The Kerala Story: కేరళను కుదిపేస్తోన్న ‘ది కేరళ స్టోరీ’.. ఆదా శర్మ మూవీ టీజర్‌పై విచారణకు ఆదేశించిన సీఎం..

|

Nov 10, 2022 | 6:04 AM

ది కేరళ స్టోరీ' సినిమాపై వివాదం మరింత ముదురుతోంది. అదా శర్మ సినిమా టీజర్‌ విడుదలైనప్పటి నుంచి సినిమాపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. 'ది కేరళ స్టోరీ' ద్వారా కేరళ పరువు తీసేందుకు మూవీ మేకర్స్ ప్రయత్నిస్తున్నారని అధికార, విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

The Kerala Story: కేరళను కుదిపేస్తోన్న ‘ది కేరళ స్టోరీ’.. ఆదా శర్మ మూవీ టీజర్‌పై విచారణకు ఆదేశించిన సీఎం..
The Kerala Story
Follow us on

ది కేరళ స్టోరీ.. ఇప్పుడీ మూవీ పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో ఆదాశర్మ చెప్పిన డైలాగ్‌ కాంట్రవర్సీకి దారితీసింది. కేరళ మత మార్పిడులకు అడ్డాగా మారిందని.. 32 వేల మంది మహిళలను మతం మార్చి.. ఆపై సిరియాకు పంపి ఐసిస్‌లో చేర్చినట్టుగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. అదా శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న ది కేరళ స్టోరీ సినిమా టీజర్‌ నవంబర్ 3న విడుదల కాగా.. అప్పటి నుంచి దీనిపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. టీజర్‌లో అదా శర్మ బురఖాలో కనిపించింది.. ”నా పేరు షాలిని ఉన్నికృష్ణన్.. నర్సుగా ప్రజలకు సేవ చేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఫాతిమా బీ అనే ఐసిస్ ఉగ్రవాదిని. నాలాంటి 32 వేల మంది అమ్మాయిలను మతం మార్చి.. ఐసిస్‌లో చేర్చి సిరియా, యెమెన్ ఎడారులకు పంపారు. ప్రస్తుతం ఆఫ్ఘానిస్తాన్‌ జైల్లో ఉన్నాను.. అంటూ సాగుతుంది.” ఓ సాధారణ అమ్మాయి ప్రమాదకరమైన ఉగ్రవాదిగా మారే భయంకరమైన గేమ్ కేరళలో చోటుచేసుకుంది. ఇది నా కథ. ఆ 32 వేల మంది అమ్మాయిల కథ అంటూ ఆదాశర్మ చెప్పిన డైలాగ్‍ కేరళలో వివాదానికి కారణమైంది.

‘ది కేరళ స్టోరీ’ టీజర్ బయటకు వచ్చిన వెంటనే, ఈ చిత్రం ద్వారా కేరళ పరువు తీసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారంటూ అధికార, విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే రిలీజైన టీజర్‌పై అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసుకుంటున్నారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ ముఖ్యమంత్రి విజయన్‌కు ఫిర్యాదులు సైతం అందాయి. దీంతో సీఎం సినిమా టీజర్‌ పై కేసు నమోదు చేసి విచారణ చేయాలని పోలీసులకు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి సరైన విచారణ చేపట్టాలని డీజీపీ అనిల్‌కాంత్‌ తిరువనంతపురం పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించారు. దీనిపై హైటెక్ క్రైమ్ ఎంక్వయిరీ సెల్ ప్రాథమిక విచారణ జరిపి తన నివేదికను డీజీపీకి పంపినట్లు తెలుస్తోంది.

సుదీప్తో సేన్ ది కేరళ స్టోరీ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు. ఈ చిత్రంలో అదా శర్మ ప్రధాన పాత్రలో కనిపించనుంది. అయితే, ఇన్వెస్టిగేషన్‌ రిపోర్ట్‌ ఆధారంగానే ఈ సినిమా ఉంటుందని మూవీ డైరెక్టర్‌ సుదీప్తోసేన్‌ వెల్లడించారు. కానీ ఈ సినిమా వివిధ వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉందని, దేశ సమైక్యత, సమగ్రతలకు భంగం కలిగించేదిలా ఉందంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేరళను కించపరిచేలా ఉన్న ఈ సినిమాను బ్యాన్‌ చేయాలని అధికార, ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..