బాహుబలితో ఇండియన్ సినిమా ముఖ చిత్రాన్నే మార్చేసిన రాజమౌళి.. ఆ తరువాత ట్రిపులార్ తో మన సినిమాను గ్లోబల్ రేంజ్ కు తీసుకెళ్లారు. ఏళ్ల దశాబ్దాలుగా ఇండియన్ సినిమాను ఊరిస్తున్న ఆస్కార్ అవార్డును సాధించి తెలుగు సినిమా ఖ్యాతీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఈ సినిమాతో ఎంత లాంగ్ జర్నీ, ఇన్ని గ్రేట్ మెమొరీస్ ఉన్నాయి కాబట్టే జక్కన్నకు కూడా ఈ మూవీ ఎంతో స్పెషల్.
బాహుబలి విషయంలో చేయని చాలా ప్రయత్నాలు ట్రిపులార్ కోసం చేస్తున్నారు రాజమౌళి. సినిమా రిలీజై ఇంత కాలం అవుతున్నా… ఇప్పటికీ ఆ కంటెంట్ తో ట్రావెల్ చేస్తూనే ఉన్నారు జక్కన్న. ఓ వైపు గ్లోబల్ రేంజ్ లో మహేష్ తో చేస్తున్న మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తునే ట్రిపులార్ కోసం కూడా వర్క్ చేస్తున్నారు జక్కన్న.
తాజాగా ఈ సినిమా మేకింగ్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ వర్క్ కు సంబంధించి ఓ డాక్యుమెంటరీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ అధికారక ప్రకటన కూడా విడుదల చేసింది. ట్రిపులార్ బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో ఈ డిసెంబర్ లోనే డాక్యుమెంటరీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టుగా వెల్లడించారు.
గతంలో ఆస్కార్ ప్రమోషన్స్ సందర్భంగా ట్రిపులార్ మేకింగ్ కు సంబంధించి చాలా విషయాలు రాజమౌళి వెల్లడించారు. ముఖ్యంగా ఆస్కార్ సాధించిన నాటు నాటు పాట గురించి ఒక్కో అంశాన్ని ఎంతో విపులంగా వివరించారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న డాక్యుమెంటరీలో పూర్తి సినిమా గురించి అలాంటి డిటైల్స్ జక్కన్న రివీల్ చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన పీరియాడిక్ ఫాంటసీ యాక్షన్ డ్రామా ట్రిపులార్. తారక్ – కొమురం భీమ్, చరణ్ – అల్లూరి సీతా రామరాజుగా నటించిన ఈ సినిమా 2022 మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జక్కన్న మార్క్ టేకింగ్ కు కీరవాణి మ్యూజిక్, సెంథిల్ సినిమాటోగ్రఫి కూడా యాడ్ అవ్వటంతో మరోసారి చరిత్ర సృష్టించింది ట్రిపులార్. యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తో ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
చారిత్రక వీరుల కథకు ఫాంటసీని జోడించి రాసుకున్న కథతో రాజమౌళి చేసిన ప్రయోగానికి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హాలీవుడ్ దర్శకులు సైతం జక్కన్న మేకింగ్ స్టైల్‌కు సాహో అన్నారు. అందుకే ఇప్పుడు ఈ సినిమా జర్నీని ప్రేక్షకులతో పంచుకోబోతున్నారు రాజమౌళి.