గత కొన్నేళ్లుగా వరుస ప్లాఫ్‌లతో సతమతవుతోన్న రజనీకాంత్ జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ రీ కొట్టేశారు. తమిళ్‌తో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ యాక్షన్ డ్రామా ఓవరాల్‌గా రూ. 650 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ కోవలో తమిళ సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టేశారు తలైవా. నెల్సన్ దీలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్ సినిమాలో రజనీతో పాటు కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 10 న థియేటర్లలో రిలీజైన జైలర్ బాక్సాఫీస్ రికార్డులన్నీ కొల్లగొట్టింది. ముఖ్యంగా రజనీకి గ్రేట్ కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. థియేటర్ల తర్వాత ఓటీటీలోనూ తలైవా సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చిన జైలర్ సినిమా విదేశీ భాషల్లోనూ మంచి వ్యూస్ సొంతం చేసుకుంది. ఇలా థియటేర్లు, ఓటీటీలో సూపర్ హిట్‌గా నిలిచిన జైలర్ సినిమా ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. రజనీ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ జెమిని సొంతం చేసుకుంది. త్వరలో ఈ బ్లాక్ బస్టర్ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది.
నవంబర్ రెండో వారం లేదా దీపావళి పండగ సందర్భంగా జైలర్ సినిమాను ప్రసారం చేయవచ్చని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన రానుందని సమాచారం. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన జైలర్ సినిమాకు అనిరుధ్ రవి చందర్ స్వరాలు సమకూర్చారు. సినిమా విజయంలో అనిరుధ్ బీజీఎమ్ కూడా కీలక పాత్ర పోషించింది. కాగా జైలర్ సినిమా విజయాన్ని పురస్కరించుకుని నిర్మాత కళానిధి మారన్ రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కు లగ్జరీ కార్లు బహుమతిగా ఇచ్చారు. అలాగే సినిమా యూనిట్‌కు కూడా వివిధ కానుకలను ఇచ్చారు. మరి థియేటర్లలో, ఓటీటీలో హిట్ బొమ్మగా నిలిచిన జైలర్ టీవీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.