ఎప్పుడు నవ్వుతూ కూల్ గా ఉండే ప్రభాస్ కూడా ఆరోజు బాధపడ్డాడు.. డార్లింగ్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన వినాయక్
ఒకప్పుడు టాలీవుడ్ లో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు వీవీ వినాయక్. చిరంజీవి, బాలయ్య, వెంకీ తదిరత స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్స్ తీశారు. అయితే ప్రస్తుతం ఆయన సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. మరోవైపు ఆయన కమ్ బ్యాక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

టాలీవుడ్ లో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ వీవీ వినాయక్. కెరీర్ ప్రారంభంలో దిల్ వంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీని తీసిన ఆయన ఆ తర్వాత మాస్ సినిమాలతో ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ తదిరత స్టార్ హీరోలతో సూపర్ హిట్స్ సినిమాలు తెరకెక్కించారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది, ఠాగూర్, చెన్నకేశవరెడ్డి, సాంబ, లక్ష్మీ, కృష్ణ, బన్నీ, అదుర్స్, నాయక్, ఖైదీ నంబర్ 150 సినిమాలు మాస్ ఆడియెన్స్ ను కట్టిపడేశాయి. అయితే ఆయన తెలుగులో సినిమా తీసి సుమారు ఎనిమిదేళ్లు అవుతోంది. చివరిగా 2018లో సాయి ధరమ్ తేజ్ తో ఇంటెలిజెంట్ అనే సినిమాను తెరకెక్కించారు వీవీ వినాయక్. గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. అభిమానులు మాత్రం వినాయక్ కమ్ బ్యాక్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు వినాయక్. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదే సందర్భంగా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గురించి కూడా మాట్లాడారు.
‘బాహుబలి’ మొదటి భాగం విడుదలైన తర్వాత ఆ చిత్ర బృందం వారు ఓ పార్టీ ఏర్పాటు చేశారు. దానికి నాతో పాటు సినిమ ఇండస్ట్రీకి సంబంధించిన వారిని ఆహ్వానించారు. అయితే ఆ పార్టీలో ప్రభాస్‌తో పాటు రాజమౌళి కూడా చాలా నిరాశతో కనిపించారు. సాధారణంగా ప్రభాస్ చాలా కూల్ గా ఉంటాడు. ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తాడు, కానీ ఆ రోజు మాత్రం డార్లింగ్ కూడా చాలా డల్ గా కనిపించాడు. అలా ఉండడానికి ప్రధాన కారణం ‘బాహుబలి’ మొదటి భాగం విడుదలైన తర్వాత దానికి మొదట్లో పెద్ద ఎత్తున నెగిటివ్ టాక్ రావడమే. దీంతో వారిద్దరూ చాలా బాధపడ్డారు. అయితే ఆ తర్వాత ఆ సినిమాకు కామన్ ఆడియన్స్ నుంచి మంచి టాక్ రావడం ప్రారంభమైంది. దాంతో ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సినిమా విడుదలైన తర్వాత మొదటి రెండు, మూడు రోజులు వారు ఎంతో బాధపడ్డారు. కానీ ఆ తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో చాలా ఆనందపడ్డారు’ అని అప్పటి క్షణాలను గుర్తు చేసుకున్నారు వినాయక్. ప్రస్తుతం ఈ మాస్ డైరెక్టర్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా ప్రభాస్ హీరోగా యోగి అనే సినిమాను తెరకెక్కించారు వీవీ వినాయక్. అమ్మ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. అయితే మాస్ ఆడియెన్స్ కు మాత్రం ఈ మూవీ బాగా నచ్చింది. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ చేసిన ఫైట్స్ ఫ్యాన్స్ ను కట్టిపడేశాయి.
,మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




