
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ ప్రపంచ రికార్డును సృష్టించారు. అతడు నటించిన చివరి చిత్రం ‘దిల్ బేచారా’ ట్రైలర్ ఇటీవల విడులైన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకోగా.. 71 మిలియన్ వ్యూస్, 10 మిలియన్ల లైక్‌లు వచ్చాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే మోస్ట్ లైక్డ్ ట్రైలర్‌లలో సుశాంత్ మూవీ దిల్ బేచారా ఒకటిగా నిలిచింది.
కాగా ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ అనే నవల ఆధారంగా దిల్ బేచారా తెరకెక్కింది. రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రంలో సుశాంత్ సరసన సంజనా సంఘి నటించగా.. సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ముఖేష్ చబ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించింది. ఇక ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ నెల 24న ఈ చిత్రం హాట్ స్టార్‌లో విడుదల కానుంది. సుశాంత్ ఙ్ఞాపకార్థం అందరికీ ఈ సినిమాను ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తోంది హాట్ స్టార్+డిస్నీ సంస్థ.