నయనతార విగ్నేష్ – శివన్ దంపతులు ఇటీవల కవల పిల్లలకు తల్లిదండ్రులై మంచి ఆనందంలో ఉన్నారు. అయితే వీరి ఆనందం ఎంతో కాలం నిలవకుండానే అసలు సరోగసి ద్వారా పిల్లలను కనడం ఏమిటి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వర్షం కురుస్తోంది.. అయితే, ఇప్పటివరకు ఈ జంట తాము సరోగసి ద్వారా పిల్లలకు కన్నామన్న విషయాన్ని కూడా నేరుగా ప్రకటించలేదు కానీ పెళ్లయిన నాలుగు నెలల లోపే పిల్లల్ని కనడంతో వీరు సరోగసి ద్వారానే పిల్లల్ని కని ఉంటారని ఉద్దేశంతో పెద్ద ఎత్తున దుమారం రాజుకుంది. గతంలో మంచు లక్ష్మీ, ప్రియాంక చోప్రా, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్ వంటి వారు సరోగసి ద్వారా పిల్లలను కన్నారు. అయితే, నయనతార ఈ వ్యవహారంలో నిబంధనలను పాటించారా? లేదా? అన్న విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది.
భారతదేశంలో సరోగసి ద్వారా పిల్లల్ని కనడం లీగల్ గా చెల్లదు. కాబట్టి ఏదో మతలబు ఉందంటూ పలువురు వారికి ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. కారణం సరోగసి విధానంతో అద్దె తల్లి ద్వారా పిల్లలను కనడం అన్న అంశంపై ఈ ఏడాది జనవరిలోనే నిషేధం విధించారు. అలాంటిది గత జూన్ నెలలో నయనతార దర్శ కుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకున్నారు. నాలుగు నెలల్లోనే నయనతార ఈ జంట సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు కావడం వివాదంగా మారింది. సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను కనడానికి కొన్ని చట్టపరమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని నటి కస్తరి లేవనెత్తారు. సరోగసి ద్వారా తల్లిదండ్రులు కావాలనుకుంటే వారికి పెళ్లి జరిగి కనీసం మూడేళ్లు పూర్తవ్వాలి. అలాగే తల్లికి పిల్లలు పుట్టే అర్హత లేకపోవడమో, లేక ఆమెకి ఇష్టం లేకపోవడమో వంటి తగిన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. అయితే నటి నయనతార ఈ విషయంలో విధి, విధానాలను మీరినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఇక ఇప్పటికే ప్రభుత్వం కూడా ఈ విషయం మీద సీరియస్ అయింది. తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్ ఈ విషయం మీద నయనతార దంపతులను వివరణ కోరుతామని కూడా అన్నారు. ఈ వ్యవహారంలో న్యాయనిపుణులు కూడా నయనతారకు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ వ్యాఖ్యలు చేస్తున్నారు. పిల్లలను పొందడానికి నయనతార, విఘ్నేష్ శివన్ ముందుగానే చట్టబద్ధంగా నమోదు చేసుకున్నారని, కాబట్టి వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం లేదని కొందరు న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.
అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడాన్ని సరోగసీ అంటారు. అంటే ఇక్కడ వేరే మహిళ, పురుషులకు చెందిన బిడ్డను మరొక మహిళ తన గర్భంలో మోస్తారు. బిడ్డను మోసే మహిళకు ఆ బిడ్డ మీద ఎటువంటి హక్కులు ఉండవు. అండం, వీర్యం ఇచ్చిన వారే ఆ బిడ్డకు తల్లిదండ్రులు అవుతారు. గతంలో విదేశీయులు అద్దె గర్భం కోసం ఇండియన్ మహిళలను సంప్రదించేవారు. ఇది వ్యాపారంగా మారిపోవడంతో ఇండియన్ గవర్నమెంట్ విదేశీలకు ఇండియాలో సరోగసీ విధానాన్ని రద్దు చేసింది. సరోగసీకి సంబంధించి డిసెంబర్ 2021లో పార్లమెంటు రెండు చట్టాలను ఆమోదించింది.
