న్యాచురల్ స్టార్ నాని (Nani) ప్రధాన పాత్రలో డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న సినిమా అంటే సుందరానికీ. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ మలయాళ బ్యూటీ నజ్రీయా నజీమ్ హీరోయిన్గా నటిస్తోంది. తెలుగులో నజ్రీయా చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ మరింత అంచనాలు పెంచేశాయి. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్ , మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. అంటే సుందరానికీ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ముచ్చటించిన నాని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో ప్రయాణం ఎలా అనిపించింది అని అడగ్గా నాని మాట్లాడుతూ.. ” చాలా మంది రెండు, మూడు సినిమాలు చేసిన దర్శకులతో సినిమా ఎందుకని అడుగుతుంటారు. వివేక్ ఆత్రేయని కలసినప్పుడు, ఆయన కథ చెప్పినపుడు, పని చేస్తున్నపుడు ఆయన ఫ్యూచర్ టాప్ డైరెక్టర్ అనే నమ్మకం బలంగా కలుగుతుంది. ఆయన రైటింగ్ డైరెక్షన్ అంత బావుంటాయి. ప్రజంట్ లీడింగ్ దర్శకులు కంటే ఫ్యూచర్ లీడింగ్ దర్శకుల జర్నీలో భాగం కావడం ఒక ఆనందం. నేను చూసిన దర్శకుల్లో వివేక్ ఒక జెమ్. తనకంటూ ఒక ఒరిజినల్ స్టైల్ వుంది. ఇది తన ప్రతి సినిమాలో కనిపిస్తుంది. తన సినిమా కథని ఇంకెవరికి ఇచ్చినా తన లాగా తీయలేరు. వివేక్ లాంటి దర్శకుడితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే పాన్ ఇండియా మార్కెట్ పెరుగుతుంది కదా .. ఆ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ? అని అడగ్గా.. “నా ఉద్దేశంలో మన సినిమాని మనం పాన్ ఇండియా అనుకుంటే కాదు.. ప్రేక్షకులు అంటేనే పాన్ ఇండియా. కంటెంట్ బలంగా వుండాలి. పుష్ప సినిమా తీసుకుందాం.. సౌత్ అడవుల్లో జరిగిన కథ. నార్త్ తో ఆ కథకి సంబంధం లేదు. కానీ దేశం మొత్తం పుష్పని ఆదరించారు. పాన్ ఇండియా స్టేటస్ ఇచ్చారు. ముందు కంటెంట్ పై ద్రుష్టి పెట్టాలి తప్పితే మనకి మనమే పోస్టర్ పై పాన్ ఇండియా అని రాసుకోవడం సరికాదని నా ఉద్దేశం” అని అన్నారు..