Aadarsha Kutumbam Review: ‘ఆదర్శ కుటుంబం’ సినిమా రివ్యూ.. వెంకీ అండ్ ఫ్యామిలీ క్రైమ్ డ్రామా మెప్పించిందా..?
నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి క్లాసిక్స్ తర్వాత త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన ఆదర్శ కుటుంబం సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. మరి వాటిని సినిమా అందుకు ఉందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: ఆదర్శ కుటుంబం
నటీనటులు: వెంకటేష్, శ్రీనిధి శెట్టి, యువీనా, నారా రోహిత్, బ్రహ్మాజీ, రావు రమేష్, సచిన్ ఖేడ్ కర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: రవి కే చంద్రన్
సంగీతం: తమన్
ఎడిటర్: నవీన్ నూలీ
నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ
దర్శకుడు: త్రివిక్రమ్
కథ:
చిట్టిబాబు (వెంకటేష్), స్వర్ణ (శ్రీనిధి శెట్టి), సంపూర్ణ, శర్వా నలుగురిది చిన్న కుటుంబం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.. అప్పుల బాధలు, రోజువారి కష్టాలతో వాళ్ల జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్లకు వంద కోట్ల లాటరీ తగులుతుంది. అదే సమయంలో ఒక బిహారీ గ్యాంగ్ ధనవంతుల ఇళ్లలోకి పనికి చేరి వాళ్ళని చంపేసి డబ్బులు కాజేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కన్ను 100 కోట్ల లాటరి కొట్టిన చిట్టిబాబు కుటుంబం మీద పడుతుంది. అలా వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు పనికి చేరుతారు. ఆ తర్వాత ఏమైంది.. వాళ్ళని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ దాము (నారా రోహిత్) ప్రయత్నిస్తూ ఉంటాడు. వాళ్లకి కుటుంబం ఎలా సహాయపడింది అనేది మిగిలిన కథ..
కథనం:
మామూలుగా మనకు త్రివిక్రమ్ సినిమా అంటే ఇలాగే ఉంటుంది అని ఒక ఐడియా ఉంది. కానీ ఇలా కూడా ఉంటుంది అని దాన్ని మార్చడానికి చేసిన సినిమా ఆదర్శ కుటుంబం. గురూజీ సినిమాలో కామెడీ ఉండడం కామన్. దానికి క్రైమ్ కూడా యాడ్ చేశాడు ఈసారి. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే డీసెంట్ గా అనిపిస్తుంది AK 47. దృశ్యం సినిమాకు కామెడీ మిక్స్ చేస్తే వచ్చే ఔట్ పుట్ ఈ సినిమా.. ఫస్టాఫ్ అంతా త్రివిక్రమ్ స్టైల్ లో ఫన్నీగా సాగిపోతుంది. చాలావరకు త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ కనిపిస్తాయి. మధ్య మధ్యలో వచ్చే క్రైమ్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. వాటి డోస్ కూడా పెంచేశారు. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది.. అప్పటి వరకు ఉన్న కథ మొత్తం మారిపోయింది.
మొదటి సగంతో పోలిస్తే సెకండాఫ్ మాత్రం నెమ్మదిగా సాగుతుంది.. కథ అక్కడక్కడే ఉంది కాబట్టి స్క్రీన్ ప్లే మీద ఎక్కువగా ఫోకస్ చేశాడు మాటల మాంత్రికుడు. అక్కడక్కడ దృశ్యం సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది.. స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నాడు మాటల మాంత్రికుడు. క్లైమాక్స్ చివరి 15 నిమిషాలు ఆసక్తికరంగా ఉంది.. యాక్షన్ బ్లాక్స్ ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. క్రైమ్ ఎపిసోడ్స్ తీయాలి అనుకున్నప్పుడు కాస్త గట్టిగానే తీశాడు గురూజీ. ఫ్యామిలీ ఎమోషన్స్ సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ బాగా రాసుకున్నాడు. ఓవరాల్ గా ఒక కంప్లీట్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలి అనుకునే వాళ్లకు ఆదర్శ కుటుంబం బెస్ట్ ఆప్షన్.
నటీనటులు:
వెంకటేష్ మరోసారి ఫ్యామిలీ ప్లస్ యాక్షన్ రోల్ లో అదరగొట్టాడు. తనకు తగిన రోల్ పడితే ఎలా ఉంటుందో చూపించారు విక్టరీ హీరో. శ్రీనిధి శెట్టి మోస్ట్ సర్ప్రైజింగ్ క్యారెక్టర్ చేసింది.. ఇద్దరు చిన్నపిల్లల యాక్టింగ్ కూడా బాగుంది.. సత్య కామెడీ ఈ సినిమాకు మేజర్ రిలీఫ్. నారా రోహిత్ క్యారెక్టర్ కూడా బాగుంది. మిగిలిన వాళ్ళందరూ ఓకే..
టెక్నికల్ టీం:
తమన్ మ్యూజిక్ ఎక్కడో విన్నట్టు ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. హిందీ సాంగ్స్ కూడా సినిమా మూడ్ సెట్ చేశాయి. రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. త్రివిక్రమ్ చాలా రోజుల తర్వాత డైలాగ్స్ అదరగొట్టారు. యాక్షన్ పార్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
పంచ్ లైన్:
ఓవరాల్ గా ఆదర్శ కుటుంబం.. మంచి కమర్షియల్ కుటుంబం..!
