Goddess Kali.: ఇటీవల కాలంలో సినిమాల్లో చేసే చిన్న చిన్న తప్పులు హైలైట్ అవుతున్నాయి. అజాగ్రత్త కారణంగానో లేక ఆడియన్స్ అటెన్షన్ కోసం చేస్తారో ఏమో కానీ అవి పెద్ద వివాదాలుగా మారుతుంటాయి. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో వివాదం తలెత్తింది. కాళి పేరుతో రూపొందిస్తున్న డాక్యుమెంటరీ ఫిల్మ్ పై దేశవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల విడుదలైన పోస్టర్ పై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాళికామాత సిగరెట్ తాగుతున్నట్టుగా పోస్టర్ రిలీజ్ చేశారు డైరెక్టర్ లీనా మణిమెకలై. హిందూ దేవతను అత్యంత దారుణంగా కించపర్చారంటూ హిందూ సంఘాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లీనా పై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. దీంతో తాను విడుదల చేసిన పోస్టర్ పై వివరణ ఇచ్చారు డైరెక్టర్. కాళికామాత సిగరెట్ తాగడం, చేతిలో ఎల్జీబీటీలకు సంబంధించిన జెండాను పట్టుకోవడం రెండూ వివాదం అవుతున్నాయి..
హిందువుల మనోభావాలు గాయపర్చిన లీనాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. డైరెక్టర్ లీనాపై ఢిల్లీలో ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. సమానహక్కుల కోసం ఈ డాక్యుమెంటరీని తీసినట్టు లీనా తెలిపారు. కెనడా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. అయితే కాళీమాతా సిగరెట్ తాగుతున్నట్టు విడుదల చేసిన ఫోటోపై వెనక్కి తగ్గడం లేదు డైరెక్టర్ లీనా. వాక్‌స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్దంగా ఉన్నట్టు తెలిపారు. అయితే డైరెక్టర్ లీనాపై చాలామంది నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ట్విట్టర్‌లో అరెస్ట్ లీనా మణిమేకాలాయ్ ట్రెండ్ అవుతోంది. లీనా విడుదల చేసిన ఫోటోలో కాళీ మాత సిగరెట్ తాగుతున్నట్టు ఉంది. చేతిలో త్రిశూలంతో పాటు గొడ్డలి కూడా ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి