
దక్షిణాది సినీ పరిశ్రమలో 17ఏళ్ల వయసులోనే అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది దివ్యభారతి. చిన్న వయసులోనే స్టార్ హీరోల సరసన నటించిన ఆమె 19 ఏళ్ల వయసులోనే మరణించింది. ముంబైలోని ఐదవ అంతస్తులోని అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి కిందపడి మృతి చెందింది. అప్పట్లో ఆమె మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎవరో కావాలని దివ్య భారతిని పై నుంచి పడేశారని కొందరు వాదించారు. ఇప్పటికీ ఇండస్ట్రీలో దివ్యభారతి మరణం వీడని మిస్టరీ. అయితే తాజాగా ఆమె మృతి పై బాలీవుడ్ నటుడు కమల్ సదానా సంచలన వ్యాఖ్యలు చేశారు. దివ్యభారతి మరణం కేవలం ప్రమాదం మాత్రమే అని.. ఆ ఘటన జరగడానికి మూడు రోజుల ముందు ఆమెతో కలిసి పనిచేశానని కమల్ అన్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన జీవితంలో జరిగిన ఘటనలు.. దివ్యభారతి మరణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సిద్ధార్థ్ కన్నన్తో జరిగిన ఇంటర్వ్యూలో కమల్ సదనన్ మాట్లాడుతూ.. “దివ్యభారతి మరణవార్త చాలా కఠినమైనది. ఆమె మరణం నిజంగా చాలా బాధను కలిగించింది. ఆమె అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరు. ఆమెతో కలిసి పని చేయడం చాలా సరదాగా ఉండేది. కానీ ఆమె మరణవార్త విని చాలా షాకయ్యాను. అదెలా సాధ్యం ?.. అసలు నమ్మకం కలగలేదు. ఎందుకంటే ఆమెతో అంతుకు మూడు రోజుల ముందే కలిసి పనిచేశాను. ” అని అన్నారు. దివ్యభారతి మరణించిన సమయంలో ఆమె చేతిలో అనేక సినిమాలు ఉన్నాయని.. ఆమె పెద్ద స్టార్ అయ్యే అవకాశం ఉండేదని గుర్తుచేసుకున్నారు. ఆమె పడిపోవడం కేవలం ప్రమాదం మాత్రమే అని.. బహుశా ఆమె కొన్ని డ్రింక్స్ తాగడం వల్లే జరిగిందని అనుకుంటున్నానని అన్నారు.
” మరణానికి ముందు దివ్య కొన్ని డ్రింక్స్ తాగినట్లు ఉంది. ఆమె చుట్టూ తిరుగుతూ చాలా సరదాగా ఉంది. కానీ ఆమె అనుహ్యంగా బాల్కానీ నుంచి కిందపడిపోయింది. అది కేవలం ప్రమాదవశాత్తు జరిగింది. ఆమె ఆరోగ్యంగానే ఉండేది. ఎలాంటి సమస్యలు లేవు. ఓవైపు ఆమె పూర్తి చేసిన సినిమాలు.. మరోవైపు ఆమె చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి” అంటూ చెప్పుకొచ్చాడు. దివ్యభారతి హిందీలో విశ్వాత్మ, షోలా ఔర్ షబ్నం, దీవానా వంటి చిత్రాల్లో నటించింది. అదే సమయంలో ఆమె బాలీవుడ్ నిర్మాత సాజిత్ నడియవాలాను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.