‘బిగ్ బాస్ సీజన్ 7 లో అవకాశం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసాడు’ అంటూ అని యాంకర్, నటి స్వప్నా చౌదరి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్నా చౌదరి అలియాస్ స్వప్న యాంకర్‌గా, ఈవెంట్ ఆర్గనైజర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమెకు ఎప్పటి నుంచో బిగ్ బాస్ షోలో పాల్గొనాలని ఆశగా ఉందట. దీనినే అవకాశంగా తీసుకున్న సత్య తాను మాటీవీ ప్రొడక్షన్ ఇన్చార్జినని స్వప్నతో పరిచయం పెంచుకున్నాడు. ఆరు నెలల క్రితం బిగ్ బాస్ ఇంచార్జ్ అంటూ తమిళ రాజును స్వప్నకు సత్య పరిచయం చేశాడు. బిగ్ బాస్ ఏడో సీజన్‌లో తప్పకుండా అవకాశం కల్పిస్తానని స్వప్న దగ్గర 2.5 లక్షలు తీసుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. డబ్బు తిరిగి అడిగితే బెదిరింపులకు దిగారు. దీంతో పోలీసులను ఆశ్రయించింది స్వప్న. కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో మిస్టరీ, నమస్తే సేట్ జీ అనే చిన్న సినిమాల్లోనూ నటించింది స్వప్నా చౌదరి. అలాగే పలువురు సినీ సెలబ్రిటీలతో ఆమెకు మంచి సంబంధాలున్నాయి.
తెలుగులో బిగ్ బాస్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచే ఈ సెలబ్రిటీ గేమ్ షోపై ఆసక్తి పెంచుకుంది స్వప్న. ఎలాగైనా ఈ గేమ్ షోకి వెళ్లాలనుని తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే అదనుగా తీసుకుని సత్య ఆమెను మోసం చేశాడు. దీనికి సంబంధించి కొన్ని రోజుల క్రితమే వీడియోను రిలీజ్ చేసిందామె. అందులో తమిళ రాజు చేతిలో తాను ఎలా మోసపోయిందో సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. ఇప్పుడిదే విషయమై పోలీసులను ఆశ్రయించింది స్వప్న.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.