
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ లక్ష్యంగా చేసుకుని తయారు చేసిన ఏఐ (AI) ఆధారిత వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ కావడంతో రంగంలోకి దిగిన కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల్లో వేశారు. అకీరా నందన్ పేరు, ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా డీప్‌ఫేక్ రూపంలో తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. సీఐ బిపెద్దిరాజు తెలిపిన వివరాల ప్రకారం..
నిందితుడిని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ మద్దినేని వెంకటరమణగా గుర్తించారు. గత కొంత కాలంగా వైద్య వృత్తికి దూరంగా ఉంటున్న నిందితుడు అనుమతి లేకుండా అకీరానందన్‌పై లవ్ స్టోరీ పేరిట ఏఐ సాయంతో సినిమా తీసి యూట్యూబ్‌లో విడుదల చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంకటరమణను అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇంకెవరిదైనా ప్రమేయం ఉందేమోనన్న కోణంలో దర్యాప్తు సాగుతుంది.
మరోవైపు దీనిపై అకీరానందన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్ఠ, వ్యక్తిగత గోప్యత, భద్రతకు భంగం కలుగుతోందని.. తన పేరు, ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా డీప్‌ఫేక్ రూపంలో తయారు చేయకుండా నిలువరించేందుకు ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్‌లో కోరారు. అలాగే తన పేరు, వ్యక్తిగత చిత్రాలను దుర్వినియోగం చేయకుండా సంబంధిత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
ఇక పెరుగుతున్న టెక్నాలజీని ఆసరాగా చేసకుని సైబర్ నేరాలు రోజురోజుకీ హద్దులు మీరుతున్న సంగతి తెలిసిందే. సెలబ్రెటీల ఏఐ డీప్‌ఫేక్ వీడియోలను టెక్నాలజీ సహాయంతో తయారు చేసి దుర్వినియోగానికి పాల్పడుతున్న ఘటనలు ఇటీవల షరా మామూలై పోయింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు కూడా ఇలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించకుండా, వాటిని షేర్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లలో పలువురి సెలబ్రెటీల డీప్‌ఫేక్ వీడియోలపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏకంగా డిప్యూటీ సీఎం కుమారుడినే టార్గెట్ చేయడంతో సెలబ్రిటీల కుటుంబ సభ్యుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.