
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ తన స్టైలిష్ లుక్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగించే ఈ చిన్నది, తన మనసులోని అసలు సిసలైన కోరికను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు, బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే వారసురాలు అనన్య పాండే.
ప్రస్తుత జనరేషన్‌లో ‘హుక్-అప్’ సంస్కృతి రాజ్యమేలుతోంది. ఇక్కడ బంధాలు చాలా వేగంగా ఏర్పడతాయి. అంతే వేగంగా ముగిసిపోతాయి. అయితే, అనన్య పాండే ఈ ధోరణిని ఏ మాత్రం ఇష్టపడటం లేదు. 90ల కాలం నాటి ప్రేమకథలే ఎంతో స్వచ్ఛంగా, గొప్పగా ఉండేవని ఈ భామ బలంగా నమ్ముతోంది. అప్పట్లో ప్రేమలో ఉండే గాఢత, ఒకరికోసం ఒకరు వేచి చూసే ఆ మధురమైన అనుభూతి నేటి ఆధునిక జీవితంలో కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది అనన్య.
తాజా ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలను షేర్ చేసుకుంది. తాను పాతకాలం నాటి సాంప్రదాయ పద్ధతుల్లో సాగే ప్రేమకే ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేసింది. తన సినిమాల్లో కనిపించే ఆధునిక పాత్రలకు భిన్నంగా, నిజజీవితంలో తాను ఒక ‘ఓల్డ్ స్కూల్ రొమాంటిక్’ అని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తన తాజా చిత్రంలోని రూమీ అనే పాత్రకు బాగా కనెక్ట్ అవ్వడానికి కారణం కూడా ఆ పాత్రలో ఉండే లోతైన భావోద్వేగాలేనని తెలిపింది.
Ananya Panday
ప్రేమ విషయంలోనే కాదు, కుటుంబ విలువల విషయంలోనూ అనన్య చాలా స్పష్టంగా ఉంది. తనకు తన ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టమని, తన జీవిత భాగస్వామి కూడా కుటుంబానికి సమానమైన ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి అయి ఉండాలని కోరుకుంటోంది. తన భాగస్వామి కుటుంబం కూడా తన సొంత కుటుంబంలాగే కలిసిపోవాలని ఆశిస్తోంది.
అయితే అనన్య పాండే ఈ వ్యాఖ్యలు చేయగానే సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
గతంలో ఆమె ఇషాన్ ఖత్తర్, కార్తిక్ ఆర్యన్, ఆదిత్యరాయ్ కపూర్ వంటి హీరోలతో డేటింగ్ చేసినట్లు వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ, మరి ఆ బంధాల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గ్లామర్ ప్రపంచంలో ఉంటూ ఇలాంటి పాతకాలపు విలువల గురించి మాట్లాడటం విశేషమే అని మరికొందరు ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా, అనన్య చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.