
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది నటి రేణూ దేశాయ్. సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటోంది. అయితే ఇటీవల ఆమె చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. తనకు ఆధ్యాత్మిక భావం ఎక్కువని, సన్యాసం తీసుకుంటానని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరలయ్యాయి. సోషల్ మీడియాలోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ రేణూ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అయితే తాజాగా రేణూ దేశాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో మరో వీడియోను పోస్ట్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సన్యాసం తీసుకుంటానంటూ తాను చేసిన కామెంట్స్‌పై మరోసారి స్పందించింది. ‘ ఇలాంటి వీడియో ఒకటి చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఇటీవల దీపావళి ఇంటర్వ్యూలో ఒక యాంకర్ నెక్ట్స్ ఏంటి అని అడిగింది. దానికి నేను సరదాగా సన్యాసం తీసుకుంటా అని ఆన్సరిచ్చాను. అంతే కానీ ఇప్పటికిప్పుడు సన్యాసం తీసుకుంటానని ఎక్కడా చెప్పలేదు. దీనిని ఇప్పుడు పెద్ద సెన్సేషన్ చేశారు.
‘ నా ఫ్రెండ్స్, బంధువులు కాల్ చేసి ఈ విషయం గురించి అడుగుతున్నారు. అసలు రేణూ దేశాయ్ కు ఏమైంది? బాగానే ఉందా? అని అడుగుతున్నారు. నాకు ఇద్దరు పిల్లలున్నారు. ఆద్య టెన్త్ క్లాస్ చదువుతోంది. అకీరాను కూడా సెటిల్ చేయాల్సి ఉంది. వారి బాధ్యత ఇప్పుడు నాపై ఉంది. ఇప్పుడైతే నేను సన్యాసం తీసుకోను. నా వయసు 55 నుంచి 60 వచ్చినప్పుడు ఆలోచిస్తాను. నాకిప్పుడు దేవుడి కంటే నా పిల్లలే ముఖ్యం’ అని ఫుల్ క్లారిటీ ఇచ్చింది రేణూ దేశాయ్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
కాగా 2023 లో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది రేణూ దేశాయ్. అయితే దీని తర్వాత మరో సినిమాలో నటించలేదీ అందాల తార. అదే సమయంలో సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటోంది మహిళలు, చిన్నారులు, మూగజీవాల సమస్యల పట్ల తన గళాన్ని వినిపిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ (NGO)ను కూడా ప్రారంభించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.