Allu Aravind In Aha First Anniversary: తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ ఈ స్థాయిలో విజయవంతమైందంటే దానికి కారణం మీడియానేనని అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘ఆహా’ ఓటీటీ ప్రారంభమై నేటితో (సోమవారం) ఏడాది పూర్తయిన సందర్భంగా.. తొలి వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ‘ఆహా’ వ్యవస్థాపకుల్లో ఒకరైన అల్లు అరవింద్ మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆహాలో వచ్చిన ప్రతీ షోను, కంటెంట్‌ను మీడియా చాలా ఓపికగా రాస్తూ, చూపిస్తూ ప్రేక్షకులకు చేరవేశారని అన్నారు. ఆహా విజయ ప్రస్థానంలో మీడియాదే కీలకపాత్ర అని అరవింద్ అభిప్రాయపడ్డారు. నిజానికి ఈ తొలి వార్షికోత్సవ వేడుకను చాలా గ్రాండ్‌గా నిర్వహించాల్సి ఉండగా.. కొంతమంది ముఖ్యమైన వాళ్లు ఊరిలో లేరు అందుకే.. ఇలా సింపుల్‌గా చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. నిజానికి ‘ఆహా’ ప్రస్తుతం సాధించిన గణాంకాలను వారి టీమ్ 2022 మార్చి నాటికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారట కానీ ఏడాదిలో చేరుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా టీమ్ పనిచేసింది కాబట్టే ‘ఆహా’ ఈరోజు ఈ స్థాయిలో ఉందని తెలిపారు. ఇక ఇదే వేదికపై అల్లు అరవింద్.. జూపల్లి రామేశ్వర రావుపై అభినందనలు కురిపించారు. ‘ఈ స్టేజీ మీదికి రాకుండా.. మీకెవరకీ కనిపియ్యకుండా.. మా వెనక బలంగా ఉంది రామేశ్వర రావు గారు. ఆయనకి ఈ స్టేజీ మీద థ్యాంక్యూ చెప్పకపోతే నాది తప్పవుతుంది. ఆహా వెనక ఉన్న రామేశ్వ రావు గారికి బిగ్ థ్యాంక్యూ’ అంటూ చెప్పుకొచ్చారు.