ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్-5’ రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతోంది. టీవీ ప్రేక్షకులకు బోలెడంత వినోదాన్ని అందిస్తోన్న ఈ టీవీ షో క్రమంగా 50 రోజులకు చేరువవుతోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు పూర్తి చేయడానికి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ…గొడవ పడుతూ హౌజ్‌మేట్స్ రచ్చ రచ్చ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజా ఎపిసోడ్ మాత్రం ఎంతో హృద్యంగా సాగింది. కంటెస్టెంట్లు తమ వ్యక్తిగత జీవిత విషయాలను పంచుకున్నారు. ఈ సమయంలో కొందరు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈమేరకు తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది.
నేను పద్ధతిగానే పెరిగాను…పద్ధతిగానే ఉన్నాను.
ఈ ప్రోమోలా భాగంగా మొదట సన్నీ ‘ ముగ్గురు అబ్బాయిలను ఒక మహిళ పెంచడం ఎంత సవాలుతో కూడుకున్నదో నాకు తెలుసు ‘ అంటూ తన తల్లిని గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత తనకున్న గొంతు సమస్య గురించి కంటెస్టంట్లతో పంచుకున్న జెస్సీ..’ నాకు పుట్టక నుంచే గొంతులో సమస్య ఉంది. అందుకే నా వాయిస్ సరిగా ఉండదు. అది దేవుడిచ్చిన లోపం. ఎవరూ ఏం చేయలేరు. అయినా నేను గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కాను. ఫ్యాషనబుల్ ఐకాన్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాను. జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. అయితే మా అమ్మ ‘నా కొడుకు మోడల్’ అని ఎప్పుడూ బయట చెప్పుకోలేదు’ అని ఎమోషనల్ అయ్యాడు. ఇక ప్రియ ‘ పెళ్లి తరువాత సినిమాలు చేయడం మానేశాను. ఆ తర్వాత ఏడాదిలోపే అమ్మయ్యాను. అప్పటికింకా లైఫ్‌లో కుదురుకోలేదు. ఆర్థిక సమస్యలు చుట్టు ముట్టాయి’ అని తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది. ‘తల్లేమైనా పద్ధతిగా ఉందా…కూతురు ఉండడానికి ‘ అని తను అవమాన పడిన క్షణాలను గుర్తుకు చేసుకుంది సిరి. ‘ చిన్నప్పుడు మా ఊరి వాళ్లు అమ్మను ఎన్నో మాటలన్నారు. నన్ను కూడా హేళన చేశారు. అలాంటివారందరికీ ఒక విషయం చెబుతున్నా…నేను చిన్నప్పటి నుంచి పద్ధతిగానే పెరిగాను..పద్ధతిగానే ఉంటున్నా’ అని జెస్సీని హత్తుకుని భావోద్వేగానికి గురైంది. ‘ నీ వల్ల కాదు…నువ్వు చేయలేవురా అన్నవాళ్లు…నన్ను చూసి తలదించుకున్నప్పుడే నా జీవితంలో నిజమైన సంతృప్తి, సంతోషం కలుగుతాయి’ అని రవి ఎమోషనల్ కాగా… ‘నా గురించి ఎవ్వరేమనుకున్నా నా నవ్వే వారికి సరైన సమాధానం’ అని విశ్వ చెప్పుకొచ్చాడు. ఇక చివరగా లోబో మాట్లాడుతూ..’ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా జట్టుకు రంగేస్తే ‘ఏందిరా…లోబోలా తయారయ్యావ్’ అని సంబర పడిపోయాడు. మొత్తం మీద గతంలో కంటే ఈ ప్రోమో కొంచెం భిన్నంగా, హృద్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది.
Also Read: