
సోషల్ మీడియా వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో అంతే నష్టం కూడా ఉంటుంది. చిన్న తప్పు చేసి నెటిజన్లకు దొరికేసామా ఇక అంతే ఒక ఆట ఆడేసుకుంటారు. ఇటీవల కాలంలో ఎక్కువగా పాపులర్ అయిన ట్రోల్స్ ఏమైనా ఉన్నాయంటే అది చంద్రహాస్ వి అనే చెప్పాలి. ఇంతకు చంద్రహాస్ ఎవరా అనుకుంటున్నారా.? బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్.. అతనికి యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ కూడా ఇచ్చేశారు నెటిజన్లు. అసలు విషయం ఏంటంటే ఇటీవలే చంద్రహాస్ హీరోగా పరిచయం అవుతూ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభం సందర్భంగా మనోడి ఎక్స్ ప్రెషన్స్, యాటిట్యూడ్, కెమెరా ముందు ఊగుతూ ఫోజులు ఇవ్వడం చాలా వైరల్ గా మారాయి. దాంతో నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్స్ చేశారు.
ఈ ట్రోల్స్ పై ప్రభాకర్ కూడా స్పందించారు. ట్రోల్స్ తో తన కొడుకు పాపులర్ అయ్యాడని కూడా అన్నారు. ఇదిలా ఉంటే ఆ రోజు ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చిందో చెప్పాడు చంద్రహాస్ అదే మన యాటిట్యూడ్ స్టార్.. అతను మాట్లాడుతూ.. ఆరోజు తాను కావాలని అలా చేయలేదని చెప్పుకొచ్చాడు. కెమెరాల ముందు తన తండ్రి తనని పొగుడుతుంటే నవ్వు ఆపుకోలేక అలా చేశానని, కావాలని చేసింది కాదని అన్నాడు.
అయితే అందరూ దాన్ని తప్పుగా అర్థం చేసుకొని నాకు యాటిట్యూడ్ఉందని ట్రోల్ చేశారని తెలిపాడు. అయితే తాను ఆ ట్రోల్స్ ని చాలా స్ఫూర్తిగా తీసుకున్నానని చెప్పడం విశేషం. నిజానికి ఈ ట్రోల్స్ తో చంద్రహాస్ ఓవర్ నైట్ లో పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. మరి ఈ కుర్రాడు హీరోగా ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.