అవన్నీ తిని రోడ్డు మీదే వాంతి చేసుకున్నాను.. కల్యాణ్‌ బాబాయే క్లీన్ చేశారు.. ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన చెర్రీ

|

Feb 03, 2023 | 3:46 PM

'వీడు (రామ్‌చరణ్‌) నా తమ్ముడు. మా అన్నయ్య నాకు తండ్రి. మా వదిన నాకు తల్లి' అంటూ రంగస్థలం సక్సెస్‌మీట్‌లో రామ్‌ చరణ్‌ గురించి పవన్‌ చెప్పిన మాటలు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

అవన్నీ తిని రోడ్డు మీదే వాంతి చేసుకున్నాను.. కల్యాణ్‌ బాబాయే క్లీన్ చేశారు.. ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన చెర్రీ
Pawan Kalyan, Ram Charan
Follow us on

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌- మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పేరుకు బాబాయ్‌- అబ్బాయ్‌ అయినా వీరిద్దరి మధ్య అంతకుమించిన అన్యోన్య బంధం వీరి మధ్య ఉంది. ‘వీడు (రామ్‌చరణ్‌) నా తమ్ముడు. మా అన్నయ్య నాకు తండ్రి. మా వదిన నాకు తల్లి’ అంటూ రంగస్థలం సక్సెస్‌మీట్‌లో రామ్‌ చరణ్‌ గురించి పవన్‌ చెప్పిన మాటలు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాగే ‘ కల్యాణ్‌ బాబాయ్‌ను ఎవరైనా ఏదైనా అంటే ముందు నా దగ్గరకొచ్చి మాట్లాడండి’ అని నాయక్‌ సినిమా ఫంక్షన్‌లో రామ్ చరణ్‌ ఇచ్చిన వార్నింగ్‌ హైలెట్‌గా నిలుస్తుంది. ఇవన్నీ జస్ట్‌.. ఒకటి, రెండు ఉదాహరణలు మాత్రమే. తాజాగా పవన్‌- చెర్రీల మధ్య ఉన్న అన్యోన్యతకు ఆహా అన్‌స్టాపబుల్‌ షో వేదికగా నిలిచింది. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ టాక్‌ షోకు పవన్‌ కల్యాణ్‌ గెస్టుగా వచ్చారు. పవన్‌ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్‌ చేస్తుండగా.. తొలి భాగం గురువారం (ఫిబ్రవరి 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఎపిసోడ్‌లో భాగంగా పవన్‌ కల్యాణ్‌ తన అన్నయ్య, వారి పిల్లలతో ఉన్న అనుబంధాన్ని గురించి ఓపెన్‌ అయ్యారు. షోలో భాగంగా బాలయ్య రామ్‌ చరణ్‌కు కాల్‌ చేసి.. బాబాయ్‌తో తనకున్న అనుబంధం గురించి చెప్పమని అడిగాడు. దీనికి సమాధానమిచ్చిన చెర్రీ పవన్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు.

నాన్న నన్ను భరించలేక..

‘నేను మా అమ్మ కంటే ఎక్కువ బాబాయ్‌ దగ్గరే పెరిగాను. నన్ను భరించలేకపోతే మా నాన్న బాబాయ్ దగ్గరికే పంపేవారు. ఆయన నాతో గంటలు గంటలు మాట్లాడే వాళ్లు. బాబాయ్‌ చెప్పినవి ఒక పది రోజులు అలా ఫాలో అయ్యే వాడిని. ఆ తర్వాత మళ్లీ మామూలే. ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది.. సింగపూర్‌ టూర్‌లో బాబాయ్‌కు నరకం చూపించాను. మమ్మీ, డాడీ మాతో లేరు కదా అని రోడ్డు మీద ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ అన్నీ తిని అక్కడే వాంతి చేసుకున్నాను. పాపం అది బాబాయే క్లీన్ చేశారు. జాగ్రత్తగా నన్ను హోటల్ తీసుకెళ్లారు. ఆయన సింగపూర్ ట్రిప్‌ని నేను నాశనం చేశాను’ అని బాబాయ్‌తో ఉన్న మధురు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు చెర్రీ.

ఇవి కూడా చదవండి

బాబాయ్ లైఫ్ బోర్..

ఇక ఇదే ఎపిసోడ్‌ వేదికగా ‘మీ బాబాయ్‌ గురించి ఎవ్వరికి తెలియని సీక్రెట్‌ చెప్పు’ అని రామ్‌ చరణ్‌ని అడిగారు బాలయ్య. దీనికి రిప్లై ఇచ్చిన చెర్రీ.. ‘బాబాయ్‌ లైఫ్‌ చాలా బోరండి. కాకపోతే బాబాయ్‌కి హైదరాబాద్‌ బిర్యానీ అంటే చాలా ఇష్టం. వారానికి ఏడు రోజులు తినమన్నా అదే తింటారు’ అనే ఇంట్రెస్టింగ్‌ విషయం చెప్పుకొచ్చాడు. కాగా నిన్న ప్రసారమైన మొదటి ఎపిసోడ్ లో పవన్ ఫ్యామిలీ, సినిమాలు గురించి ఎక్కువగా మాట్లాడారు. ఇక రెండో ఎపిసోడ్ లో రాజకీయాల గురించి చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..