
కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్లది సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వీరి కాంబోలో వచ్చాయి. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ కోట, బాబూమోహన్ ల మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరు కలిసి ఎన్నో ఇంటర్య్వూలు కూడా ఇచ్చారు. తరచూ వీరు ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకుంటారు. అందుకే కోట శ్రీనివాసరావు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన నిజాన్ని బాబూ మోహన్ ఇంకా నమ్మలేకపోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన కోటతో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ‘ మా ప్రయాణం ఎలా మొదలైందంటే.. బొబ్బిలి రాజా మూవీతో మా కాంబినేషన్ మొదలైంది. మామగారు చిత్రంతో బాగా ఫ్రెండ్సయ్యాం. సెట్‌లో నాకు గోరుముద్దలు తినిపించేవాడుమేం ఇద్దరం ఆర్టిస్టులమే అయినా మాకు తెలియకుండానే అన్నదమ్ములమైపోయాం. ఏరా, ఎక్కడున్నావ్? వారమైంది, ఒకసారి ఇంటికి రారా అని సరదాగా పిలిచేవారు. కానీ ఇప్పుడా బంధం తెగిపోయింది. పాపం, కోటన్న చివరి రోజుల్లో కాలి నొప్పితో బాగా ఇబ్బంది పడ్డాడు. బాత్రూమ్‌లో కాలి జారి కింద పడడం, గాయం ఉన్న కాలికే మళ్లీ దెబ్బ తగలడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కనీసం నడవలేక కూర్చోలేక, నిలబడలేక నరకయాతన అనుభవించాడు. మూడేళ్ల నుంచి అదే గోస’
‘ అయితే ఒక విషయంలో మాత్రం భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతున్నాను. పూర్తిగా మంచానపడి, సపర్యలు ఎంతకాలం చేయాలని ఇంట్లోవాళ్లే అసహ్యించుకునే స్థాయికి భగవంతుడు కోటన్నను తీసుకెళ్లనివ్వలేదు. ఆయన నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూశాడు. అలాంటి చావే నాకూ ఇవ్వమని ఆ దేవుడికి చెప్పమని కోటన్నను వేడుకుంటున్నాను’
‘అన్న చనిపోవడానికి ఒకరోజు ముందే ఫోన్ చేసి మాట్లాడాను. అప్పుడు షూటింగ్ ఉండడంతో మళ్లీ చేస్తానని కాసేపాగి కాల్ చేశా. అప్పుడు అన్న నిద్రపోయాడని చెప్పారు. సరే, మళ్లీ నిద్రలేచాక ఫోన్ చేయమన్నాను. కానీ ఆ తర్వాతి రోజు తెల్లవారుజామున 5 గంటలకు కోటన్న చనిపోయారని ఫోన్ వచ్చింది. అంతే నాకు కన్నీళ్లు ఆగలేదు’ అని ఎమోషనల్ అయ్యారు బాబూ మోహన్