
దర్శకుడు వి. సముద్ర, రాజశేఖర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహరాశి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా నిర్మాణ సమయంలో ఎదురైన ఆసక్తికర సవాళ్లను సముద్ర ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సినిమా ప్రారంభంలో స్వయంగా హీరో రాజశేఖరే కథలోని కొన్ని అంశాలపై సందేహాలు వ్యక్తం చేశారట. కథానాయకుడు సినిమా అంతా ఒకే రకమైన దుస్తుల్లో ఉండటం, నేల మీద కూర్చోవడం, హీరోయిన్‌ను తాకకపోవడం లాంటి విభిన్నమైన పోకడలను ప్రేక్షకులు ఆదరిస్తారా అని ఆయన సంకోచించారు. రాజశేఖర్ మాత్రమే కాదు, షూటింగ్ సమయంలో యూనిట్ సభ్యులు సైతం సినిమా విజయంపై నమ్మకం లేదని సముద్ర ముఖం మీదే చెప్పేశారట.
ఇది చదవండి: అతడి వల్లే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చా.. ఓపెన్‌గా చెప్పేసిన నటి
హీరో తల్లికి కుష్టు వ్యాధి ఉండటం వంటి సెంటిమెంట్ అంశాలు ప్రతికూలంగా మారుతాయని అందరూ భావించినా, సముద్ర మాత్రం తన విజన్ మీద నమ్మకంతో ముందుకు సాగారు. ఆ సమయంలో దిగ్గజ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాత్రమే కథను విని, “ఎంత మంచి కథను తెచ్చావయ్యా” అని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారని సముద్ర గుర్తు చేసుకున్నారు. ‘అమ్మా అమ్మా అని పిలవకు’ అనే పాట రాసేటప్పుడు శాస్త్రి పడ్డ తపన, అందించిన ప్రోత్సాహం సినిమాకు పెద్ద బలంగా నిలిచాయి. రాజశేఖర్‌కి ‘అంకుశం’, ‘మగాడు’ తరహాలో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలు చక్కగా సరిపోతాయని నమ్మి సముద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
సినిమా విడుదలయ్యాక నిర్మాత ఆర్.బి. చౌదరి ప్రశంసలు అందుకోవడమే కాకుండా, ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో రాజశేఖర్ ఎంతో సంతోషించారు. ముఖ్యంగా హీరోయిన్‌ను తాకకుండా తన తల్లిని చూసుకునే సన్నివేశానికి థియేటర్లలో అద్భుతమైన స్పందన వచ్చింది. తల్లి ప్రేమ, త్యాగం నేపథ్యంలో సాగే ఈ చిత్రం రాజశేఖర్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. విడుదలైన 25 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ ఎవరో ఒకరు ఫోన్ చేసి ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడుతుంటారని సముద్ర గర్వంగా చెప్పుకొచ్చారు.
ఇది చదవండి: ఒక్క ఇడ్లీ కోసం ఆ కో-డైరెక్టర్ బూతులు తిట్టాడు.. తర్వాత వాడి పరిస్థితి ఇది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..