AP Minister-Tollywood Celebrities:ఏపీ ప్రభుత్వ ప్రతినిధులతో సినీ ప్రముఖులు నేడు భేటీ కానున్నారు. ఈ భేటీలో సినీ సమస్యలపై చిరంజీవి, నాగార్జున నేతృత్వంలోని బృందం చర్చించనున్నారు. వాస్తవానికి ఈ భేటీ కిందటి నెలలోనే జరగాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. దీంతో తాజాగా ఈరోజు 20-09-2021 కలవాలని సినీ ప్రముఖులకు సమాచార మంత్రి పేర్ని నానికి వర్తమానం పంపారు. అయితే సమావేశం సీఎం జగన్ తో కాకుండా మంత్రి పేర్ని నానితోనే ఏర్పాటు చేయడం విశేషం.
మంత్రికి సమస్యల చిట్టాను వినిపించనున్న బృందం:
కరోనా సమయం నుంచి థియేటర్ టికెట్ల ధరలు, బెనిఫిట్ షోలు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ రంగం ఇలా సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురానున్నారు సినీ ప్రముఖులు. అంతేకాదు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై చిరంజీవి బృందం కొన్ని సూచనలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మీటింగులో నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, దిల్ రాజుతోపాటు మరికొంత మంది సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఎక్కువగా సినిమా థియేటర్లు సరిగ్గా నడవడం లేదు… దీంతో ఎగ్జిబిటర్లు నష్టాల్లో కూరుకుపోయారు. అదే సమయంలో ప్రభుత్వం టిక్కెట్ రేట్లను తగ్గించడంతో థియేటర్లకు వచ్చే ఆదాయం సగానికి సగం పడిపోతోందని ఇది.. ప్రధానమైన సమస్యగా మారింది.. ఇదే అంశాన్ని మంత్రికి సినీ ప్రముఖులు వివరించనున్నారు. అంతేకాదు ఈ సందర్భంగా లాక్‌డౌన్ వల్ల సినీ, థియేటర్ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను ప్రభుత్వానికి వివరించనున్నారు. అలాగే బీ, సీ సెంటర్లలో టికెట్ ధరలు, విద్యుత్ టారిఫ్‌ల గురించి కూడా చర్చించనున్నారు. ఇటీవల ఏపీలో జారీ జీవో, చిన్న నిర్మాతల సమస్యలు గురించి ఈ భేటీలో మాట్లాడనున్నారు. గ్రామ పంచాయితీ, నగర పంచాయితీ, కార్పొరేషన్ ఏరియాల్లోని థియేటర్ల టిక్కెట్టు ధరలు, చిన్న సినిమాల మనుగడ కోసం 5 షోలకు అనుమతివ్వాలని ప్రభుతాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. విశాఖలో సినీ పరిశ్రమ విస్తరణ తదితర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.
సినిమా టిక్కెట్ల అమ్మకం వ్యవహారం…
ఇక ఈ సమావేశంలో సినిమా టిక్కెట్లను ప్రభుత్వమే అమ్ముతుందని ఇటీవల చేసిన ప్రకటనపై చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మే అంశంపై అభిప్రాయాలు, సలహాలు తీసుకోనున్నది. ఆన్‌లైన్ టికెట్ల అమ్మకం సొమ్మును రియల్ టైమ్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తామని స్పష్టం చేయనుంది ప్రభుత్వం. ఏపీ ఎప్డీసీ ద్వారా ఆన్ లైన్ టికెటింగ్ పోర్టల్‌ను నిర్వహించనున్నట్లు సినిమా నిర్మాతలకు ప్రభుత్వం వివరించనుంది. ఇప్పటికే నిర్మాతలు, సినీ ప్రముఖులు థియేటర్ యాజమాన్యాలతో సంప్రదింపులు జరపనుంది ప్రభుత్వం. ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో టిక్కెట్ల విక్రయం చేపట్టనుంది సర్కార్. దీనికి సంబంధించిన బ్లూప్రింట్, అమలు వ్యవహరాన్ని పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్ గా ఉంటారు
థియేటర్లు వర్సెస్ ప్రభుత్వం…
ఇసుక కూడా అమ్మలేక ప్రైవేటుకి కాంట్రాక్టు ఇచ్చేసిన ప్రభుత్వం సినిమా టిక్కెట్లు అమ్ముతుందా? అని విమర్శలు తలెత్తున్న నేపథ్యంలో మంత్రి పేర్ని నాని స్పందించారు. పారదర్శకత కోసమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. థియేటర్ల, ఎగ్జిబిటర్ల అక్రమాలకు కళ్లెం వేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. థియేటర్ల మెయింటెనెన్స్ కు నెలకు సుమారు మూడు, నాలుగు లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఆదాయం మాత్రం యాభై వేలే చూపిస్తున్నారని థియేటర్ల యజమానులపై ఆరోపణ తలెత్తుతున్నాయి. అంతేకాదు సినిమాలను బయ్యర్లకు అమ్మినప్పుడు వచ్చే మొత్తం తప్పితే, సినిమా ఎంత విజయాన్ని సాధించినా, ఎగ్జిబిటర్స్ నుండి రూపాయి కూడా వెనక్కి రావడం లేదన్నది నిర్మాతల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వంపై ఆరోపణలు:
ఎ.పి. ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ అమ్మకాల వార్త రాగానే విమర్శల పర్వం మొదలైంది. టిక్కెట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెట్టుబడిగా చూపించి.. ప్రభుత్వం అప్పులు చేయబోతోందనే కొన్ని మీడియాలో ఆరోపణలు వినిపించాయి. అంతేకాదు టిక్కెట్ అమ్మకాల ద్వారా వచ్చే మొత్తాన్ని ప్రభుత్వం వాడేసుకుంటుందని.. ఎగ్జిబిటర్స్ కు వెంటనే ఇవ్వదని, దానికి కోసం వాళ్ళు ప్రైవేట్ కాంట్రాక్టర్ల మాదిరి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్లాల్సి ఉంటుందని మరో వాదన కూడా తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయమై పేర్ని నాని స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఆన్ లైన్ ద్వారా జరిగిన అమ్మకాల మొత్తంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పన్నులను, ఎగ్జిబిటర్స్ కు చెందాల్సిన మొత్తాన్ని వారి వారి ఖాతాలో మర్నాడు ఉదయమే జమ చేసే విధానాన్ని అవలంబిస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇదే విషయంపై ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ.. అసలు సినిమా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విక్రయించేలా చూడాలని చిరంజీవి, నాగార్జునే కోరినట్లు చెప్పారు.
గతేడాది జూన్‌లో ఒకసారి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు జగన్‌తో భేటీ అయ్యారు. నాడు సీఎంను కలిసినవారిలో చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సురేశ్‌బాబు, సి.కల్యాణ్, దిల్ రాజు
మరి సీఎం జగన్ తో ఈసారి జరిపే చర్చల్లో ఎలాంటి సమస్యలు పరిష్కారమౌతాయో చూడాలి మరి. కరోనా కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఇండస్ట్రీని రెండు ప్రభుత్వాలు ఆదుకోవాలని మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు.
Also Read: Python Hulchul: తెలంగాణాలో అడవులను వదిలి జనావాస బాట పట్టిన కొండచిలువలు.. భయబ్రాంతుల్లో ప్రజలు