ఖైదీ సినిమాలో రగులుతోంది మొగలిపొద పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పోటీపడి మరి డ్యాన్స్ వేసిన హీరోయిన్ గుర్తుందా? అదేనండి నటి మాధవి. 1980-90వ దశకంలో తన అందం, అభినయంతో అలరించిన ఈ అందాల తార చిరంజీవి ఫేవరెట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదుతో మొదలై ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య, చట్టంతో పోరాటం, మరణశాసనం, రోషగాడు, కోతల రాయుడు, దొంగమొగుడు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, బిగ్ బాస్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారామె. ఓవైపు గ్లామరస్ పాత్రలు పోషిస్తూనే ‘వేణువై వచ్చాను భువనానికీ’…అంటూ మాతృదేవోభవలో తన అద్భుతమైన అభినయంతో అందరితో కంటతడి పెట్టించారు. అలాగే టిక్ టిక్ టిక్ సినిమాలు బికినీలో దర్శనం ఇచ్చి కుర్ర గారు మతులు పోగొట్టారామె. చిరంజీవితో పాటు కృష్ణ, శోభన్ బాబు, రజనీకాంత్, కమల్ హాసన్, మిథున్ చక్రవర్తి, జితేంద్ర, అమితాబ్ బచ్చన్, మమ్ముట్టీ లాంటి ఆలిండియా సూపర్ స్టార్స్ అందరి సరసన నటించారామె. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం, ఒరియా భాషల్లో దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారీ అందాల తార. అన్నట్లు మాధవి మన హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు.
సినిమా ఇండస్డ్రీలో సుమారు 17 ఏళ్ల పాటు కొనసాగిన మాధవి అప్పటి స్టార్ హీరోయిన్లు శ్రీదేవి, విజయశాంతిలకు గట్టి పోటీ ఇచ్చారు. కాగా సినిమాల్లో బిజీగా ఉండగానే బిజినెస్ మ్యాన్ రాల్ఫ్ శర్మను మాధవి వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులు అమెరికాలో నివసిస్తున్నారు. వీరికి టిఫాని శర్మ, ప్రసిల్లా శర్మ, ఎవ్లీన్ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.కాగా పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక మాధవికి బిజినెస్ పై ఆసక్తి కలిగింది. తన భర్తకు ఉన్న ఔషధ సంస్థను ప్రస్తుతం మాధవినే నిర్వహిస్తున్నారట. అలాగే ఫుడ్ రెస్టారెంట్స్ బిజినెస్‌లోనూ రాణిస్తున్నారట. ప్రస్తుతం ముగ్గురు పిల్లల తల్లిగా ఉన్న మాధవి అటు బిజినెస్ ని, ఇటు కుటుంబాన్ని చక్కగా సమన్వయపరచుకుంటూ ముందుకు వెళుతున్నారట.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..