ప్రముఖ బుల్లితెర నటి, యాంకర్ సమీరా గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆడపిల్ల అనే సీరియల్‌తో బాగా క్రేజ్ తెచ్చుకుందీ అందాల తార. ఆ తర్వాత అభిషేకం, ముద్దు బిడ్డ, భార్యామణి, మూడు ముళ్ల బంధం.. ఇలా పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి మెప్పించింది. అదిరింది వంటి టీవీ ప్రోగ్సామ్స్ లకు యాంకర్ గా కూడా వ్యవహరించింది. అయితే గత కొద్ది కాలంగా బుల్లితెరకు దూరంగా ఉంటోందీ అందాల తార. 2019లో అన్వర్ జాన్ అనే వ్యక్తిని చేసుకుంది సమీరా. వీరికి 2021లో అర్హాన్ అనే బాబు పుట్టాడు. అయితే 2023 నవంబర్‌లో మళ్లీ గర్భం ధరించిందీ అందాల తార. దీంతో మళ్లీ అమ్మ కానున్నాంటూ తెగ సంబరపడిపోయింది. కానీ ఈ ఆనందం మధ్యలోనే ఆవిరైపోయింది. తనకు అబార్షన్ అయినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది సమీరా. దీంతో బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సమీరాకు ధైర్యం చెబుతున్నారు.
‘2023 నవంబర్‌లో నేను మళ్లీ గర్భం ధరించాను. దీంతో ఇంట్లో అందరూ సంతోషంలో మునిగిపోయారు. అర్హాన్ (కుమారుడు) అయితే నా కడుపులో బిడ్డతో మాట్లాడేవాడు. రెగ్యులర్ టెస్టుల్లో భాగగా రెండుసార్లు స్కానింగ్‌కు వెళ్లినప్పుడు బేబీ బాగానే ఉందన్నారు. పన్నెండోవారంలో మరోసారి స్కానింగ్‌కు వెళ్లాను. అయితే ఎనిమిదో వారంలోనే బిడ్డ ఎదుగుదల ఆగిపోయిందన్నారు డాక్టర్లు. తన గుండె కొట్టుకోవడం లేదన్నారు. అంటే ప్రాణం లేని బిడ్డను నాలుగువారాల పాటు కడుపులో మోశానన్నమాట. తను నన్ను వదిలి వెళ్లాలనుకోవడం లేదు. నా కలలన్నీ కుప్పకూలిపోయినట్లనిపించింది. ఎంతగానో ఏడ్చాం. ఆ తర్వాత కొన్ని రోజులకు టాబ్లెట్స్ ద్వారా గర్భంలోని శిశువును తీసేశాం’ అని ఎమోషనల్ అయ్యింది సమీరా.
కాగా సమీరాకు గర్భ స్రావం అవ్వడం ఇది మొదటి సారి కాదు. 2020లో మొదటి సారి గర్భం ధరించినప్పుడు కూడా ఇలాగే అబార్షన్ అయ్యింది. ఈ విషయాన్ని ఆమెనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. సమీరా తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పలువురు బుల్లితెర నటీనటులు, అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి