
జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో కంటే క్రేజ్ తగ్గినా ఇప్పటికీ చాలా మంది ఈ కామెడీ షోను క్రమం తప్పకుండా చూస్తుంటారు. దీనికి తోడు ఎంతో మంది కమెడియన్లు ఈ షో ద్వారానే గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకప్పుడు ఇదే జబర్దస్త్ లో కమెడియన్లు గా చేసిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, బలగం వేణు, ధనాధన్ ధన్ రాజ్, అదిరే అభి తదితరులు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉంటున్నారు. అయితే జబర్దస్త్ షోకు క్రేజ్, పాపులారిటీ ఉన్నప్పటికీ కంటెంట్ పరంగా కొన్ని విమర్శలున్నాయి. డబులు మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయని, ముఖ్యంగా కొన్ని స్కిట్స్ ఆడవాళ్లను కించ పరిచేలా ఉంటాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్, బిగ్ బాస్ విజేత బిందు మాధవి కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం ఓ టీవీ ఛానెల్ లో మాస్ జాతర అనే కామెడీ షోకు జడ్జిగా చేస్తోంది బింధు మాధవి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె టీవీ షోస్ గురించి మాట్లాడింది. డైరెక్టుగా జబర్దస్త్ పేరు చెప్పకపోయినా ఇన్ డైరెక్టుగా ఈ షో గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
‘మాస్ జాతర పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండిన షో. కానీ, మొదట నన్ను జడ్జిగా అడిగినప్పుడు వెంటనే అంగీకరించలేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా కామెడీ షోలలో డబుల్ మీనింగ్ డైలాగ్స్, వల్గర్ జోక్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటి కంటెంట్‌తో నేను కంఫర్ట్‌గా ఉండలేను అనిపించింది. అదే విషయం షో డైరెక్టర్ కు చెప్పాను. కానీ డైరెక్టర్ ప్రత్యేకంగా వచ్చి క్లారిటీ ఇవ్వడంతోనే నేను అంగీకరించాను. మా షోలో ఎలాంటి వల్గారిటీ ఉండదు. కుటుంబం మొత్తం కలిసి చూసేలా క్లీన్ కామెడీ అందిస్తాం. ఎక్కడైనా అసౌకర్యంగా అనిపిస్తే మీరు షో మధ్యలోనే వెళ్లిపోవచ్చు అని కూడా చెప్పారు. ఆ నమ్మకంతోనే ఈ షోలో భాగమయ్యాను’ అని చెప్పుకొచ్చింది బిందు మాధవి. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.