
ఈ రోజు బ్రహమ్ముడి ఎపిసోడ్ లో స్వప్నకి బాగా గడ్డి పెడుతుంది కనకం. దీంతో దెబ్బకి సైలెంట్ అవుతుంది స్వప్న. నీ పుట్టుక ఏంటో, నీ స్థాయి ఏంటో నువ్వు చేసిన నీతి మాలిన పని ఏంటో.. ఇక్కడికి ఎలా వచ్చావో.. అవన్నీ మర్చిపోయావా.. అని అడుగుతంది. ఇక్కడ ఆది దంపతుల్లాగా నిలబడిన వాళ్లు నీకు మామూలు వాళ్లలా కనిపిస్తున్నారా? ఇంతమంది కొడుకులు, కోడళ్లు, మనవళ్లు రావడానికి మూలం వాళ్లే.. వాళ్ల ముందు నిలబడి నువ్వు చేసిన ఘనకార్యం సమర్థించుకుంటున్నావా.. ఇంకొక్క మాట మాట్లాడినా.. నరికిపారేస్తాను అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.
అమ్మా అది ఇలా మాట్లాడుతుందంటే, ఇలా ప్రవర్తిస్తుందంటే దానికి కారణం నేను, నా పెంపకం వల్లేనే అంటూ బాధపడుతుంది. ముగ్గురు ఆడపిల్లలు పుడితే దీన్నే ఎక్కువ గారాబం చేశాను. అందుకే ఇది ఇలా తయారైంది.. ఈ కావ్య కూడా నా కడుపునే పుట్టింది.. మమ్మల్ని ఇంతకాలం కడుపులో పెట్టుకొని కాపాడుకుంది.. ఇంటి పరువు నిలబెట్టింది.. కానీ మా స్వప్న మాట్లాడిన మాటలు వింటే కన్నతల్లిని నాకే రగిలిపోతుంది.. మీది పెద్ద మనసు కాబట్టే ఇంకా మాట్లాడుతున్నారని కనకం అంటుంది. అయ్యో అలా అనకు అమ్మా.. ఒకరు చేసిన తప్పుకి ఇంకొకరు ఎప్పుడూ కారణం కారు.. అలానే ఇంట్లో వాళ్లు తప్పు చేస్తే ఈ ఇల్లు మందలిస్తుంది.. అంతేకానీ ఒకరిని బయటికి పంపించేలా ఎప్పుడూ ప్రవర్తించదు అని చెబుతుంది.
సరే నేను వెళ్లి వస్తాను అంటూ.. కనకం, కృష్ణమూర్తి అంటే.. ఈ లోపు సుభాష్ మాట్లాడుతూ.. అదేంటి ఏదో పని మీద వచ్చినట్లున్నారు.. అది మాట్లాడకుండా వెళ్లిపోతున్నారని అంటాడు. ఏంటి కనకం.. ఏదైనా పని మీద వచ్చారా అని ఇందిరాదేవి అడుగుతుంది. అవునండీ.. మేము ఏదో చేయాలని సంప్రదాయం ప్రకారం వచ్చాం.. కానీ ఇక్కడ ఆ అర్హత పోగొట్టుకొని వెళ్లిపోతున్నాం అని బాధపడుతుంది కనకం. సూడిదలు తెచ్చారా.. మరి పెట్టకుండానే ఎలా వెళ్తారు .. అని ఇందిరాదేవి అడుగుతుంది. దీనికా దేవతలనే లెక్కచేయని ఆడది.. తల్లిదండ్రుల్ని ఏం లెక్క చేస్తుంది.. సభ్యతే తెలీని మనిషి.. సంప్రదాయాన్ని ఏం లెక్క చేస్తుంది.. అంటుంది కనకం.
అలా కాదు నీ కూతురికి నువ్వే ఒడి నింపాలి అని ఇందిరాదేవి అంటుంది. లేని కడుపుకోసం ఇంత ఆర్భాటం చేయాలా అని మనసులో అనుకుంటుంది స్వప్న. ఆ తర్వాత స్వప్నకి చీర, సారె పెట్టి, బొట్టు పెట్టి అందరూ అంక్షితలు వేసి ఆశీర్వదిస్తారు. ఇక స్వప్నకి కృష్ణమూర్తి కూడా క్లాసు పీకుతాడు. సరేనని అందరికీ నమస్కారం పెట్టి వాళ్లు వెళ్లిపోతారు. ఇక ప్లాన్ ఫెయిల్ అయిందని రుద్రాణి-రాహుల్ బాధపడతారు. అసలు మనం అనుకున్నది ఏంటి? ఇక్కడ జరిగింది ఏంటి? అని రగిలిపోతూంటారు. దానికి బిడ్డ పుడితే మాత్రం మనం ఏం చేయలేం.. అందుకే ఆ లోపే మనం ఏమన్నా చేసి.. ఇంట్లో నుంచి గెంటేయాలి అంటూ అంటుంది రుద్రాణి.
కట్ చేస్తే.. అక్కడ జరిగిందంతా పెద్దావిడకి చెబుతూ కనకం బాధ పడుతుంది. స్వప్నని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటుంది. ఈ మాటలు విని అప్పు ఫైర్ అవుతుంది. అసలు అది అంత దిక్కుమాలిన పని చేస్తే చెంప పగలకొట్టి రాకుండా ఇక్కడికొచ్చి కూని రాగాలు తీస్తావేంటే.. నేనే కనుక అక్కడ ఉండి ఉండే దాన్ని వాయించేసేదాన్ని.. అంటూ మండిపడుతుంది. ఇలా జరుగుతుండగా.. కనకం మాట్లాడుతూ.. దాని సంగతి పక్కన పెట్టి ముందు నీ సంగతి చూసుకో.. నువ్వు ఇక నుంచి ఇలాంటి బట్టలు వేసుకోవడానికి వీల్లేదు అంటుంది కనకం. అంటే నీ లెక్క చీర, జాకెట్ వేసుకోమంటావా ఏంటి? అని అప్పు అడుగుతుంది. రేపు పెళ్లయితే ఏం వేసుకుంటావ్.. అని కనకం అడుగుతుంది. అప్పుడు కూడా ఇవే వేసుకుంటాను.. శోభనం గదికి కూడా ఇలానే పోతాను.. అంటుంది అప్పు. ఈ లోపు కృష్ణమూర్తి రియాక్ట్ అవుతూ.. నీ పెద్ద కూతురుపై ఉన్న కోపం దీని మీద చూపిస్తావేంటే.. అది ఎప్పటికీ దానిలానే ఉంటుంది. దాన్ని అలానే ఇష్టపడే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను.. అంటూ కృష్ణమూర్తి అంటాడు.
ఆ తర్వాత ఇంట్లో జరిగిన దాని తలుచుకుంటూ ఇందిరాదేవి-సీతారామయ్య బాధపడతారు. ఇలా అయితే ఎలా బావా.. స్వప్నకి మనం చెప్పేది ఎందుకు అర్థం కావడం లేదు అంటూ ఇందిరాదేవి అంటుంది. లేదు చిట్టి అర్థమయ్యేలా చెబితే అందరికీ అర్థమవుతుంది అంటాడు సీతారామయ్య. పెద్దవాళ్లుగా మనం చెప్పే మాటలు పట్టించుకోకుండా వాళ్ల జీవితాల్ని పిల్లలు ఎక్కడ నాశనం చేసుకుంటారో.. అంటూ ఇందిరాదేవి బాధపడుతుంది. ఇదంతా మేడపై నుంచి రాజ్-కావ్య చూస్తారు. మా అక్క చేసిన పని వల్ల ఇంట్లో అందరూ ఫీలవుతున్నారు.. నిజంగా సారీ.. అంటుంది కావ్య. నువ్వ సారీ చెప్పినంత మాత్రాన జరిగిందంతా మార్చలేం కదా.. ఇక్కడ నాకు నచ్చని విషయం ఏంటంటే ఇంత మంది బాధపడుతున్నా.. మీ అక్క మాత్రం తాను చేసింది తప్పు కాదని ఫీలవుతుంది చూడు నాకు అది అస్సలు నచ్చడం లేదు అని రాజ్ వెళ్లిపోతాడు.
నెక్ట్స్ స్వప్నతో మాట్లాడానికి వెళ్తుంది కావ్య. స్వప్నకు అర్థమయ్యేలా చెబుతుంది. నీ వల్ల ఇంట్లోని వారంతా బాధపడుతున్నారు. పద్దతిమార్చుకోమని హెచ్చరిస్తుంది. నువ్వేమీ నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు.. అంటుంది స్వప్న. ఇవి నీతులు కాదు నిజాలు.. నువ్వు ఇలానే ఉంటే రోడ్డున పడే పరిస్థితి వస్తుంది.. నువ్వు తప్పులు చేసినా కూడా నీకొక మంచి జీవితం వచ్చింది.. కానీ నువ్వు అది నిలబెట్టుకునేలా లేవు.. నిన్ను నీ ప్రవర్తనను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. నువ్వు కడుపుతో ఉన్నావని అందరూ అనుకుంటున్నారు. అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. అక్కా ఇక నుంచైనా బుద్ధిగా ఉండు అంటుంది కావ్య. అయినా పట్టించుకోని స్వప్న నిన్ను ఎప్పుడూ రాజ్ భార్యగా సొసైటీ గుర్తించలేదు. ఇప్పుడు నన్ను ప్రపంచమంతా గుర్తించేసరికి నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావ్ అంటుంది స్పప్న. అది నా పర్సనల్ విషయం.. నువ్వు కామెంట్ చేసేంత దిక్కుమాలిన పరిస్థితిలో ఏం లేదు నా కాపురం.. అంటుంది కావ్య. మీడియాలో నా యాడ్ వైరల్ అవుతుంది.. దాన్ని ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగుతుంది స్వప్న. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.
ఇక రేపటి ఎపిసోడ్ లో యాడ్ డిలీట్ చేయమని యాడ్స్ కంపెనీ వారికి రూ.30 లక్షలు ఇచ్చాను అంటూ రాజ్ చెబుతుండగా.. పైనుంచి కిందికి వస్తున్న స్వప్న అది వింటుంది. ఏం చేశావ్ రాజ్? నువ్వెవరు? అంటూ రాజ్ పై చిందులుతొక్కుంది. దీంతో మళ్లీ రచ్చ స్టార్ట్ అవుతుంది.