
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు కెమెరాలు క్లిక్‌మనిపించకుండా ఉండలేరు. వారినే ఫాలో అవుతూ ప్రతి కదలికను క్యాప్చర్ చేయాలనుకుంటారు. కొన్నిసార్లు నటులకు ఇది విసుగు పుట్టిస్తుంది. స్వేచ్ఛగా ఉండనివ్వడం లేదని విసుక్కుంటారు కూడా! సహనం నశించినప్పుడైతే ఇక చాలు అని నిర్మొహమాటంగా హెచ్చరిస్తారు. వారి లుక్స్‌ను కెమెరాల్లో బంధించే పనిలో బిజీగా ఉండే కెమెరామన్లు వాళ్ల మాటను పెద్దగా పట్టించుకోరు. ఇది తరచూ జరిగే వ్యవహారమే! అయితే తాజాగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. సైఫ్ అలీ ఖాన్, అతని భార్య కరీనా కపూర్ ఓ పార్టీకి వెళ్లారు. మలైకా అరారో తల్లి జోయ్‌సీ 70వ పుట్టినరోజు వేడుకలకు వీరు జంటగా హాజరయ్యారు. అనంతరం పార్టీ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసిన వీళ్లను కెమెరామన్లు వెంబడిస్తూ ఫోటోలు తీశారు.
ఈ వ్యవహారం సైఫ్ అలీఖాన్‌కు నచ్చలేదు. అప్పటికే విసుగెత్తిపోయి సహనం కోల్పోయి మీడియాపై మండిపడ్డారు. మీరంతా ఓ పని చేయండి…మా బెడ్‌రూమ్‌లోకి కూడా వచ్చేయండి’ అని సరదాగా వ్యాఖ్యానించాడు. అది విని కరీనా చిన్నగా ఓ నవ్వు నవ్వింది. వెంటనే అక్కడున్న ఓ ఫోటోగ్రాఫర్ ‘సైఫ్ సర్, మీరంటే మాకెంతో ఇష్టం’ అని అరిచాడు. దీనికి సైఫ్ ‘మాకూ మీరంటే ఎంతో ఇష్టం’ అని రిప్లై ఇస్తూ హడావుడిగా లోనికి వెళ్లిపోయాడు.
ఇక సైఫ్ సినిమాల విషయానికి వస్తే.. అతను చివరగా విక్రమ్‌వేద సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఆయన దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్‌లో రావణుడిగా నటిస్తున్నాడు. కరీనా కపూర్ విషయానికి వస్తే ఆమె చేతిలో ద డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్, ద క్య్రూ చిత్రాలున్నాయి. అలాగే హన్సల్ మెహతా డైరెక్షన్‌లో పని చేయనుంది.