
ధర్మేంద్ర సింగ్ డియోల్.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. యాక్షన్ కింగ్, హీ మ్యాన్‌గా ఈయన సుప్రసిద్ధుడు. పంజాబ్‌లోని లుధియానా జిల్లా, నస్రాలీ గ్రామంలో డిసెంబర్ 8, 1935న జన్మించారు ధర్మేంద్ర. పంజాబీ సంప్రదాయ కుటుంబంలో పెరగడం వల్ల క్రమశిక్షణతో కూడిన వాతావరణం ఉండేది. బాల్యం నుంచే సినిమా అంటే ఇష్టం ఉండేది.. నాటి స్టార్ యాక్టర్ దిలీప్ కుమార్ నటన ధర్మేంద్రను ప్రభావితం చేసింది. సినిమాల్లోకి రాకముందు ధర్మేంద్ర పంజాబ్‌లో చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. ఉద్యోగం చేస్తూనే.. సినిమా నటుడు కావాలనే తన కలను నెరవేర్చుకోవడం కోసం అవకాశాలను వెతుక్కునేవారు.
1950స్‌లో బాలీవుడ్ చిత్రాలన్నీ ఎక్కువగా ముంబై నుంచే విడుదలయ్యేవి.. కాబట్టి ముంబైకి వెళ్లడం ధర్మేంద్ర ప్రధాన లక్ష్యంగా మారింది. నటుడు కావాలనే దృఢ సంకల్పంతో.. ధర్మేంద్ర తన ఉద్యోగాన్ని, కుటుంబాన్ని వదిలిపెట్టి ముంబైకి వెళ్లారు. ముంబైలో ఆయన ప్రయాణం అంత సులభంగా సాగలేదు. చేతిలో తక్కువ డబ్బు, ఎవరూ తెలియని కొత్త ప్రపంచం. సినిమా స్టూడియోల చుట్టూ తిరుగుతూ.. చిన్న పాత్రల కోసం దర్శక నిర్మాతలను కలిసే ప్రయత్నం చేశారు. కొన్నిసార్లు తిండికి, నివాసానికి కూడా ఇబ్బంది పడేవాళ్లు ధర్మేంద్ర. కెరీర్ మొదట్లో ఎంత ప్రయత్నించినా అవకాశాలు మాత్రం రాలేదు. అదే సమయంలో ఆయనకు నటుడు మనోజ్ కుమార్ వంటి కొంతమంది స్నేహితులు పరిచయమయ్యారు. ఇది ఆయనకు కొంత మానసిక ధైర్యాన్ని ఇచ్చింది. 1958లో ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడానికి నిర్వహించిన ‘న్యూ టాలెంట్ కాంటెస్ట్’లో ఆయన పాల్గొన్నారు. నటనలో శిక్షణ లేకపోయినా, తన సహజమైన ఆకర్షణ, ఫిజిక్‌తో ఈ పోటీలో విజయం సాధించారు. ఈ విజయంతోనే ఆయన్ను సినీ పరిశ్రమకు పరిచయం చేస్తూ నిర్మాతలు ఆయనకు తొలి సినిమా అవకాశాన్ని అందించారు. ఈ విజయం ఆయనలోని నటుడికి ఒక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఆతర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ధర్మేంద్ర.
ధర్మేంద్ర వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ చర్చనీయాంశమే. ఆయనకు ప్రకాశ్ కౌర్‌తో వివాహం జరిగింది. ఈ జంటకు నలుగురు సంతానం.. వాళ్లు సన్నీ డియోల్, బాబీ డియోల్, విజేత, అజిత. ఆ తర్వాత సహనటి, డ్రీమ్ గర్ల్ హేమమాలినితో ప్రేమలో పడ్డారు. అప్పటికే వివాహం కావడంతో, హేమమాలినిని పెళ్లి చేసుకోవడానికి ధర్మేంద్ర ఇస్లాం మతాన్ని స్వీకరించి.. తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా 1980లో హేమమాలినిని వివాహం చేసుకున్నారు. అయితే ఇస్లాం మతాన్నిస్వీకరించారన్న వార్తలను ధర్మేంద్ర ఖండించారు. కాగా హేమమాలిని, ధర్మేంద్రకి ఇద్దరు కుమార్తెలు ఇషా డియోల్, అహానా డియోల్. ఈ రెండు కుటుంబాలను ఆయన గౌరవంగా చూసుకున్నారు. ధర్మేంద్ర వారసత్వాన్ని ఆయన పిల్లలు సన్నీ, బాబీ డియోల్ విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ధర్మేంద్ర కేవలం నటుడిగానే కాకుండా, నిర్మాతగా కూడా మెప్పించారు. ధర్మేంద్ర కేవలం నటుడిగానే కాకుండా.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. 2004లో, ఆయన భారతీయ జనతా పార్టీ తరపున రాజస్థాన్‌లోని బికనీర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే, రాజకీయాలపై ఆయనకు అంతగా ఆసక్తి లేకపోవడం వలన, ఆయన పదవీ కాలంలో అంత చురుకుగా లేరు. తన పదవీ కాలం తర్వాత ఆయన రాజకీయాల నుండి వైదొలిగారు. నటనారంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా, 2012లో భారత ప్రభుత్వం ఆయనకు భారతదేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ భూషణ్ అవార్డును ప్రదానం చేసింది. తన వయస్సు పెరిగినా.. ఆయన ఇప్పటికీ అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తూనే ఉన్నారు, ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఆయన చివరి సినిమా ఇక్కీస్ డిసెంబర్ 25, 2025న విడుదల కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి