Taraka Ratna: నందమూరి తారకరత్న మృతి పట్ల ప్రముఖుల సంతాపం.. ప్రతిభావంతుడిని కోల్పోయామంటూ చిరంజీవి ట్వీట్..

నందమూరి తారకరత్న కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. నటుడు నందమూరి తారకరత్న (Taraka Ratna) (40) తీవ్ర గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి, 23 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా, శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు.

Taraka Ratna: నందమూరి తారకరత్న మృతి పట్ల ప్రముఖుల సంతాపం.. ప్రతిభావంతుడిని కోల్పోయామంటూ చిరంజీవి ట్వీట్..
Tarakaratna

Updated on: Feb 19, 2023 | 12:24 AM

నందమూరి తారకరత్న కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. నటుడు నందమూరి తారకరత్న (Taraka Ratna) (40) తీవ్ర గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి, 23 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా, శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సినీనటుడు నందమూరి తారకరత్న మృతి పట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు సంతాపం తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. నటుడి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

తారకరత్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి: తెలంగాణ సీఎం కేసీఆర్‌

ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఇవి కూడా చదవండి

తారకరత్న మృతి పట్ల ఏపీ సీఎం సంతాపం..

సినీ నటుడు తారకరత్న మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రతిభావంతుడు, ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు: చిరంజీవి

తారకరత్న మృతి పట్ల సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ ఎంతో ప్రతిభావంతుడు, ఆప్యాయంగా కలిసిపోయే వ్యక్తి అనంతలోకాలకు చేరాడు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటున్నాను. తారకరత్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అంటూ ట్వీట్‌ చేశారు.

చాలా బాధాకరం: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు..

ఆయన మృతి పట్ల ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సంతాపం తెలిపారు. “నటుడు నందమూరి తారకరత్న మృతి చెందడం చాలా బాధాకరం. ఈ దుఃఖ సమయంలో అతని కుటుంబసభ్యులకు, స్నేహితులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ట్విట్టర్‌లో సందేశం పంపారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్‌ కల్యాణ్‌

‘‘ బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీనటుడు తారకరత్న కోలుకొంటారని అనుకున్నాను. నటుడిగా రాణిస్తూనే రాజకీయంగా అడుగులు వేశారు. అయితే, ఆ ఆశలు నెరవేరకుండానే కన్నుమూయడం దురదృష్టకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అంటూ పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

షాక్‌కి గురయ్యాను: మహేష్ బాబు..

తారకరత్న అకాల మరణం పట్ల సినీ నటుడు మహేష్ బాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘చిన్న వయసులోనే తారకరత్న కన్నుమూయడం చాలా బాధగా ఉంది. ఆయన కుటుంబం, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.

తారకరత్న మృతి చెందడం దుదృష్టకరం: కిషన్‌రెడ్డి

సినీ నటుడు తారకరత్న మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ‘‘నటుడిగా మంచి పేరు సంపాదించిన తారకరత్న.. చిన్న వయసులోనే కన్నుమూయడం చాలా బాధాకరం. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు.

తారకరత్న మరణం సినీ రంగానికి తీరని లోటు: రేవంత్‌రెడ్డి

సినీ నటుడు నందమూరి తారకరత్న మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తారకరత్న మరణ వార్త నన్ను చాలా కలచివేసింది. ఆయన మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. చిన్న వయసులోనే సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తారకరత్న మరణం సినీ రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అంటూ రేవంత్ రెడ్డి ఓ ప్రకటన విడుద చేశారు.

సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకున్నాం: ఎంపీ విజయసాయిరెడ్డి

తారకరత్న మృతి పట్ల ఏపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సంతాపం తెలిపారు. ‘సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకున్నాం. కానీ, విధి మరోలా తలచింది. నందమూరి తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చూకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ ట్వీట్ చేశారు.

తారకరత్న ఆత్మకు శాంతి కలగాలి: హీరో సాయిధరమ్ తేజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..