‘స్పైడర్ మ్యాన్’.. హాలీవుడ్‌లో తెరకెక్కే ఈ సూపర్ హీరో సినిమాలకు ఇండియాలోనూ పెద్ద ఎత్తున అభిమానులున్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచాయి. కాగా ఈ యాక్షన్ అడ్వెంచెరస్ సిరీస్‌లో వస్తోన్న మరో కొత్త చిత్రం ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’. టామ్ హోలండ్ టైటిల్ రోల్ నటించిన ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. అయితే అంతకంటే ఒక్కరోజు ముందే ఇండియాలో అంటే డిసెంబర్ 16న రిలీజ్ అవ్వనుంది. కాగా ఈ సూపర్ హీరో సినిమా కోసం కొన్ని థియేటర్ల యాజమాన్యాలు అప్పుడే ముందస్తు బుకింగ్‌ను ఓపెన్ చేశాయి. అయితే గతంలో ఎన్నడూ లేనట్లు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించిన మొదటి రోజే టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
సాధారణంగా లోకల్ స్టార్ సినిమాలకే ఇలా అడ్వాన్స్ బుకింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. కానీ ఓ హాలీవుడ్ సినిమాకు కూడా ఇలా జరగడం మొదటిసారని థియేటర్ యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో వీకెండ్‌షోలకు సంబంధించి శుక్రవారం సాయంత్రం అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అయితే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు పెట్టిన వెంటనే మొత్తం 26 షోలకు సంబంధించిన 8,500 టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయట. వీటి ద్వారా దాదాపు రూ. 26 లక్షల ఆదాయం వచ్చిందని తెలుస్తోంది. ఇక కేరళలోని ఏరిస్‌ప్లెక్స్ థియేటర్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం 5 గంటలకు ప్రదర్శించే స్పెషల్ షో టిక్కట్లన్నీ గంటల వ్యవధిలోనే సేల్ అయ్యాయట. అక్కడే ఉన్న అక్కడే మరో థియేటర్‌లో కూడా అన్ని టిక్కెట్లు అమ్ముడుపోయి దాదాపు రూ.17 లక్షలు వసూలయ్యాయట. ఈ నేపథ్యంలో ‘స్పైడర్ మ్యాన్’ ఫ్యాన్స్ కోసం మరిన్ని స్పెషల్ షోలు వేసేందుకు థియేటర్ యాజమాన్యాలు రెడీ అవుతున్నాయని సమాచారం. కాగా జాన్ వాట్స్ తెరకెక్కించిన ఈ చిత్రంలో జెండయ, జాకబ్ బటలన్, బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, జాన్ ఫెవర్యూ, మరిస టొమి తదితరులు కీలక పాత్రలను పోషించారు. ప్రముఖ సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను ఇంగ్లిష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయనుంది.
Also Read: