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ను పెట్టుకుంటానంటే ఆయనను కూడా వదులుకున్నారు మురారి.

మహదేవన్ సంగీతాన్నందించిన చివరి సినిమా కబీర్ దాస్. ఈ సినిమా 2003 లో ఆయన చనిపోయిన తర్వాత విడుదలయ్యింది. అంతకు ముందు విశ్వనాథ్‌ తీసిన స్వాతికిరణం సినిమాకు సంగీతం అందించారు. ఇందులో రెండు మూడు పాటలనే మామ స్వరపరిచారు. మిగతావి పుహళేందే చూసుకున్నారు. ఎన్టీఆర్‌ నటించిన శ్రీనాథ కవిసార్వభౌముడు సినిమాకు కూడా మహదేవనే సంగీత దర్శకుడు. అలాగే తమిళంలో చివరి సినిమా 1990లో వచ్చిన సినిమా మురుగనే తుణై. సంప్రదాయాలకు మహదేవన్‌ చాలా విలువ ఇచ్చేవారు. త్యాగరాజ కీర్తనకానీ, అన్నమయ్య కీర్తనగానీ ఆయన చేసిన సినిమాలలో చూస్తే ఎంతో హాయిగా ఉంటాయి. మహదేవన్‌ స్వర లహరులు మనసుని పట్టుకుంటాయి.. ఓ పట్టాన వదిలిపోమంటాయి. నిజంగానే ఆయనో లెజెండ్‌..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో