AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాయకష్టం నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా.. ఝాన్సీ గురించి ఈ విషయాలు తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే

బిగ్ బాస్ గేమ్ షో తెలుగులో ఎంత సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గేమ్ షో ఇప్పటికే 9 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 10తో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. గ్రాండ్ గా సీజన్ 10 మొదలైంది.

కాయకష్టం నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా.. ఝాన్సీ గురించి ఈ విషయాలు తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే
Singer Jhansi
Rajeev Rayala
|

Updated on: Sep 06, 2026 | 8:33 PM

Share

బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లోకి కామనర్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది సింగర్ ఝాన్సీ.  తన జీవిత ప్రయాణాన్ని, బిగ్ బాస్ ఎంట్రీ వెనుక ఉన్న తన ఆశయాలను, కష్టాలను TV9 ఇంటర్వ్యూలో పంచుకుంది. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన ఝాన్సీ, ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చింది. ముగ్గురు అక్కచెల్లెళ్లు, ఒక తమ్ముడితో కూడిన ఆమె కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంది. తండ్రి కేబుల్ ఆపరేటర్‌గా, మున్సిపాలిటీలో ఎలక్ట్రిషియన్‌గా కూడా పని చేస్తారు. ఝాన్సీ చదువులోనూ ముందుండేది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ పూర్తి చేసింది. అయితే కేవలం చదువుకే పరిమితం కాకుండా, తండ్రికి సహాయంగా తొమ్మిదో తరగతి నుంచే వ్యవసాయ పనులు చేస్తున్నా అని తెలిపింది ఝాన్సీ. పొలం దున్నడం నుంచి వరి కోత వరకు అన్ని పనుల్లో ఆమెకు ప్రావీణ్యం ఉంది. మధ్యలో తండ్రి అనారోగ్యానికి గురైనప్పుడు, తమ్ముడితో కలిసి వ్యవసాయ బాధ్యతలన్నింటినీ తన భుజాలపై వేసుకుంది ఝాన్సీ. గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు కూడా సన్నద్ధమవుతున్నట్లు వెల్లడించింది. ఇన్ని పనులతో పాటు పాట పాడడం అనేది ఆమెకు దేవుడిచ్చిన గొప్ప వరం. ఆమె తాతల కాలం నుంచే జీన్స్‌లో ఉన్న సంగీత సంప్రదాయం ఆమెకు అబ్బింది. చిన్నప్పటి నుంచే పాటలు పాడుతూ పాఠశాల కార్యక్రమాల్లో పాల్గొనేది. మూడో తరగతిలో ఆడపిల్ల నమ్మ నేను ఆడపిల్లని అనే పాట పాడి అందరి ప్రశంసలు పొందింది.

సోషల్ మీడియాలో సింగర్ ఝాన్సీగా గుర్తింపు పొందడం వెనుక ఆమె తమ్ముడి కృషి ఎంతో ఉంది. ఝాన్సీ చేసే ప్రతి పనిని వీడియో తీసి, ఎడిట్ చేసి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసి ప్రోత్సహించాడు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 863 వేలకు పైగా, యూట్యూబ్‌లో 3 లక్షలకు పైగా ఫాలోవర్లను కలిగి ఉంది. తన యూట్యూబ్ ఆదాయం తండ్రికి ఆసరాగా నిలుస్తుందని తెలిపింది ఝాన్సీ. బిగ్ బాస్‌లోకి వెళ్లాలనే ఆలోచన మొదట లేదని, కానీ తన తమ్ముడి ప్రోత్సాహంతోనే ముందుకు అడుగు వేసినట్లు ఝాన్సీ తెలిపింది. కోట్లాది మంది ప్రజలు చూసే ఈ వేదిక ద్వారా తన ప్రతిభను నిరూపించుకొని, మరింత మందికి పరిచయం కావాలనేది ఆమె ప్రధాన ఆశయం. కష్టపడే తత్వం, పట్టుదల కలిగిన తనలాంటి ఒక పల్లెటూరి అమ్మాయి రియాలిటీ షోలో ఎంత దూరం వెళ్లగలదో నిరూపించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 ఆడిషన్స్‌లో ఝాన్సీ పాల్గొంది. కామనర్‌లకు అవకాశం ఉండటంతో, తమ్ముడు అప్లై చేయమని కోరాడు. మొదట పర్సనల్ ఇంటర్వ్యూ, ఆ తర్వాత జూమ్ మీటింగ్, గ్రూప్ డిస్కషన్ వంటి పలు రౌండ్ల ద్వారా ఎంపికైంది. తల్లిదండ్రులు తన నిర్ణయానికి పూర్తి మద్దతు ఇచ్చారని, తాను ఏ పని చేసినా కుటుంబం మంచి కోసమే ఆలోచించి చేస్తానని, కాబట్టి తన నిర్ణయాలను వారు ఎప్పుడూ తప్పుపట్టలేదని చెప్పింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో నవదీప్ వంటి జడ్జీలు తనకు మద్దతుగా నిలవగా, ఫేవరెటిజం ఆరోపణలు వచ్చినా, తాను ఎవరి సపోర్ట్‌తో కాకుండా కేవలం తన ఆటతోనే గెలిచానని ఝాన్సీ స్పష్టం చేసింది. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన ఝాన్సీ, తన రైతుబిడ్డ ట్యాగ్‌పై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా పంచుకుంది. “నేను రైతుబిడ్డనే, నాకు దాని గురించి గర్వంగా ఉంది. కానీ బిగ్ బాస్‌లో నేను ఆ ట్యాగ్‌ను సింపతీ కోసం వాడటం లేదు. నేను గత పది సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను. నా కష్టాన్ని పక్కన పెట్టి, కేవలం నా ఆటను చూసి ఓట్లు వేయాలని ప్రేక్షకులందరినీ రెండు చేతులెత్తి వేడుకుంటున్నాను. నా ఆటతోనే నన్ను ముందుకు నడిపించండి” అని విజ్ఞప్తి చేసింది. ఈసారి బిగ్ బాస్ ఇంట్లో ఒక రైతుబిడ్డ అద్భుతాలు సృష్టిస్తుందని, అందరినీ ఆకట్టుకుంటుందని ఝాన్సీ ధీమా వ్యక్తం చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us