AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trivikram : త్రివిక్రమ్ చెప్పిన ఈ మాటలు వింటే గుండె బరువెక్కుతుంది.. జీవితంలో ఒక్కసారైనా ఈ మాటలు వినాల్సిందే ..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అలాగే త్రివిక్రమ్ మాటలు అంటే యువతకు పిచ్చి ఇష్టం. అందుకే ఆయనను మాటల మాంత్రికుడు అని ముద్దుగా పిలుచుకుంటారు. తాజాగా త్రివిక్రమ్ కు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

Trivikram : త్రివిక్రమ్ చెప్పిన ఈ మాటలు వింటే గుండె బరువెక్కుతుంది.. జీవితంలో ఒక్కసారైనా ఈ మాటలు వినాల్సిందే ..
Trivikram Srinivas
Rajitha Chanti
|

Updated on: Jun 03, 2026 | 2:32 PM

Share

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫాదర్స్ డే సందర్భంగా తండ్రుల స్థానంపై ఒక భావోద్వేగ ప్రసంగం చేసిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఆ ప్రసంగంలో ఆయన తండ్రి పట్ల పిల్లల అవగాహన జీవితంలోని వివిధ దశలలో ఎలా మారుతుందో వెల్లడించారు. సాధారణంగా అమ్మ గురించి అందరూ మాట్లాడుకుంటారని, కానీ తండ్రి ప్రాముఖ్యత తరచుగా మర్చిపోతున్నారని అన్నారు. చిన్న వయసులో, ముఖ్యంగా ఐదు, ఆరేళ్ల పిల్లలకు తండ్రి ఒక సూపర్ హీరో అని, సూపర్ మ్యాన్ అని త్రివిక్రమ్ వివరించారు. పిల్లల దృష్టిలో తండ్రి ప్రపంచంలో ఏదైనా చేయగల సమర్థుడు. అయితే, పదేళ్ల వయసుకు చేరుకున్నాక, ఇతరుల ధనం, పెద్ద కార్లు చూసి, తమ తండ్రి అంత గొప్పవాడు కాదేమోనని, తమ తండ్రి కంటే గొప్పవారు చాలా మంది ఉన్నారేమోనని పిల్లలు ఆలోచించడం మొదలుపెడతారని ఆయన పేర్కొన్నారు. పదిహేనేళ్లు దాటి పద్దెనిమిదేళ్లు వచ్చాక, తండ్రి సలహాలు (సిగరెట్ కాల్చొద్దు, బాగా చదువుకో, రాత్రిపూట ఆలస్యంగా ఇంటికి రాకు) విసుగు తెప్పించేవిగా అనిపిస్తాయని, “మా నాన్నకు బతకడం తెలియదు, అందుకే ఇలా అయ్యాడు” అని భావిస్తారని ఆయన వివరించారు.

ఇక 20 నుంచి 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని, ఫ్లాట్ అద్దెకు తీసుకుని, ఉద్యోగం చేసి, నెలాఖరుకు అప్పులు చేయాల్సి వచ్చి, బిల్లులు కట్టాల్సి వచ్చినప్పుడు, “నాన్న మనం అనుకున్నంత వేస్ట్ ఏం కాదనుకుంటా, నలుగురు పిల్లల్ని బాగానే మేనేజ్ చేసినట్టున్నాడు” అనిపిస్తుందని త్రివిక్రమ్ అన్నారు. ఈ దశలో ఒక్కరిని కనడానికే ఇంత కష్టంగా ఉందనిపిస్తుందని ఆయన జోడించారు. ఆ తర్వాత 35, 40 ఏళ్లు దాటిన తర్వాత, పిల్లలు పెద్దవాళ్లవుతుంటే స్కూలు ఫీజులు, రికమండేషన్లు, అనారోగ్యం వస్తే రాత్రిపూట ఆసుపత్రులకు పరుగులు, డబ్బుల కోసం వెతుక్కోవటాలు వంటి కష్టాలు వచ్చినప్పుడు తండ్రి గుర్తుకొచ్చి కళ్లల్లో నీళ్లు వస్తాయని త్రివిక్రమ్ అన్నారు. “అయ్య బాబోయ్, ఇన్ని కష్టాలు పడి మన అందరినీ పెంచి ఇక్కడిదాకా తీసుకొచ్చాడు” అని ఆ క్షణంలో అర్థమవుతుందన్నారు. అయితే, ఆ కృతజ్ఞతను చెప్పేలోపే చాలా మంది తండ్రులు చనిపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే, తండ్రి బతికుండగానే మనమందరం వారికి కృతజ్ఞతలు చెబుదామని త్రివిక్రమ్ అన్నారు. భారతీయులకు ఒక రోజుతో ప్రేమకు సంబంధం లేదని, ప్రేమని ఒక రోజుకే పరిమితం చేయకూడదని ఆయన అన్నారు. అమ్మను కూడా సంవత్సరంలో ఒక్కరోజు కాకుండా జీవితాంతం ప్రేమిద్దామని, అలాగే తండ్రిని కూడా 365 రోజులు గుర్తుంచుకోవాలని ఆయన సందేశం ఇచ్చారు. తండ్రులు తరచుగా కావ్యాల్లో, నాటకాల్లో, సినిమాల్లో సరైన గుర్తింపు లేకుండా మిగిలిపోయిన పాత్రలని, అమ్మను డ్రామటైజ్ చేసినంతగా తండ్రిని చూపించలేకపోయామని ఆయన తెలిపారు. తండ్రి నుంచే వారసత్వాన్ని, సంస్కారాన్ని తీసుకుంటామని, డబ్బును కాకుండా పేరును తీసుకుని ముందుకు వెళ్తామని త్రివిక్రమ్ చెప్పారు. తండ్రి కృతజ్ఞతను ఆశించి పెంచడు కాబట్టి, ఆయనకు మనం కృతజ్ఞతను ఇవ్వాలని, ఆయనను ఒక జ్ఞాపకంగా గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. చిన్నప్పుడు ఆయన భుజాలపై నుంచుని ప్రపంచాన్ని చూస్తామని, ఆయన వేలు పట్టుకునే నడక నేర్చుకుంటామని, ఆయన ఒడిలో కూర్చునే చదువుకోవడం, ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంటామని త్రివిక్రమ్ గుర్తు చేశారు. ఆయన స్కూటర్ ముందు కూర్చుని ప్రపంచం మొత్తం గెలుస్తున్నామని భావిస్తామని చెప్పారు. చివరిగా, తండ్రి లేకపోయినా ఒంటరిగా ఉన్నామని ఎప్పుడూ అనుకోవద్దని, ఆయన మన వెనకాల కనపడని నీడలాగా ఎప్పుడూ మనతోనే ఉంటాడని త్రివిక్రమ్ తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Maheswari: ఆ హీరో అంటే క్రష్.. పిచ్చిగా ప్రేమించా.. చెల్లి అని మనసు ముక్కలు చేశాడు.. హీరోయిన్ మహేశ్వరి..

ఎక్కువమంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఒక్కో సీన్ ఊపిరి బిగపట్టి చూడాల్సిందే.. ఓటీటీలో రచ్చ చేస్తున్న మలయాళీ

Follow Us