
తెలంగాణలోనే పుట్టి పెరిగిన ఈ అమ్మడు యాంకర్, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఒకటి రెండు సినిమాల్లోనూ నటించింది. అయితే బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టడంతోనే ఈ ముద్దుగుమ్మ పేరు బాగా వినిపించింది. ఎనిమిదో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఈ తెలంగాణ బ్యూటీ తన ఆట, మాట తీరుతో బాగానే ఆకట్టుకుంది. ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. తనను చూస్తుంటే బిగ్ బాస్ చివరి వరకు ఉంటుందనిపించింది. కానీ చాలా మంది కంటెస్టెంట్స్ లాగే అనవసరమైన లవ్ ట్రాక్ తో పూర్తి నెగెటివిటీ తెచ్చుకుంది. దీంతో అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చింది. వచ్చీ రాగానే తన ప్రియుడిని పరిచయం చేసింది. ఆ వెంటనే పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం ఆపై పెళ్లి.. ఇలా చకా చకా జరిగిపోయాయి. ఇప్పుడు తమ ప్రేమ బంధానికి ప్రతీకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనుందీ బిగ్ బాస్ బ్యూటీ. తను మరెవరో కాదు సోనియా ఆకుల.
గతేడాది నవంబర్ లో తన ప్రియుడు యశ్‌వీర్ గ్రోనితో నిశ్చితార్థం చేసుకుంది సోనియా. ఆ తర్వాతి నెల రోజులకే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. ఇప్పుడు తల్లిగా ప్రమోషన్ పొందనుంది. ఈ విషయాన్ని ఆమెనే సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. ఈ మేరకు సోనియా ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె ఓ ప్రాజెక్ట్ రూపంలో ఫైల్ పట్టుకుని మరి వచ్చి తన భర్త యశ్‌వీర్ గ్రోనికి ఈ శుభవార్తను తెలియజేసింది. ఇది విన్న యశ్‌వీర్ గ్రోని తన భార్యను హత్తుకుని సంతోషం వ్యక్తం చేశారు. ది లిటిల్ మిరాకిల్ ఆన్ ది వే.. వి ఆర్ ఓవర్ జాయిడ్ అంటూ సోనియా షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ, బుల్లితెర ప్రముఖులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్, నెటిజన్లు సోనియా దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .