Pingali: మాటల మాంత్రికుడు.. శృంగార, హస్య, బీభత్స క్రోధాది నవ్య నవరసాగేంద్రరావు

నెరసిన తెల్ల జుట్టు, గౌరవభావం కలిగించే తెల్ల ఫ్రేము కళ్లజోడు, తెలుగుతనం ఉట్టిపడే తెల్లటి సగం చేతుల జుబ్బా, అంతకు మించి తెల్లని మల్లు పంచె... వీటన్నింటి వెనుకా దాగున్న నల్లటి మేనిఛాయ...ఆయనే పింగళినాగేంద్రరావు.

Pingali: మాటల మాంత్రికుడు.. శృంగార, హస్య, బీభత్స క్రోధాది నవ్య నవరసాగేంద్రరావు
Pingali Nagendra Rao
Follow us
Balu

| Edited By: Surya Kala

Updated on: Dec 29, 2021 | 3:27 PM

Pingali Nagendra Rao Birth Anniversary: ఆయన సినిమాకి కొత్త మాటలు చెప్పాడు. కొత్త దారిని చూపాడు. కొత్త నడక నేర్పించాడు. రసమయ జగమును రాసక్రీడకు ఉసిగొలిపినట్టు సినీమయ జగమును రాతక్రీడకు ఉసిగొలిపాడు. నెరసిన తెల్ల జుట్టు, గౌరవభావం కలిగించే తెల్ల ఫ్రేము కళ్లజోడు, తెలుగుతనం ఉట్టిపడే తెల్లటి సగం చేతుల జుబ్బా, అంతకు మించి తెల్లని మల్లు పంచె… వీటన్నింటి వెనుకా దాగున్న నల్లటి మేనిఛాయ…ఆయనే పింగళినాగేంద్రరావు. శృంగార, హస్య, బీభత్స క్రోధాది నవ్య నవరసాగేంద్రరావు. ఇవాళ ఆయన జయంతి. సినీ జగత్తును తన మాటల మాయాజాలంతో అచ్చెరువొందించిన ఆ మహా మాటల మాంత్రికుడిపై సంక్లిప్త కథనం.

1

1

పదబంధాలతో ఆడుకోవడం, వాక్యాలతో పాడుకోవడం వాటితో జనాన్ని ఆకట్టుకోవడం పింగళికి కలంతో పెట్టిన విద్య. పాళితో వెటకారాలు, చమత్కారాలు నూరడం..అవి జనం కోరడం పరిపాటిగా మార్చిన ఘనుడు. ఆయనే అంటారు… ఎవరు పుట్టించకుండా మాటలెలా పుడతాయని? నిజమే ఎవరు పుట్టించకుండా మాటలెలా పుడతాయి..అందుకే ఆయన కొత్త కొత్త మాటలను సృష్టించారు. అవి జనబాహుళ్యంలోకి తీసుకెళ్లారు. అవి జనాల నోళ్లలో కలకాలం నానేలా చేయగలిగారు. దటీజ్‌ గింబళి నాగేంద్రరావు. ఆ కలం సృష్టించిన మాటలు, పాటలు కోట్లాది మంది సినీ ప్రేక్షకుల మీద మత్తుమందు జల్లి తమ వశం చేసుకున్నాయి. రాబోయే తరాల వారిని కూడా చేసుకుంటాయి. ఏదైనా మ్యాజిక్కో, మంత్రమో మాయాజాలమో చేసే మేజిషియన్లు… అలా చేసినట్టు అభినయించే చిన్నారుల అసంకల్పింతంగా అనే మాట హాంఫట్‌.. ఈ మాట మనకు పరిచయం చేసింది పింగళే. ఆశ్చర్యం వద్దు. నిజంగానే పింగళే! అదొక్కట్టే కాదు.. ఇంకా బోల్డన్నీ గురూ! అన్నట్లు గురూ అన్న పదాన్ని కూడా కాయిన్‌ చేసింది ఆయనే!

2

2

సన్నివేశం ఎలాంటిదైనా చమత్కారాలతో నడపడం పింగళి ధోరణి. నవ రసాల్లో హాస్య రసానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారాయన. మనం చేసేది జనం చూడటం కాదు.. జనం కోరేది మనం చేయడం.. ఈ సూత్రానికి కట్టుబడిన గట్టి కవి. ఘాటు ప్రేమలు, కన్నెకాటులు, వీరతాళ్లు, ఆలమలాలు, సత్యపీఠాలు, ప్రియదర్శినిలు.. ఎన్ని చమక్కులు..ఎన్ని మాటల గిమ్మిక్కులు.. ఎన్ని పాటల మ్యాజిక్కులు. పాతాళభైరవి సినిమా పింగళి కలంలోని అన్నీ ప్రతిభా పాటవాలను ప్రేక్షకులకు పరిచయం చేసింది. డైలాగులంటే ఇలాగుండాలి… డైలాగుల్లో పంచ్‌ ఇలాగుండాలి అని నిరూపించిందీ సినిమా. సాహసం శాయరా ఢింబకా, నరుడా ఏమీ నీ కోరిక, మహా జనానికి మరదలు పిల్ల, బొడ్డు దేవర, నిజం చెప్పమంటారా.. అబద్ధం చెప్పమంటారా, మోసం గురూ, డింగరీ, ఢింబకా, నాకేసి చూడవే బుల్‌బుల్‌, మరీ మనకు అడ్డేమిరా.. మీ గడ్డమే గురూ , తప్పు తప్పు… ఇక మాయాబజార్‌ సినిమాలో అయితే పింగళి విజృంభిచేశాడు. అదే మన తక్షణ కర్తవ్యం, ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి వుండనే వుంది, ప్రతాపవంతులకు ఎక్కడున్నా కుశలమే, రసపట్టులో తర్కం కూడదు. మీరు ధర్మాత్ములు కాదని తేలినా అన్నగారితో ప్రమాదమేనే… మీ శాస్త్రాలు సామాన్యుల కోసం కౌరవుల వంటి అసాధరణ అపూర్వ జాతకుల కోసం కాదు, వివాహ కార్యక్రమానికి అతి ముఖ్యమైన చిట్ట చివరి క్రియ ఇది.. అంటే అంత్యక్రియ, గోంగూర శాకాంబరిదేవి ప్రసాదం. ఇంకా చాలా ఉన్నాయి ఆ సినిమాలో! పింగళి సృష్టించిన పాత్రల పేర్లు కూడా గమ్మత్తుగా వుంటాయి. సదాజప, నేపాళ మాంత్రికుడు, తోటరాముడు, రాజుగారి బామ్మర్దిది ఇలా… ఇదే ట్రెండును తర్వాతి సినిమాల్లో కూడా కొనసాగించారాయన. నిక్షేపరాయుడు, ఆటకోటి దయ్యాలు, ఏకాశ, రెండు చింతలు, త్రిశోకానందుడు, బాదరాయణ ప్రగ్గడా…. వింతగా లేవు పేర్లు!? అందుకే ఆయన కొత్త పదాలకు నిత్య కంబళిగా మారాడు.

జానపదాలైనా… పౌరాణికాలైనా వ్యవహారిక భాషనే ఉపయోగించేవాడు పింగళి. ఏ పాత్ర కూడా కృత్రిమంగా సంభాషణలు చెప్పినట్టు అనిపించదు. పాటలూ అంతే.. జనం పాడుకున్నట్టే వుంటాయి. అందుకే ఆ పాటల ఆ పల్లవులు సినిమా టైటిళ్లయ్యాయి. నానుడిలయ్యాయి. సంస్కృత, పాళీ, ప్రాకృత భాషలన్నింటినీ తన వీలు వెంబడి వాడుకున్నాడు. మంత్రపుష్పంలో సుస్వరంగా వినిపించే వేద మంత్రాలను తిరగరాసి నేపాళి మాంత్రికునితో చిత్రాతిచిత్రమైన భాషగా పలికించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పింగళి అచ్చంగా అక్షర మాంత్రికుడు. ఆహాలు, ఓహోలు వేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఆయన పాటలను జాగ్రత్తగా పరిశీలిస్తే కొకొల్లలు దొరుకుతాయి. శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్‌ జరుగుతున్న సమయమది. అన్ని మంచి శకునములే పాటకు వరస కడుతున్నారు పెండ్యాల నాగేశ్వరరావు. మనసున మంగళ వాద్యములు మ్రోగెలే అని రాశాడు పింగళి. తాళమేమో కుదరడం లేదు. నానా కష్టాలు పడుతున్నాడు పెండ్యాల. ఎందుకు నాగేశ్వరరావు అవస్థ? మనసున మంగళ వాద్యమాహా మ్రోగెలే అని ఆహాని మధ్యలో పడేయ్‌.. తాళం చచ్చినట్టు కుదురుతుంది అని సింపిల్‌గా తేల్చిపారేశాడు పింగళి.

3

3

రేలంగి ఓసారి అడిగారు… కవిగారు ! మీరు బ్రహ్మచారి..శృంగార రసం ఎరుగని వారు. మరి శృంగారప్పాటలు, సన్నివేశాలు అంత గొప్పగా ఎలా రాయగల్గుతున్నారు? అని..దానికాయన … ‘రేలంగి.. శృంగారం రాయడానికి అనుభవం అక్కర్లేదు. యుద్ధపు దృశ్యాలు రాయాలంటే యుద్ధాలు చేయాలా ఏమిటీ? నువు రేలంగివి, నేను పింగళిని. అంటే కవిని.. రవిగాంచనివి కవిగాంచును. రేలంగి గాంచనివి పింగళి గాంచును. అదీ తేడా’ . అని చమత్కరించారు పింగళి. పాత్రలను సృష్టించడంలో పింగళి ఎంత గొప్పవాడో మాటలు పుట్టించడంలోనూ అంతే.. ఇక పాటలు రాయడంలో కూడా అంతటి ధురంధరుడే. చందమామ చల్లగా… మత్తు మందు చల్లగా వంటి చిన్న చిన్న తమాషాలతో శ్రవణేంద్రీయాలకు హాయి పుట్టించడం ఆయనకు మాత్రమే తెలిసిన కళ. పెళ్లి చేసి చూడులో జోగారావు, సావిత్రి మధ్య ఓ డ్రీమ్‌ సాంగ్‌ వుంది. జోగారావేమో అర్జునుడు.. సావిత్రేమో ఊర్వశి. అందులో అర్జునుడంటాడు.. చాలు చాలు నీ సాముదాయకపు వలపు పంపిణీ… అని. అంటే కో ఆపరేటివ్‌ విధానంలో ఊర్వశి తన ప్రేమను పంచుతుందన్నమాట. అదే పాటలో యుగయుగాలుగా.. జగజగాలుగా అంటాడు. జగజగాలుగా అనే పదం లేదు. అది పింగళి సృష్టే. తప్పు కదండి అంటే…ఔచిత్య భంగం కాకుండా ఓ పదం వేస్తే బాగుంటుందనుకున్నప్పుడు వేసేయడమే. ఆలోచన అక్కర్లేదు అనేవాడు పింగళి నవ్వుతూ.. ఈ పాటలోనే ఊగించిన ఉర్రూగించిన అని వాడాడు. తప్పు అని కాకపోయినా అవసరం అనుకుంటే హ్రస్వీకరించి అర్ధమయ్యేట్లుగా మాటని వాడుకోవడంలో తప్పులేదు.. నా ఉద్దేశంలో భావం భాషకీ బందీ అయిపోకూడదు అని మొండిగా వాదించేవాడా మొండిఘటం. పాతాళభైరవిలో ఎంత ఘాటు ప్రేమయో అన్నందుకు భాషా పండితులు నానా యాగీ చేశారు. దుష్ట సమాసం అనీ, భావ ప్రకటన కూడా సరిగాదనీ విమర్శించారు. దీనికీ జవాబిచ్చాడు పింగళి. హీరో తోటరాముడు మోటువాడు.. మరి వాడి ప్రేమ ఘాటుగా వుండక.. నీటుగా వుంటుందేమిటీ అని ఎదురు ప్రశ్నించాడు. పైగా తోట రాముడి ప్రేమ యువరాణికి ఘాటుగా కనిపించింది కాబట్టే అని పాడుకుంది.. సమాసాలు కూడా మడి కట్టుకుని పేర్చుకోనక్కర్లేదు. గర్భగుడి వంటి మాటలు ఎన్నో వాడుకల్లోనూ రాతల్లోనూ వస్తున్నాయి…. అంటూ పండితుల నోళ్లు మూయించాడు. అదీ ఆయన పాండిత్యం వల్ల వచ్చిన మొండితనం.. ఆ మొండితనం తెచ్చిన ధైర్యం.

4

4

పింగళి కథా కల్పనలో విశిష్టత వుండేది. సన్నివేశాల అల్లికలో విజ్ఞత వుండేది. పాత్ర చిత్రణలో చతురత వుండేది. ప్రత్యేకమైన భాషా సౌందర్యమే ఆయనను శిఖరాగ్రాన చేర్చింది. తెలుగు సినిమా మాటల ఎవరెస్ట్‌పై మొదట అధిరోహించింది ఈయనే! ఇంకొకరు అధిరోహిస్తారనుకోవడం అత్యాశే! సంస్కృతాంధ్ర భాషల్లో వైదుష్యం గల నాగేంద్రరావు సినిమాలకు రాకముందు నాటకాలు రాశారు. సినిమా సాహిత్యానికి సౌగంధికాలను అద్ది…సుసంపన్నం చేసి పింగళి 1901 డిసెంబర్‌ 29న బొబ్బిలి దగ్గర రాజాం గ్రామంలో జన్మించాడు. పింగళి తల్లిగారు మమాలక్ష్మమ్మ కవయిత్రి. చిన్నతనంలోనే పింగళికి భారత భాగవత రామాయాణాదులను పాటలో రూపంలో పరిచయం చేసిందావిడ. అసలు పింగళి వంశం పూర్వీకులు మహారాష్ర్టలోని పింగళ గ్రామానికి చెందిన వారు. 14వ శతాబ్దంలో కృష్ణా తీర ప్రాంతానికి వలసవచ్చారు. గోల్కొండ ప్రభువు తానీషా దగ్గర మంత్రులుగా వున్న అక్కన్న మాదన్నలు పింగళి వంశం వారే! మళ్లీ నాగేంద్రరావు విషయానికొస్తే…తండ్రి గోపాలకృష్ణయ్యకు యార్లగడ్డలో కరణీకం దొరకడంలో పింగళి బాల్యము, విద్యాభ్యాసము అంతా బందరులోనే సాగింది.

విద్యార్థిగా వున్నప్పుడు భోగరాజు పట్టాభిసీతారామయ్య, ముట్నూరు కృష్ణారావు వంటి ప్రముఖుల ఆశీస్సులతో రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టారు. 1917లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ డిప్లమో పొందాడు. బందరులో కొంతకాలం టీచర్‌గా పని చేశాక..ఖరగ్‌పూర్‌ రైల్వే వర్క్‌షాపులో అప్రెంటెస్‌గా చేరాడు. ప్రసిద్ధ యోగ వ్యాయామ మాస్టారు బులుసు రమాజోగారావు ఉపన్యాసాలకు ఉత్తేజితుడై ఆ ఉద్యోగానికి రిజైన్‌ చేసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. థియోసాఫికల్‌ సొసైటీలో మెంబరై నార్త్‌ ఇండియా అంతా చుట్టి చివరకు సబర్మతీ ఆశ్రమం చేరుకున్నాడు. ఆ సమయంలోనే జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలని డిసైడయ్యాడు. తర్వాత శారదలో సబ్‌ ఎడిటర్‌గా చేరాడు. ఆ పత్రిక నిలిచిపోవడంతో ప్రఖ్యాత రంగస్థల నట దర్శకులు డి.వి.సుబ్బారావుగారి ఇండియన్‌ డ్రమెటిక్‌ కంపెనీలో చేరి 1946 వరకు సెక్రటరీగా చేరాడు. ఇదిలావుంటే 1941లో భలేపెళ్లి తారుమారు చిత్రాలకు పని చేసే అవకాశం వచ్చింది. అయితే సెకండ్‌ వరల్డ్‌ వార్‌ కారణంగా సింగళి మళ్లీ బందరుకొచ్చేశాడు. 1946లో డాక్టర్‌ దుర్గా నాగేశ్వరరావు, డి.వి.సుబ్బారావులు పింగళిని పిలిపించారు. తన వింధ్యరాణి నాటకాన్ని సినిమా రచనగా అందించారు. కానీ వింధ్యరాణి చిత్రం ఫెయిలయింది. పింగళి పూర్తిగా నిరాశ చెందాడు. తిరిగి బందరుకొచ్చేశాడు. అదే సమయంలో మిత్రుడు కమలాకర కామేశ్వరరావు పింగళికి ధైర్యం చెప్పి వాహినీకి పరిచయం చేశాడు. వారి కోరిక మీద షేక్‌స్పియర్‌ కింగ్‌లియర్‌ నాటకాన్ని తెలుగైజ్‌ చేసి గుణసుందరి కథ రాశాడు. అంతే పింగళి మళ్లీ వెనక్కీ తిరిగి చూడలేదు. వాహినీ నుంచి విడివడిన విజయా సంస్థకు ఆస్థాన కవిగా రాణించాడు. ఆరో దశకంల కొన్ని ఇతర సంస్థల చిత్రాలకు మాటలు పాటలు రాశారు. కొన్ని చిత్రాలకు కథ మాటలు మాత్రమే రాశారు. నాగసుందరి కథ స్ర్కిప్టు రాశాక నిర్మాణం ఆగిపోయింది. తన చివరి రోజుల్లో ఆర్ధిక ఇబ్బందులకు లోనయ్యాడు. విజయా సంస్థలో ఉద్యోగం పోయాక పింగళి కాలు చేయి ఆడలేదు. క్షయ, ఉబ్బస వ్యాధులు పట్టి పీడించాయి. తన ప్రియ నేస్తం విజయా సంస్థ పెద్ద దిక్కు కె.వి.రెడ్డి చనిపోయాక మరింత వేదనకు లోనయ్యాడు. 1971 మే ఆరున పింగళి దివంగతుడయ్యాడు. ఎన్‌టి రామారావు నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన చాణక్య చంద్రగుప్త మాటల రచయితగా పింగళి చివరిచిత్రం. పింగళి చనిపోయాక ఆరేళ్లకు ఈ సినిమా వచ్చింది.

పింగళి మాటలు పాటలు సంక్లిష్టమైన శిలాపాక ప్రబంధాలేమీ కావు. పండితులకు మాత్రమే అర్థమయ్యే నైషధ కావ్యాలసలే కావు. సామాన్యులను అలరించే సాహితీ సుగంధ ఓషధులు. సంస్కృతీకరించిన పద పల్లవాలతో జాను తెలుగు పలుకుబడితో చిత్ర విచిత్రాది పద ప్రయోగాలతో, చమత్కారాలతో కొత్త ఒరవడి తీసుకొచ్చాడు. రచయితలకు ఆయన దిశా నిర్దేశకుడు. పింగళి సాహిత్యంలో ఓ గొప్ప విశేషం వుంటుంది. అదేమిటంటే ఓ పాత్రతో భూత, వర్తమాన, భవిష్యత్‌ కాలాలకు సంబంధించి క్లుప్తంగా ఒక్క మాట చెప్పించడం. ఫర్‌ ఎగ్జాంపుల్‌ మాయాబజార్‌నే తీసుకోండి.. అందులో సుభద్ర, అభిమన్యులను ఘటోత్కచుని ఆశ్రమంవైపుగా వెళుతున్నప్పుడు అక్కడ ఘటోత్కచుని మాయాజాలంతో కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు రథచోదకుడు అభిమన్యుడితో వెనుదిరిగిపోదామా అంటాడు. దానికి అభిమన్యుడు వెనక్కి తిరగడం మనకు తెలియని విద్య అంటాడే తప్ప వీరుడు వెనక్కి తిరగడు అని అనడు. సుభద్ర గర్భంలో వున్నప్పుడే అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్లడం మాత్రమే చెప్పడం.. కృష్ణుని మాయవల్ల వెనుతిరిగి రావడం చెప్పకపోవడం మనకు తెలిసిందే. అంటే తల్లి గర్భంలో వున్నప్పుడే అభిమన్యుడికి ముందుకు పోవడమే తెలుసు కానీ వెనుతిరగడం తెలియదని పింగళి ఒక్క ముక్కలో చెప్పయలేదూ! అసలు మాయాబజార్‌ సినిమాకు ప్రాణం పింగళినాగేంద్రరావే! గిట్టని వాళ్లను ఎవరైనా మా కర్మ కొద్ది దొరికావయ్య అంటూ ఈసడించుకుంటారు.

కాని పింగళి మాత్రం మా భాగ్యం కొద్ది దొరికావయ్య అంటూ మెచ్చుకుంటున్నట్టుగా తిట్టేస్తాడు. గుండమ్మ కథలో ప్రేమ యాత్రలకు బృందావనము అన్న పాటుంది. అందులో జగమునే ఊటీ శాయగా అంటాడు. అంటే జగాన్ని చల్లబర్చడం అన్నమాట. ఈ సినిమాలోనే కానరాని కోయిలలు మనల మేలుకొలుపగా…. కానరాని కోయిలలు మనకు జోలపాడగా అని రాశాడు. డ్యూయెట్‌లో చేసిన చమత్కారమిది. కోయిల ఒకరిని మేలుకొలుపుతుందట! ఇంకొకరిని జోలపాడి బజ్జోమంటుందట! బ్రహ్మదేవుడిని హొంతకారి అంటే మల్లయుద్ధ ప్రవీణుడిగా చెప్పింది పింగళే! చిటితాళం వేసి చిట్టంటులు చేస్తే సిగ్గు కీలలు సడలిపోతాయట! కీళ్లలో సిగ్గు కీలు ఒకటుంటుందని, అది సడిలిపోతుందని ఎంత గమ్మత్తుగా చెప్పాడు? శాస్ర్తమెప్పుడు నిష్కర్షగా కర్కశంగా చెబుతుందట! అందులో సారాన్ని మాత్రమే గ్రహించాలట! ఎంత గొప్పగా రాశాడనీ! ఒకటా రెండా వందలు వందల మాటలు పుట్టించాడు. ఆ మాటలను ఆ పాటలను నెమరేసుకుంటే తప్ప చెప్పుకుంటే తనవితీరదు. అయినా… ఆ మాటల మరాఠీ గురించి మాటల్లో చెప్పడానికి మనమెంతవారం? తెలుగు సినీ జగత్తులో సినిమాలు….. ఆ సినిమాలకు మాటలు ఉన్నంత కాలం ఆయన చిరంజీవి!

Read Also…  Radhe Shyam: రాధేశ్యా్మ్ ప్రమోషన్స్ షూరు.. మ్యూజికల్ టూర్ స్టార్ట్ చేసిన చిత్రయూనిట్..

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!