వరకట్నం వేధింపులు తాళలేక ప్రముఖ సింగర్ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. గత కొన్ని రోజులు క్రితం తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన ఆ సింగర్.. ఆదివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కన్నడలో పలు చిత్రాల్లో పాటలు పాడి మంచి క్రేజ్ సంపాదించుకుంది సింగర్ సుస్మితా రాజె(26). ఆమెకు ఏడాదిన్నర క్రితం శరత్ కుమార్ అనే వ్యక్తితో వివాహమైంది. మొదట్లో అత్తింటి వారు బాగానే చూసుకున్నప్పటికీ.. ఆ తరువాత వరకట్న వేధింపులు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులు క్రితం పుట్టింటికి వచ్చింది సుస్మిత. ఇక ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తన తల్లి, సోదరుడు సచిన్‌కి మెసేజ్ చేసిన సుస్మిత గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఉదయం 5.30గం.లకు నిద్ర లేచిన సచిన్.. ఆ మెసేజ్ చూసిన వెంటనే ఆమె గదికి వెళ్లాడు. అయితే ఆలోపే సుస్మిత చనిపోయింది. వెంటనే ఆమె సోదరుడు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా అదనపు కట్నం కావాలంటూ అత్తింటి వారు చేస్తోన్న వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకున్నానని సుస్మిత సూసైడ్ నోట్‌లో పేర్కొంది. భర్త శరత్, అత్త వైదేహీ, భర్త సోదరి గీత తనను వేధిస్తున్నారని ఆమె అందులో తెలిపింది.