
నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన ‘లెజెండ్’, ‘లయన్’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి ఆమె. కేవలం బాలీవుడ్‌లోనే కాక, ఓటీటీ సిరీస్‌లలో తన బోల్డ్ పాత్రలు, ఓపెన్ అభిప్రాయాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. సినిమా సెట్లలో ఎదురయ్యే ఇబ్బందులపై, మహిళలపై వివక్షపై బహిరంగంగా మాట్లాడే ఈ నటి తాజాగా భారతీయ సినిమా, వెబ్ సిరీస్‌లలో పెరుగుతున్న అతి హింసపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ‘హింసే ఎంటర్టైన్‌మెంట్‌గా మారిన ఈ ప్రపంచంలో నా కూతుర్ని ఎలా పెంచాలో అర్థం కావడం లేదు. నిజంగా భయంగా ఉంది,’ అంటూ ఆందోళన వ్యక్తం చేసిన ఆ హీరోయిన్ ఎవరు?
రాధికా ఆప్టే తన తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ పరిశ్రమలో పెద్ద సంచలనంగా మారాయి. ఆమె ప్రధానంగా లేవనెత్తిన అంశాలు అందరినీ ఆలోచనలో పడేశాయి. ‘అతి రక్తపాతం అవసరమా? కథ చెప్పాలంటే తప్పనిసరిగా రక్తపాతం, క్రూరత్వాన్ని అతిగా చూపించాల్సిన అవసరం లేదు. కథలో డెప్త్ కంటే తెరపై చూపించే హింసకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు,’ అని ఆమె విమర్శించారు. ఒక హంతకుడి కథ చెప్పాలంటే తలలు నరికే సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు చూపించాల్సిన అవసరం లేదని ఆమె ప్రశ్నించారు. ఇది సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.
Radhika Apte
అలాంటి హింసాత్మక సన్నివేశాలు సమాజంపై చెడు ప్రభావాన్ని చూపుతాయని, ప్రేక్షకులు కూడా ఈ కంటెంట్‌ను ఆసక్తిగా చూడటం బాధ కలిగిస్తోందని ఆమె స్పష్టం చేశారు. ‘హింసే ఎంటర్టైన్‌మెంట్‌గా మారిన ఈ ప్రపంచంలో నా కూతుర్ని ఎలా పెంచాలో అర్థం కావడం లేదు. నిజంగా భయంగా ఉంది,” అంటూ తల్లిగా తన ఆందోళనను వ్యక్తపరిచింది రాధిక. కేవలం దర్శక-నిర్మాతలపైనే కాక, ఇతరులపై కూడా విమర్శలు గుప్పించింది. డబ్బు కోసం నటించకండి, డబ్బులు వస్తున్నాయి కదా అని హింసను ప్రోత్సహించే పాత్రల్లో నటించాల్సిన అవసరం లేదని, ముఖ్యంగా హీరోయిన్లకు ఆమె క్లాస్ పీకారు. “రైటర్లు విజన్ ఉందంటారు.
కానీ, దాన్ని పేపర్‌పై బలమైన కథగా రాయలేకపోతున్నారు,” అంటూ కథకుల్లోని సృజనాత్మకత లోపాన్ని కూడా ఆమె ఎత్తి చూపారు. ‘రక్త చరిత్ర’, ‘కబాలి’ వంటి విభిన్న సినిమాల్లో, అలాగే బోల్డ్ పాత్రల్లో నటించిన రాధిక ఆప్టే.. హింసపై చేసిన ఈ వ్యాఖ్యలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. వినోదం పేరుతో హద్దులు దాటకూడదని, సమాజంపై సినీ ప్రభావం గురించి అందరూ ఆలోచించాలని ఆమె చేసిన సూచనలు ప్రస్తుతం చర్చకు దారి తీస్తున్నాయి.