
తెలుగు చిత్రసీమలో తనదైన శైలితో, ప్రత్యేక మ్యానరిజమ్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు పృథ్వి రాజ్. ఎన్నో సినిమాల్లో కామెడీ వేషాలతో పాటు విలనిజం కూడా పండించారు పృథ్వి రాజ్. కాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభం నుంచి నేటి వరకు ఎదురైన కీలక సంఘటనలు, సవాళ్లు, అలాగే అద్భుతమైన మలుపులను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. 1989లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్.టి.ఆర్. క్యారెక్టర్‌ను తాను గండిపేట రహస్యం చిత్రంలో పోషించానని పృథ్వి రాజ్ గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రానికి కృష్ణ, విజయనిర్మల, ప్రభాకర్ రెడ్డి వంటి ప్రముఖులు దర్శకత్వం వహించగా, విజయనిర్మల, నరేష్ కూడా నటించారు. ఈ సినిమా విడుదలై నారాయణగూడ దీపక్ మహల్ థియేటర్ వద్ద, ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు, దివంగత నటుడు హరికృష్ణ (ఆనాడు తెలుగు యువత ప్రెసిడెంట్) నేతృత్వంలో నిరసనలు, డౌన్ డౌన్ నినాదాలు ఎదురయ్యాయని పృథ్వి వివరించారు.
ఇంటర్వెల్ సమయంలో లోపలికి వచ్చిన హరికృష్ణ, ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి “అంకుల్ మీరు ఇలా చేస్తారని అనుకోలేదు” అని అసంతృప్తి వ్యక్తం చేశారని, ఆ తర్వాత తాను, ప్రభాకర్ రెడ్డి అక్కడ నుండి బయలుదేరామని తెలిపారు. వారి కారుపై రాళ్లు విసరగా, డ్రైవర్ చాకచక్యంగా పద్మాలయ స్టూడియోకి చేరుకోవడంతో ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. ఈ సంఘటన తర్వాత, స్టూడియోలో ఉన్న ఇతర నటులపై దాడి జరిగిందని, తనను చంపేయాలని ప్రయత్నాలు జరిగాయని ఆనాటి భయంకరమైన అనుభవాన్ని పృథ్వి రాజ్ పంచుకున్నారు. ఈ వివాదం తర్వాత, ప్రభాకర్ రెడ్డి, కృష్ణ సలహా మేరకు పృథ్వి రాజ్ అబిడ్స్‌లోని ఎన్.టి.ఆర్. ఇంటికి వెళ్లారు. సున్నుండలు తీసుకెళ్లి, పెద్దాయన పాదాల వద్ద కూర్చున్నప్పుడు, చుట్టూ అప్పటి తెలుగుదేశం నాయకులు ఉన్నారని.. ఎన్.టి.ఆర్. తనను చూసి, “ఎందుకు ఇలాంటివి చేశారు?” అని అడిగినప్పుడు, పృథ్వి రాజ్ “తాడేపల్లిగూడెంలో మేం చూసిన హీరోయే మీరండి అని అన్నారట పృథ్వి రాజ్.
అలాగే ఎన్.టి.ఆర్. రామారావు గారు అంటే రాముడు” అంటూ కొన్ని డైలాగులు చెప్పారట. “దాన వీర శూర కర్ణ లో శకుని డైలాగ్ చెప్పండి” అని అడగగా, ఆయన అద్భుతంగా చెప్పి మెప్పించారట. దాంతో ఎన్టీఆర్ “అద్భుతం, ఇండస్ట్రీలో జాగ్రత్తగా ఉండండి” అని ఒక బొట్టు పెట్టి, “పృథ్విరాజ్ తమ్ముడికి” అని రాసి ఒక పుస్తకం ఇచ్చారని, అది తన జీవితాన్నే మార్చివేసిందని పృథ్వి తెలిపారు. అక్కడే తన తల్లి పంపిన సున్నుండలను, జీడిపప్పును పెద్దాయన ఆస్వాదించారని గుర్తు చేసుకున్నారు. తర్వాత తన కార్యకర్తలను మందలిస్తూ.. “వారి మీదకి ఎందుకు వెళ్తున్నారు? వారు నటుడు. వారు చేయకపోతే ఇంకెవరో చేస్తారు” అన్నారు. దాంతో తనకు మోక్షం ప్రసాదించారని పృథ్వి రాజ్ అన్నారు. ఎన్.టి.ఆర్.తో ఫోటో దిగే అవకాశం కూడా లభించిందని, ఆ ఫోటో తన జీవితంలోనే అతిపెద్ద గుర్తింపు అని పేర్కొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి