Satyajit Ray: భారతీయ సినిమాలో కొత్త ఒరవడి సృష్టించిన ప్రజ్ఞాశాలి సత్యజిత్‌రాయ్‌

దర్శకత్వంలోనే కాదు, కళా దర్శకత్వం, కథా రచన, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌, కెమెరా, సంగీతం ఇలా సినిమాకు సంబంధించిన ప్రతీ శాఖలోనూ సత్యజిత్‌ రాయ్‌ గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

Satyajit Ray: భారతీయ సినిమాలో కొత్త ఒరవడి సృష్టించిన ప్రజ్ఞాశాలి సత్యజిత్‌రాయ్‌
Satyajit Ray
Follow us
Balaraju Goud

|

Updated on: May 02, 2022 | 1:42 PM

Satyajit Ray Birth Anniversary: ప్రపంచంలోని సినీ దర్శకులలో అగ్రగణ్యుడైన సత్యజిత్‌రాయ్‌ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ పదం కూడా ఆయనకు సరిపోదు. ఎందుకంటే ఆయన అంతకు మించి! కేవలం దర్శకత్వంలోనే కాదు, కళా దర్శకత్వం, కథా రచన, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌, కెమెరా, సంగీతం ఇలా సినిమాకు సంబంధించిన ప్రతీ శాఖలోనూ సత్యజిత్‌ రాయ్‌ గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అన్నట్టు చిత్రకళలోనూ, సాహిత్యంలోనూ ఆయన అత్యంత ప్రతిభావంతుడు. ఇన్నేసి రంగాలలో నైపుణ్యాన్ని కనబర్చడం ఒక్క సత్యజిత్‌రాయ్‌కే సాధ్యమయ్యింది.

సత్యజిత్‌రాయ్‌ గొప్పోడేమీ కాదు, దేశంలో ఉన్న దరిద్రాన్నంతా సినిమాల్లో చూపించి అవార్డులు కొట్టేశారంతే! అని కొందరంటారు.. అది వారి మేధా దారిద్య్రానికి చిహ్నమని అంటారు ఆనాటి ప్రముఖ సంపాదకులు నండూరి రామ్మోహన్‌రావు. ఆ మాటకొస్తే తాను గొప్ప గొప్ప కళాఖండాలు తీశానని, తీస్తున్నానని ఏనాడూ సత్యజిత్‌రాయ్‌ అనుకోలేదు. ప్రతి ఒక్కరు తన చిత్రాలు చూడాలన్నదే ఆయన అభిమతం. చాలా మంది దర్శకులకు ఆయనే ఇన్‌స్పిరేషన్‌! మనుషుల్లోని రాగద్వేషాలు, భావోద్వేగాలు, ఆనంద విషాదాలు సత్యజిత్‌ చూపించినట్టుగా మరే దర్శకుడు తెరకెక్కించలేకపోయాడు. వివిధ అంశాలతో ఆయన 27 సినిమాలు తీశారు. షార్ట్‌ సినిమాలు, డ్యాకుమెంటరీలు కలిపి మొత్తం 37 ఉన్నాయి.

సరిగ్గా 101 సంవత్సరాల కిందట కలకత్తాలో జన్మించారు సత్యజిత్‌ రాయ్‌. ప్రెసిడెన్సీ కాలేజీలో ఎకనామిక్స్‌ చదువుకున్నారు. తమ కుటుంబానికి సన్నిహితుడైన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ బతికున్నప్పుడే 1940-41లో శాంతినికేతన్‌కు వెళ్లి చిత్రకళను అభ్యసించారు. సినిమాలు, గ్రామ్‌ఫోన్‌ రికార్డులపై ఉన్న ఆసక్తి ఆయనను శాంతినికేతన్‌ను ఎక్కువ రోజులు ఉండనివ్వలేదు. 1942లో తిరిగి కలకత్తాకు వచ్చేశారు. 1943 నుంచి ఓ పుష్కర కాలం పాటు ఓ బ్రిటిష్‌ అడ్వర్‌టైజింగ్‌ కంపెనీలో పని చేశారు. ఆ తర్వాతే సినిమాల్లోకి వచ్చారు. సత్యజిత్‌ రాయ్‌ తాతగారు ఉపేంద్ర కిశోర్‌ రాయ్‌ చౌదరి మంచి సాహిత్యకారుడు. తత్త్వవేత్త కూడా. ఆయన కుమారుడు సుకుమార్‌ అంటే సత్యజిత్‌ నాన్నగారు బెంగాలీలో నాన్సెన్స్‌ కవిత్వానికి ఆద్యులు. సత్యజిత్‌ రాయ్‌ మూడేళ్లు ఉన్నప్పుడే సుకుమార్‌ కన్నుమూశారు. దాంతో అమ్మ సుప్రభ ఎంతో కష్టపడి రాయ్‌ని పెంచి పెద్ద చేశారు. తల్లి ప్రోద్బలంతోనే ఆయన శాంతినికేతన్‌లోని విశ్వభారతికి వెళ్లారు.

1928లో బిభూతిభూషణ్‌ బందోపాధ్యాయ్‌ రాసిన పథేర్‌ పాంచాలి నవల ఆధారంగా సినిమా తీయాలని అప్పుడే నిర్ణయించుకున్నారు రాయ్‌. స్క్రిప్ట్‌ రాసుకున్నారు. అంతకు ముందే కలకత్తా ఫిల్మ్ సొసైటీని స్థాపించడంలో ప్రముఖ పాత్ర నిర్వహించాడు. 1949లో కలకత్తాకు వచ్చిన ప్రసిద్ధ ఫ్రెంచ్ దర్శకుడు ఝాఁ రెన్వార్ వెంట తిరిగి నవతరం సినిమా గురించి ఆకళించుకున్నాడు. ఇటాలియన్‌ డైరెక్టర్‌ విట్టోరియో డిసిక డైరెక్ట్‌ చేసిన నియోరియలిస్ట్‌ సినిమా బైసికిల్ థీవ్స్‌ ప్రభావం సత్యజిత్‌రాయ్‌ మీద ఎంతో ఉంది. ఇవన్నీ సినిమాపై శ్రద్ధాసక్తులను పెంచాయి. 1955లో పథేర్‌పాంచాలిని తెరకెక్కించారు. మొదటి సినిమాతోనే దేశ విదేశాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు రాయ్‌. ఆ తర్వాత ఏడాదికొకటి చొప్పున సినిమాలు తీశారు.. అవన్నీ క్లాసిక్స్‌గా పేరొందాయి. ప్రపంచ ప్రసిద్ధి పొందాయి.

కొన్ని బెంగాలీ సాహిత్యం నుంచి తీసుకున్న కథలు. మరికొన్ని సొంతంగా రాసుకున్నవి. ప్రేమ్‌చంద్‌ కథను కూడా తెరకెక్కించారు రాయ్‌. సీరియస్‌ సినిమాలే కాదు.. పిల్లల కోసం కూడా సినిమాలు తీశారు. వాటిల్లో సున్నితమైన హాస్యం, వ్యంగ్యం ఉండేవి. కంప్యూటర్‌ ఫాంట్‌లు జనబహుళ్యంలోకి రాకముందే రాయ్‌ బెంగాలీ అక్షరమాలలో కొత్త శైలులను ప్రవేశపెట్టారు. మన బాపు ఫాంట్‌లాగే అన్నమాట! అనేక కథలు రాశారు. నవలలూ రాశారు. బోలెడన్నీ వ్యాసాలు రాశారు. సైన్స్‌ ఫిక్షన్‌, డిటెక్టివ్‌ కథలు కూడా సత్యజిత్ రాశారు. నాలుగు దశాబ్దాల పాటు సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగారు. లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్ ఆస్కార్‌ను అందుకున్న తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు.. భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారం భారతరత్నను కూడా అందుకున్నారు.

Read Also…  PM Modi In Germany: బెర్లిన్‌లో ప్రధానికి ప్రవాస భారతీయుల ఘనస్వాగతం.. మోదీ మనసు దోచిన చిన్నారి!