సరోగసి నియంత్రణ చట్టం-2021 ప్రకారం భారత్‌లో పెళ్లి అయిన జంటలతోపాటు విడాకులు తీసుకున్న లేదా భర్త చనిపోయిన ఒంటరి మహిళలు మాత్రమే సరోగసి ద్వారా బిడ్డలు కనవచ్చు. నయనతార దంపతులకు సరోగసి ద్వారా బిడ్డలు పుట్టారు అని భావిస్తే వారు పెళ్లికి ముందే సరోగసి ప్రాసెస్ మొదలు పెట్టినట్లు అవుతుంది. అంటే వారు పెళ్లి చేసుకోవడానికి సుమారు 5 నెలల ముందే అద్దె గర్భంలో నయనతార దంపతుల బిడ్డలు పెరగడం మొదలైంది. ఆవిధంగా చూస్తే నయనతార దంపతులు చేసింది చట్టప్రకారం నేరం అవుతుంది. దీనికి సహకరించిన వైద్యులు, హాస్పిటల్ యాజమాన్యం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. వారు లక్ష రూపాయల ఫైన్, 10 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాలి.
ఇంతకీ చట్టం ఏం చెబుతుందంటే.. సరోగసి(నియంత్రణ) – 2021 చట్టం ప్రకారం బిడ్డను కోరుకునే జంటకు కచ్చితంగా పెళ్లి జరిగి ఉండాలి. మహిళ వయసు 23 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి. పురుషుని వయసు 26 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. సరోగసి ద్వారా పిల్లలను కోరుకునే దంపతులకు పిల్లలు ఉండకూడదు. ఎవరిని దత్తత తీసుకోని ఉండకూడదు. లేదా సరోగసి ద్వారా కూడా పిల్లలను కని ఉండకూదు. అయితే పిల్లలు మానసికంగా లేదా శారీరకంగా వైకల్యంతో ఉన్నప్పుడు లేదా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నప్పుడు దంపతులు సరోగసి ద్వారా మరొక బిడ్డను కనొచ్చు. సరోగసి ద్వారా పిల్లలను కనాలంటే ఆ అవసరం ఉందో లేదో ముందు సంబంధిత వైద్య అధికారుల నుంచి దంపతులు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సరోగసి నియంత్రణ చట్టం-2021లో పెళ్లి కానీ వ్యక్తుల గురించి ప్రస్తావన లేదు. ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు, ఎల్జీబీటీ కమ్యూనిటీకి సరోగసి ద్వారా బిడ్డలను కనే అవకాశాన్ని ఈ చట్టం ఇవ్వడం లేదు. సహజీనవంలో ఉండే జంటలకు కూడా సరోగసి అవకాశం లేదు. ఇక, మహిళ వాణిజ్య ప్రయోజనాల కోసం సరోగసీని చేపట్టినట్లు తేలితే మొదటి నేరానికి గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా విధించవచ్చు.
మరోవైపు ఈ విషయం మీద చాలామంది స్పందించారు కానీ నయనతార స్పందించలేదు. తాజాగా విగ్నేష్ శివన్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఈ విషయం మీద పరోక్షంగా స్పందించినట్లు టాక్ వినిపిస్తోంది. అన్ని విషయాలు సరైన సమయంలోనే మీకు తెలుస్తాయి అప్పటివరకు ఓపిక పట్టండి అంటూ ఆయన తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. అంతేకాక ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండండి అంటూ అందులో పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. తమిళ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాత్రమే ఆయన ఇలా కామెంట్ చేసి ఉంటాడని అంటున్నారు. సరైన సమయంలోనే మీకు అన్ని విషయాలు చెబుతామని అలాగే గతంలో తాము చేసిన మేలు మరిచిపోయి ఇప్పుడు తమ టార్గెట్ చేయడం కరెక్ట్ కాదంటూ నయనతార భర్త ఇప్పుడు మీడియా వారిని టార్గెట్ చేశారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం మీద కూడా ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
వీరి సంగతి ఇలా ఉంటే చెన్నైలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ వైద్యుడు నయనతారకు అద్దె తల్లి ద్వారా పిల్లలకు తల్లి కావచ్చని సలహా ఇచ్చినట్లు సమాచా రం. దీంతో వైద్యాధికారులు ఆస్పత్రి సిబ్బంది, వైద్యులపై చర్యలు తీసుకునే విషయమై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో అనే ఆసక్తి నెలకొంది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..