RRR Movie: ఆర్.ఆర్.ఆర్ సినిమా సృష్టించిన సంచలనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఓ అద్భుతాన్ని సృష్టించింది. రాజమౌళి అద్భుత దర్శకత్వ ప్రతిభ, రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల మహా నటన సినిమాను విజయ తీరాలకు చేర్చింది. సినిమాలోని ప్రతీ సన్నివేశాన్ని రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించిన తీరుకు ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. ఇలా సినిమాకు హైలెట్‌గా నిలిచిన సన్నివేశాల్లో బ్రిడ్జ్ సీక్వెన్స్ ఒకటి. సినిమాలో భీమ్, రామ్ పాత్రలను కలిపేందుకు దర్శకుడు ఈ సన్నివేశాన్ని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఈ అద్భుత సన్నివేశాన్ని ఎలా తెరకెక్కించారో వివరిస్తూ ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో చూస్తుంటే సన్నివేశం అంతలా అద్భుతంగా రావడానికి చిత్ర యూనిట్ ఎంత కష్టపడిందో అర్థమవుతోంది. ముఖ్యంగా ఈ వీడియోకు గ్రాఫిక్ అందించిన డెన్మార్క్‌కు చెందిన గ్రాఫిక్ టీమ్. అలాగే బ్రిడ్జి నమూనా కోసం రాజమండ్రిలోని గోదావరి బ్రిడ్జిని పరిశీలించడం, అలాగే రైలులో ఉన్న సిలిండర్‌లను తయారు చేసిన తీరును ఈ వీడియోలో వివరంగా చూపించారు. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ విజువల్ వండర్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..