బాహుబలి ప్రభాకర్ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాడు. తన సొంత గ్రామం హుస్నాబాద్ లోనే నూతన గృహం నిర్మించుకున్నాడు. ఇక తాజాగా గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, నటుడు దిల్ రమేష్ లు హాజరయ్యారు. వారిని ప్రభాకర్, సతీమణి రాజ్యలక్ష్మిలు సాదరంగా ఆహ్వానించారు. ఇక ఈ గ్రామానికి దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ రావడంతో ఆయనను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. ఆలాగే వారితో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఇక బోయపాటి కూడా చాలా సహనంతో అభిమానులతో ముచ్చటించారు. అడిగిన వారికి ఫొటోలు, సెల్ఫీలు ఇచ్చారు. అనంతరం భోజనం చేసి హైదరాబాద్ కు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రభాకర్ 2007 నుంచి సినిమాల్లో ఉన్నాడు. ఇప్పటి వరకు 5 భాషల్లో 120 కు పైగా సినిమాల్లో నటించాడు. 2007లో మహేష్ బాబు నటించిన అతిథి సినిమాతో సినిమా కెరీర్ ప్రారంభించాడు ప్రభాకర్. ఆ తర్వాత పరుగు, బుజ్జిగాడు, మర్యాద రామన్న, సీమ టపాకాయ్, దూకుడు, వీర, దమ్ము, లవ్లీ, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, లెజెండ్, ఆగడు, లౌక్యం, బాహుబలి, సరైనోడు, దువ్వాడ జగన్నాథం, జై సింహా, దేవదాస్, నారప్ప, అఖండ, హీరో, తదితర హిట్ సినిమాల్లో నటించాడు. అయిత వీటన్నిటికన్నా బాహుబలిలో అతను పోషించిన కాలకేయుడి పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. వీటితో పాటు కన్నడ, తమిళం, మలయాళం, భోజ్ పురి, హిందీ సినిమాల్లో నటించాడు ప్రభాకర్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.