‘ఆనంద్’, ‘హ్యాపీ డేస్’, ‘గోదావరి’ లాంటి మంచి అభిరుచి కలిగిన సినిమాలతో పాపులరైన దర్శకుడు శేఖర్ కమ్ముల. 2017లో ‘ఫిదా’ సినిమాతో మంచి హిట్ ఇచ్చిన శేఖర్ కమ్ముల.. ప్రస్తుతం ఓ డాన్స్ ఓరియెంటెడ్ సినిమాపై వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు కూడా కొన్ని కారణాల వల్ల గ్యాప్ వచ్చిందట. ఇక ఈ గ్యాప్‌లో మరో సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. అదీ కూడా ఓ క్రేజీ కాంబినేషన్ అని వినికిడి.
తాజా సమాచారం ప్రకారం అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ సినిమా తెరకెక్కించనున్నాడని సమాచారం. ఇకపోతే ప్రస్తుతం నాగచైతన్య చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి ‘వెంకీ మామ’ సెట్స్ మీద ఉండగా.. మరొకటి ‘బంగార్రాజు’ కాగా.. మేర్లపాక గాంధీ చిత్రం.. దిల్ రాజు బ్యానర్‌లో మరో సినిమా కూడా లైన్‌లో ఉన్నాయి. ఇక ఈ సినిమాలు మధ్యలో శేఖర్ కమ్ముల చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో వేచి చూడాలి.
ఏది ఏమైనా నాగచైతన్య – సాయి పల్లవి కాంబినేషన్ అంటేనే కొంచెం కొత్తగా ఉంది. అందులోనూ దర్శకుడు శేఖర్ కమ్ముల అయ్యేసరికి ఈ ప్రాజెక్ట్‌ను క్రేజీగా మారుస్తుంది. ఇకపోతే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారని సమాచారం.