నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తోన్న అన్‌స్టాపబుల్ టాక్ షోకు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో చెప్పక్కర్లేదు. ఇప్పటికే సీజన్ 1, 2, 3 పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సీజన్ 4 రాబోతుంది. నిన్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 అనౌన్స్ చేసి అందుకు సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు. కానీ ఈసారి సీజన్ కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఇప్పుడు కొత్తగా ఆలోచించి బాలయ్య పండగ అంటూ యానిమేషన్ తో సరికొత్త ప్రోమో చేశారు. దీంతో ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తమ అభిమాన హీరోను సూపర్ హీరోగా చూసుకుని మురిసిపోతున్నారు నందమూరి అభిమానులు. ప్రోమోను కొత్తగా యానిమేషన్ చేసి ప్రమోట్ చేస్తున్నారు ఆహా టీమ్. ఆహా OTT ప్లాట్‌ఫారమ్, ఎన్‌బికె మోస్ట్ ఎవైటెడ్ అన్‌స్టాపబుల్ సీజన్ 4 ను శనివారం అనౌన్స్ చేసింది. మునుపెన్నడూ చూడని సూపర్ హీరో పాత్రలో లెజెండరీ, షో హోస్ట్ నందమూరి బాలకృష్ణను ప్రజెంట్ చేసే అద్భుతమైన ఫస్ట్ లుక్, 3D యానిమేటెడ్ ప్రోమోని లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘అన్‌స్టాపబుల్ షో ఒక ఒక విస్పోటనం. దేశంలో నెంబర్ వన్ టాక్ షో. సీజన్ 4 ఇంకా అద్భుతంగా ఉంటుంది’ అని అన్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ.
అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఎపిక్ అనిమే ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అల్లు అరవింద్ (ఆహా డైరెక్టర్), అనిల్ రావిపూడి (డైరెక్టర్), తేజస్విని నందమూరి (అన్‌స్టాపబుల్ క్రియేటివ్ ప్రొడ్యూసర్), అజిత్ ఠాకూర్ (ఆహా డైరెక్టర్), రవికాంత్ సబ్నవిస్ (ఆహా CEO), రాజీవ్ చిలక (గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్) సహా పలువురు ప్రముఖులు ఈవెంట్ లో పాల్గొన్నారు. తమ జీవితాల్లో వెలుగులు నింపగల సూపర్‌హీరో కోసం గ్రామస్తులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు ట్రైలర్ ప్రారంభమైయింది. డ్రామటిక్ ట్విస్ట్‌లో, పవర్, చరిష్మాటిక్ ప్రజెన్స్ తో సూపర్‌హీరోగా బాలకృష్ణ సీన్ లో ఎంటరవ్వడం అదిరిపోయింది. “బాలయ్య పండుగ” అనే వేడుకతో ఎండ్ అయిన ట్రైలర్ అందరినీ కట్టిపడేసింది. ట్రైలర్ లో NBK సూపర్ హీరో క్యారెక్టర్ లో అదరగొట్టారు. ట్రైలర్ కి జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ అందరికీ దసరా శుభాకాంక్షలు. గెలుపు అన్నది మన చేతుల్లోనే ఉంది. ఏదైతే కొత్తగా అనుకుంటామో ఆ జయం మనల్ని వరిస్తుంది. విజయానికి ప్రతీక ఈ దసరా శరన్నవరాత్రులు. అన్‌స్టాపబుల్ మొదలవడమే ఒక విస్పోటనం. షో కూడా వేరే ఎవరైనా అడిగి ఉంటే చేసేవాడిని కాదు. కేవలం అరవింద్‌గారి కోసమే ఒప్పుకొన్నా. అన్‌స్టాపబుల్ అండ్ టీమ్ అంతా ఒక కుటుంబ సభ్యులులా పనిచేస్తూ కష్టపడ్డాం. ఆ కష్టానికి ఫలితమే అన్‌స్టాపబుల్ సక్సెస్. ఎంతో మంది హీరోలు, దర్శకులు, ప్రొడ్యూసర్లు మొదటి మూడు సీజన్ కి రావడం జరిగింది. వాళ్ళ మనసుల్లో మాటని ఎంతో ఓపెన్ గా పంచుకున్నారు. ఈ షో విజయంలో వారి పాత్ర వుంది. ప్రేక్షకులు ఏది కొత్తగా అనిపించినా దానికి ఆమోదం ముద్ర వేస్తారు. నా చిన్న కూతురు తేజస్విని క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ఈ షోలో భాగం కావడం, స్క్రిప్ట్ రైటర్ రవి మచ్చ గారు, అలాగే టీం అంతా కూడా ఒక ఫ్యామిలీలా అహర్నిశలు కష్టపడ్డారు. ఎన్నో సినిమాలు కామిక్స్ రూపంలో వచ్చాయి. ‘అన్‌స్టాపబుల్’ మూడు సీజన్లు సక్సెస్ అయ్యాయి. అందుకే సీజన్-4 కొత్తగా అందించాలన్న ఉద్దేశంతో యానిమేషన్ రూపంలో ట్రైలర్ తీసుకొచ్చారు. సీజన్ 4 చాలా అద్భుతంగా వస్తుంది. ఎంత బాగుంటుందో ముందు ముందు మీరే చూస్తారు. అందరికీ కృతజ్ఞతలు’ తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.