ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల వేడుకకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. దర్శక ధీరుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలవడంతో భారతీయులు కూడా ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాటు నాటు సాంగ్ ఆస్కార్ పురస్కారాన్ని గెల్చుకోవాలని దేశమంతటా ప్రార్థనలు, పూజలు జరుగుతున్నాయి. అలాగే ఆల్ ది బెస్ట్ త్రిబుల్ ఆర్ టీమ్ అంటూ సోషల్ మీడియా వేదికగా తమ మద్దతు తెలియజేస్తున్నారు. ఈక్రమంలో ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ నాటు నాటు పాటకు ఆస్కార్ గెల్చుకోవాలని ఆకాంక్షించాడు. అలాగే ఈ పాట గ్రామీ అవార్డు కూడా సొంతం చేసుకోవాలని తన కోరికను వెలిబుచ్చాడు. ‘ఆస్కార్ నామినేషన్లలో భారతీయ సినిమా నిలిచి చాలా ఏళ్లైంది..ఇప్పుుడు ఆర్ఆర్ఆర్ సినిమా పాట ఆ గౌరవం దక్కించుకుంది. ఇక నుంచి ప్రతియేటా భారతీయ సినిమాలు నామినేషన్ దక్కించుకోవాలని కోరుకుంటున్నా. ఈసారి ఆర్ఆర్ఆర్ బలమైన పోటీ ఇస్తోంది. ప్రతిష్ఠాత్మక పురస్కారం గెలవాలని కోరుకుంటున్నా. ఈ సాంగ్‌కు ఆస్కార్, గ్రామీ అవార్డుల్లో ఏది వచ్చినా భారతదేశ కీర్తి మరింత పెరుగుతుంది’ అని రెహమాన్ ఆకాంక్షించారు.
కాగా 2009లో స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని జయహో పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగరీలో ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డు గెల్చుకున్నారు. అయితే ఇది బాలీవుడ్ మూవీ అయినప్పటికీ దీనిని ఆంగ్ల దర్శకుడు డానీ బాయిల్ తెరకెక్కించారు. కాబట్టి ఆర్‌ఆర్‌ఆర్ ఆస్కార్ గెలిస్తే ఈ ఘనత దక్కించుకున్న మొదటి చిత్రమవుతుందని చాలామంది భావిస్తున్నారు. ఆస్కార్ వేడుక మరి కొద్దిగంటల్లో లాస్ ఏంజిల్స్‌లోని డోల్బీ థియేటర్ వేదికగా ప్రారంభం కానుంది. అంతకుముందు నాటు నాటు పాట పాడిన గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవల లైవ్ ఫెర్మామెన్స్ ఉంటుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..